సింగరేణి బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

– టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిరియాల డిమాండ్‌

గోదావరిఖని, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థకు ఇప్పటివరకు ట్రాన్స్‌కో, జెన్‌కోల నుంచి బొగ్గు అమ్మకాల ద్వారా బకాయిలు రూ.47 వేల కోట్లకు చేరుకున్నాయని, వీటిలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లోనే రూ.24 వేల కోట్లకు పేరుకుపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదని విమర్శించారు. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో కార్మికులకు జీతాలు చెల్లించడానికి సింగరేణి సంస్థ ఓవర్‌ డ్రాప్ట్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వ కాలంలో సంస్థను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడంతోపాటు కార్మికుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో సింగరేణి సొమ్మును వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోతున్నా ఆ విషయంలో గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సింగరేణి నిధుల దుర్వినియోగంపై, సంస్థకు రావాల్సిన బకాయిలపై సింగరేణి సంస్థ ద్వారా పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు గత రెండేళ్ల కాలంలో కార్మికులకు సంబంధించిన ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయలేదని, సంస్థ నిర్వీర్యం అవుతున్నా పట్టించుకోవడంలేదని అన్నారు. ఇవి చాలదన్నట్లు టీబీజీకేఎస్‌పై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో టీబీజీకేస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామ్మూర్తి, నాయకులు నూనె కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *