
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యులు
9701047002
తెలంగాణ రాష్ట్రంలో మహిళల సామాజిక,ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక సంఘాలు ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలికాయి.మహిళా సాధికారతలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నది.స్వయం సహాయక సంఘాల లోని మహిళా శక్తి నేడు ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామ్యమై కుటుంబాన్ని, సమాజాన్ని ,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నవి. సెర్ప్, మెప్మా సంస్థల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో భాగమై ఆర్థిక స్వాతంత్రం పొందుతున్నారు.ప్రస్తుతం మహిళా సంఘాల్లో 65 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. కొత్త సభ్యుల నమోదుతో మహిళా సభ్యుల సంఖ్య కోటికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ముఖ్యంగా గ్రామీణ మహిళలు వివక్షను దాటి బయటకు వస్తున్నారు.ఉపాధి అవకాశాలకు దారులు వెతుక్కుంటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో పథకాలు వారు ఆర్థికంగా బలోపేతమగుటకు దోహదపడుతున్నవి. కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 చేపట్టింది. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా రుణాలు అందించి వారు వ్యాపారవేత్తలుగా ఎదగాడానికి మార్గదర్శకత్వం నిర్దేశిస్తున్నది. తాము ఆర్థికంగా ఎదగడం కొరకు తీసుకున్న లోన్లను తిరిగి చెల్లించుటలో తొంబై ఎనిమిది శాతానికి పైగా మహిళలు ముందున్నారు.
సూపర్ మార్కెట్ లు, కుట్టు శిక్షణ కేంద్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, హస్తకళా ఉత్పత్తుల మార్కెటింగ్ ,పౌల్ట్రీ, పశుపోషణ లాంటి అనేక వ్యాపారాల్లో నేడు మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగాల్లో దూసుకుపోతున్నారు.పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించుట, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల నిర్వహణ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కుట్టే బాధ్యతలు స్థానిక మహిళా సంఘాలకు అప్పజెప్పడంతో మహిళా సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ లు, రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ తదితర ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా సంఘాల ద్వారానే దిగ్విజయంగా లాభాల బాట నడుస్తున్నవి. నారాయణపేట, సంగారెడ్డిలలో జిల్లా మహిళా సమైక్యలు పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ లాభాల బాటలో నడుస్తున్నవి.మహిళా సంఘాలు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మేలా సోలార్ ఒప్పందాలు జరుగుతున్నాయి. మహిళా సంఘాలు ఆర్టీసీ బస్సులను కొని ఆర్టీసీకి లీజుకు ఇచ్చి బస్సులకు యజమానులుగా మారి లాభాలను గడిస్తున్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి రాజధాని నడిబొడ్డున మాదాపూర్లో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసి 106 దుకాణాల సముదాయాలు ఏర్పరిచి మహిళా సంఘాలకు కేటాయించడం జరిగినది. హైదరాబాద్ లోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం డ్రైవింగ్ లో శిక్షణ ఇప్పించి ఉమెన్ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఆటోలు మరియు కార్లు లోన్ ద్వారా ఇప్పించి వారిని వాటికి యజమాలుగా చేసి వారు వారి కాళ్లపై స్వతంత్రంగా నిలబడేగా చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో డ్రోన్లు ద్వారా వ్యవసాయ పంటలకు ఎరువులు చల్లే విధానంపై మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించి వారికి బ్యాంకుల ద్వారా డ్రోన్లు ఇప్పించడం ద్వారా వారు గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో డ్రోన్లు ఉపయోగిస్తూ అధిక ఆదాయం పొందుతూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు.
ప్రభుత్వం మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ సంక్షేమ పథకాల అమలులో వారిని భాగస్వామ్యం చేస్తూ వారు ఆర్థికంగా పరిపుష్టి చెందేలా చర్యలు తీసుకుంటున్నది.ఆర్థికంగా మహిళల్లో స్వయం శక్తి పెరగడంతో వారి రోజువారి ఖర్చులకు కుటుంబ సభ్యులపై ఆధారపడడం తగ్గిపోయింది, ఆర్థికంగా నిలబెట్టుకోవడంతో కుటుంబ నిర్ణయాల్లో వారి భాగస్వామ్యం పెరిగింది, స్వయం సహాయక సంఘాల సమావేశాల ద్వారా వారిలో ధైర్యం, ప్రశ్నించే తత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందాయి. దానితో వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. పిల్లల చదువులు, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రతపై వారికి అవగాహన పెరిగింది. తమ సంపాదనలతో వారు వారి కుటుంబాల ఆరోగ్యం, పిల్లల విద్య మరియు పౌష్టికారంపై ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు. మన రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వారికి స్వయం సహాయక సంఘాల నిర్వహణపై శిక్షణ ఇస్తూ గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్నారు. దీనితో ఇతర రాష్ట్రాల్లోని మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో తెలంగాణ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. నేడు స్వయం సహాయక సంఘాలు కేవలం పొదుపు సంఘాలుగా కాకుండా స్వయం సమృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయనుటలో ఎలాంటి అతియోశక్తి లేదు.
మహిళలు ఆర్థికంగా బలపడడం వలన దేశ ఆర్థిక అభివృద్ధి పెరుగుతున్నది. మహిళా సాధికారతలో కీలకమైనది ఆర్థికసాధికారిత. తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళలు ఆర్థిక సాధికారతలో ముందున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047″లో మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ఇందిరా మహిళా శక్తి స్టాల్ సెర్ప్ మరియు ఐసిడిఎస్ ద్వారా ఏర్పాటు చేశారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు గ్లోబల్ స్థాయి బిజినెస్ ఉమెన్ గా ఎలా ఎదిగారో ప్రపంచానికి తెలిసేలా ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. 2047 నాటికి భవిష్యత్ తెలంగాణను మహిళలు తీర్చిదిద్దుతారని ఈ సమ్మిట్ లో ప్రస్తావించారు. నాయకత్వం, సృజనాత్మకత, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా సంపద సృష్టించబోతున్నారని ఈ సమ్మిట్ ద్వారా తెలియచేశారు.
మహిళా సాధికారతలో అత్యంత ముఖ్యమైనది మహిళా అక్షరాస్యత. అక్షరాస్యతలో మహిళలు పురుషుల కన్నా వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరూ అక్షరాస్యులు కావాలనే ఉద్దేశంతో “ఉల్లాస్” కార్యక్రమాల ద్వారా వారిని అక్షరాస్యులుగా మార్చే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టింది. అతివలతో అభివృద్ధి అనునది నేడు ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో నిజమవుతున్నది. మహిళలు ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. కుటుంబం ఆర్థికంగా బలపడితే ఆ గ్రామం ఆర్థికంగా బలపడుతుంది. గ్రామం ఆర్థికంగా బలపడితే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది.రాష్ట్రం ఆర్థికంగా బలపడితే దేశం ఆర్థికంగా బలపడుతుంది. మహిళా సాధికారిక మరియు అభివృద్ధి అనునది ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా మనము చూస్తున్న ఒక స్పష్టమైన వాస్తవ దృశ్యం. స్వయం సహాయక బృందాలలోని మహిళలు తాము మహోన్నత శక్తి గా ఎదుగుతూ దేశాభివృద్ధికి తోడ్పడుతున్న తీరు అభినందనీయం.





