జాతి పునర్నిర్మాణానికి రాజ్యాంగ విద్య తరగతి గదిలో తప్పనిసరి

“రాజ్యాంగంలోని లోతైన అంశాలైన న్యాయ సమీక్ష, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదం వంటి వాటిపై విద్యార్థులకు స్వల్ప స్థాయిలో మాత్రమే అవగాహన లభిస్తోంది. విద్యార్థులు రాజ్యాంగ అధికరణల సంఖ్యలను, రాష్ట్రపతుల పేర్లను బట్టీ పడుతున్నారు తప్ప, ఆ అధికరణల వెనుక ఉన్న సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఉదాహరణకు, “ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది” అని రాయడం వేరు, అంటరానితనం అనే దురాచారం ఒక మనిషి గౌరవాన్ని ఎలా దెబ్బతీస్తుందో చర్చించడం వేరు. దీనికి ప్రధాన కారణం, విద్యా ప్రణాళికలో దానికి ఉన్న తక్కువ ప్రాధాన్యత.”

మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, “భిన్నత్వంలో ఏకత్వం” అనే సూత్రంపై ఆధారపడి ఏడున్నర దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశం అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడటానికి ప్రధాన కారణం మన రాజ్యాంగం. అయితే వర్తమాన సామాజిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే, భావి భారత పౌరులైన విద్యార్థులలో రాజ్యాంగం పట్ల కనీస అవగాహన, ఆచరణాత్మక జ్ఞానం తీవ్రంగా లోపిస్తోందనే విషయం స్పష్టమవుతోంది. రాజ్యాంగం అనేది కేవలం న్యాయవాదులకు, చట్టసభల ప్రతినిధులకు సంబంధించిన గ్రంథం కాదు.

అది ప్రతి సామాన్య పౌరుడి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే “జీవన పత్రం”. మన ప్రస్తుత విద్యా వ్యవస్థలో రాజ్యాంగ బోధన అనేది “సాంఘిక శాస్త్రం”లో ఒక చిన్న భాగంగా, కేవలం మార్కుల కోసం కంఠస్థం చేసే అంశంగా మిగిలిపోయింది. దీని పర్యవసానంగా హక్కుల పట్ల స్పృహ లేని, బాధ్యతల పట్ల విముఖత కలిగిన ఒక తరం తయారవుతోంది. ఈ నేపథ్యంలో సెకండరీ విద్య పూర్తి చేసే లోపు ప్రతి విద్యార్థికి రాజ్యాంగంలోని కీలక అంశాలు, మౌలిక విలువలు, ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై సంపూర్ణ అవగాహన కల్పించేలా, దానిని ఒక “ప్రత్యేక సబ్జెక్టు” గా ప్రవేశపెట్టడం, అందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేయడం, తక్షణ అవసరమని విద్యావేత్తలు, రాజ్యాంగ నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు బలంగా వాదిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో, విద్యార్థులు గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులపై చూపే శ్రద్ధను, తమను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే రాజ్యాంగ విద్యపై చూపడం లేదు. ప్రస్తుతం సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ, వివిధ రాష్ట్రాల బోర్డులలో, రాజ్యాంగం, పౌరశాస్త్రం అనేవి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు “సోషల్ సైన్స్”లో ఒక భాగంగా ఉన్నాయి. మిగిలిన సబ్జెక్ట్లతో పోలిస్తే దీనికి కేటాయించే సమయం చాలా తక్కువ. దీనివలన విద్యార్థులు దీనిని చివరి నిమిషంలో చదివే సబ్జెక్టుగా భావిస్తున్నారు. రాజ్యాంగంలోని లోతైన అంశాలైన న్యాయ సమీక్ష, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదం వంటి వాటిపై విద్యార్థులకు స్వల్ప స్థాయిలో మాత్రమే అవగాహన లభిస్తోంది. విద్యార్థులు రాజ్యాంగ అధికరణల సంఖ్యలను, రాష్ట్రపతుల పేర్లను బట్టీ పడుతున్నారు తప్ప, ఆ అధికరణల వెనుక ఉన్న సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఉదాహరణకు, “ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది” అని రాయడం వేరు, అంటరానితనం అనే దురాచారం ఒక మనిషి గౌరవాన్ని ఎలా దెబ్బతీస్తుందో చర్చించడం వేరు. దీనికి ప్రధాన కారణం, విద్యా ప్రణాళికలో దానికి ఉన్న తక్కువ ప్రాధాన్యత.

2020లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం, రాజ్యాంగ విలువల బోధనకు పెద్దపీట వేసింది. “భారతీయత పట్ల గర్వం” , “వసుధైక కుటుంబకం”, “సుస్థిర అభివృద్ధి” వంటి అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని ఇది సూచించింది. ప్రాథమిక హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలను విద్యార్థుల్లో నాటాలని ఇది స్పష్టంగా పేర్కొంది. దీని ఆశయాలు నెరవేరాలంటే, రాజ్యాంగం ఒక విడి సబ్జెక్టుగా ఉంటేనే సాధ్యం. లేదంటే అది కేవలం విధాన పత్రాల్లోని వాక్యాలుగా మిగిలిపోతుంది. రాజ్యాంగ విద్యను తప్పనిసరి చేయడానికి చట్టపరమైన, న్యాయపరమైన మద్దతు కూడా బలంగా ఉంది. న్యాయస్థానాలు అనేక సందర్భాల్లో విద్యార్థులకు రాజ్యాంగ విలువలను బోధించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ కలిగిన ఫిన్లాండ్, పౌరసత్వ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అక్కడ విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే సామాజిక నిర్ణయాల్లో భాగస్వాములవుతారు. జాతీయ కోర్ కరికులం ప్రకారం, విద్యార్థులు తమ పాఠశాల బడ్జెట్, క్యాంటీన్ మెనూ వంటి విషయాల్లో ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వారిలో ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకాన్ని పెంచుతుంది.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో హెచ్చరించినట్లుగా, “రాజ్యాంగ నైతికత” అనేది సహజాతంగా వచ్చేది కాదు, దానిని నేర్చుకోవాలి, పెంపొందించుకోవాలి. ఆయన విద్యను కేవలం ఉపాధి కల్పించే సాధనంగా కాకుండా, సామాజిక విముక్తికి మార్గంగా భావించారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ ఏర్పాటు విధానం మాత్రమే కాదు, అది ఒక “సహజీవన విధానం”. 1948లో రాజ్యాంగ పరిషత్తులో ఆయన చేసిన ప్రసంగం, నేటి విద్యా విధానానికి మార్గదర్శకం కావాలి. ప్రజల్లో రాజ్యాంగ విలువల పట్ల గౌరవం, అవగాహన పెంపొందించాలి”.

అంబేడ్కర్ విద్యా తత్వశాస్త్రం జాన్ డ్యూయీ సిద్ధాంతాల ద్వారా ప్రభావితమైంది. విద్య అనేది విద్యార్థిలో విచక్షణ జ్ఞానాన్ని, సామాజిక బాధ్యతను పెంచాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు విద్య అనేది ఆత్మగౌరవానికి ప్రతీక అని, అది వారికి తమ హక్కులను ప్రశ్నించే శక్తిని ఇస్తుందని ఆయన విశ్వసించారు. ప్రస్తుతం పాఠశాలల్లో రాజ్యాంగం విడిగా బోధించబడకపోవడం వల్ల, విద్యార్థులు ఈ సామాజిక కోణాన్ని కోల్పోతున్నారు. రిజర్వేషన్లు, సామాజిక న్యాయం వంటి అంశాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో అపోహలు, విద్వేషాలు పెరుగుతున్నాయి. పాఠశాల దశలోనే వీటి వెనుక ఉన్న రాజ్యాంగ స్ఫూర్తిని బోధిస్తే, భవిష్యత్తులో మరింత సమ్మిళిత సమాజం ఏర్పడుతుంది.

ఆధునిక తెలుగు కవిత్వ పితామహుడు గురజాడ అప్పారావు గారు వ్రాసిన “దేశమును ప్రేమించుమన్నా” గీతం, భారత రాజ్యాంగ ప్రవేశికలోని “సౌభ్రాతృత్వం” అనే భావనకు అద్దం పడుతుంది. “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే ఆయన నినాదం, పౌరసత్వ విద్యకు మూలస్తంభంగా నిలుస్తుంది. ఒక దేశం గొప్పదనం దాని భౌగోళిక సరిహద్దుల్లో లేదు, అక్కడి పౌరుల జీవన ప్రమాణాల్లో, వారి నైతిక విలువల్లో, పరస్పర సహకారంలో ఉందని గురజాడ చాటిచెప్పారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో దేశభక్తిని కేవలం సరిహద్దు భద్రతకు, చిహ్నాలకు పరిమితం చేస్తున్నారు.

కానీ నిజమైన దేశభక్తి అంటే తోటి పౌరుడి హక్కులను గౌరవించడం, చట్టాన్ని పాటించడం, పన్నులు కట్టడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అని విద్యార్థులకు నేర్పించాలి. రాజ్యాంగ నిర్మాణంలో మహిళల పాత్రను, వారి దృక్పథాన్ని కూడా విద్యా ప్రణాళికలో భాగం చేయాలి. రాజ్యాంగ పరిషత్తు సభ్యురాలు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్, పౌరసత్వ బాధ్యతలపై చేసిన వ్యాఖ్యలు అత్యంత విలువైనవి. “పౌరులు తమ హక్కులను ఆశిస్తున్నప్పుడు, రాజ్యానికి తమ వంతు బాధ్యతలను, విధులను కూడా నెరవేర్చాలి” అని ఆమె స్పష్టం చేశారు. కేవలం హక్కుల గురించి మాట్లాడటం కాకుండా, విధుల గురించి కూడా సమానంగా చర్చించే పాఠ్యాంశాలు నేటి తక్షణ అవసరం.

రాజ్యాంగం పీఠిక ” ఉయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా” అనే మాటలతో మొదలవుతుంది. ఈ “మేము” అనే భావన బలంగా ఉండాలంటే, ప్రతి పౌరుడికి రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. సెకండరీ విద్య పూర్తి చేసే లోపు విద్యార్థులకు రాజ్యాంగాన్ని ఒక ప్రత్యేక, తప్పనిసరి సబ్జెక్టుగా బోధించడం ద్వారా మనం కేవలం విజ్ఞానవంతులైన విద్యార్థులను మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేస్తాము. అంబేడ్కర్ ఆశించిన “సామాజిక ప్రజాస్వామ్యం”, సుప్రీం కోర్టు నిర్దేశించిన “బాధ్యతాయుత పౌరసత్వం” – ఇవన్నీ సాకారం కావాలంటే రాజ్యాంగ విద్య ఒక్కటే మార్గం. ఇది ఒక విద్యా సంస్కరణ మాత్రమే కాదు, ఇది జాతి పునర్నిర్మాణ ప్రక్రియ. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, పౌర సమాజం కలిసికట్టుగా కృషి చేస్తే, రాబోయే తరం రాజ్యాంగ విలువల వెలుగులో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెడుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

జనక మోహన రావు దుంగ
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *