“అమ్మా…” గొంతు నరాలు చిట్లిపోయేలా అరిచాడు ‘దోషి’.
“ఒరేయ్… ఆ నోట్లో లాఠీదించి దెం…” యస్సై చెప్పిన మాటని అర్థం చేసుకున్న కానిస్టేబులు దోషి నోట్లో గుడ్డని కుక్కాడు. ఆర్తనాదం అణిగిపోయింది.
బోర్లా పడుకోబెట్టిన దోషి వీపుమీద వొక కానిస్టేబులు తొక్కి కూచుంటే, మరో యిద్దరు కానిస్టేబుళ్ళు అరికాళ్ళమీద లాఠీలతో బాదుతూనే వున్నారు. చాలక యస్సై బూటుకాళ్ళతో దోషి రెండు కాళ్ళను తొక్కుతూ జాగింగు చేశాడు. పెనుగులాడుతున్నా దోషి గొంతునుండి యే శబ్దమూ లేదు. ఓ అరగంటకు అలుపొచ్చి అంతా ఆగారు. అంతకు ముందే దోషి శరీరం కూడా మొద్దుబారినట్టు కదలలేదు.
అప్పుడు యస్సై అనుమతితో దోషి నోట్లో కుక్కిన గుడ్డని తీశాడు కానిస్టేబులు. అతని కనుకొలకులలోంచి ధారకడుతూ నీళ్ళు.
“పై నుంచి ఆల్లు గుద్ద దెం…తుంటే, నేను నీ గుద్ద దెం… తప్పదు” అన్నాడు ఆయాసపడుతూ రెండుగ్లాసుల నీళ్ళు తాగిన యస్సై.
ఓ పూట తరువాత దోషిని నడవమన్నారు. నడవలేకపోయాడు. బలవంతగా నడిపిస్తే పడిపోయాడు. సర్కారు దవాఖానకు తీసుకువెళ్ళారు. గోళీలు వేసుకోమని యిచ్చి “తండా లం..కొడకా, ఆడదానివారా నువ్వు? మీ తండా నా కొడుకులు దున్నపోతుల్లాగా గట్టిగా వుంటారు కదరా” నవ్వారు పోలీసులు.
అటునుంచి అటే దోషిని కోర్టుకు తీసుకుపోయారు. రెండువారాలు జైళ్ళో వేశారు.
ఇంటికొచ్చాక నీళ్లోసుకున్న పెళ్ళాం బోరున యేడ్చింది. ఇద్దరు చంటిబిడ్డలు బిక్కటిల్లి యేడుస్తూ దోషి కాళ్ళను చుట్టేశారు. అందరూ యేడ్చుకున్నారు, వొంట్లో నీళ్ళు యిగిరేదాక.
పదిరోజులుగా ఫైనాన్స్ కట్టలేదని వోనర్ ఆటో తీసుకుపోయాడు.
అప్పడు పెళ్ళాం అడిగింది.
“ఆటో నడ్పుకొనే నువ్వెందుకు పోయినవ్? నువ్వేమన్నా రైతువా? యూరియా రాకపోతే నీకేంది? పంట సచ్చిపోతే నీకేంది? దర్నాకి నువ్వెందుకు పోయినవ్?”
యస్సై కూడా అచ్చం యిదే మాట అన్నాడు. పెళ్ళామూ అదే అంది. ఫ్రెండ్సూ అదే మాట అన్నారు. ‘అయ్యో’ అని జాలిపడ్డ యిరుగుపొరుగు అదేమాట అన్నారు.
అప్పుడు యస్సై కొడుతున్నప్పుడూ కోర్టులోనూ చెప్పే అవకాశం లేకపోయింది. అందరూ అంటున్నప్పుడూ గొంతుకు గుండె అడ్డం పడి చెప్పలేకపోయాడు. పెళ్ళాం అడిగినప్పుడూ చెప్పలేకపోయాడు.
ఆ చీకటిరాత్రి గుమ్మంలో నిండు చూలాలుగా వున్న పెళ్ళాం నడుము చుట్టూ చేతులు వేసి యెత్తైన పొట్టమీద తలపెట్టి వెక్కివెక్కి యేడ్చాడు. దుఃఖం పట్టలేని గొంతుతో చెప్పాడు.
“నేను రైతుని కాకపోవచ్చు. కుంట బూమీ లేకపోవచ్చు. కాని ఆ రైతు పండించిన బువ్వ తిన్నోన్ని. రైతుకి కష్టమొస్తే నేను ఆదుకోలేను, సాదుకోలేను. యేమీ చెయ్యలేను. అందుకే ఆల గొంతుల గొంతు కలిపిన్ను. ఆలలో వొకడిగా రోడ్డుమీద కూర్సున్న. తోటి మనిషి కష్టం తెలిసినోన్ని. ఆల పక్కన దన్నుగా నిలబడ్డాను. ఇది యింత తప్పని నాకు తెలీదు…”
పెళ్ళాం మగని కళ్ళు తుడిచింది.
ఆమె కడుపులోని శిశువు గిర్రున తిరుగాడి కాళ్ళతో తన్నింది.
పురిటి నొప్పులు మొదలయ్యాయేమో ఆమె మెలికలు తిరుగుతూ కళ్ళుమూసి తెరిచి పైకి ఆకాశంవంక చూస్తుంటే, దోషి కూడా అటే చూశాడు.




