రేవంత్ మరో కుంభకోణం..
ఎన్టీపీసీ విద్యుత్‌ను తిరస్కరించి, ఖరీదైన ప్రాజెక్టులు ఎందుకు?
వాటాల కోసమే క్యాబినెట్ సమావేశాలు
త్వరలో మరిన్నిస్కాంలను బయటపెడుతాం
మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు
ఇటీవల రేవంత్ రెడ్డి చేస్తున్న దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణాన్ని బిఆర్ఎస్ పార్టీ బయటపెట్టిందని, నేడు రేవంత్ రెడ్డి మరో అతి పెద్ద పవర్ స్కాంకు రూపకల్పన చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు . ఆ వివరాలను ఆధారాలతో బయటపెడుతున్నామన్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ. .మొన్నటి క్యాబినెట్ మీటింగ్ లో భూ స్కాం గురించి చర్చ జరిగింది. నిన్నటి క్యాబినెట్ మీటింగ్ లో పవర్ స్కాం గురించి చర్చ జరిగింది. మంత్రివర్గం స్కాంల గురించి చర్చ తప్ప, స్కీంల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు. రామగుండం, పాల్వంచ, మక్తల్ లో 800 మెగావాట్ల నిర్ణయం తీసుకున్నారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీ, జెన్ కో కు అవకాశం కల్పిస్తారట. ఏది తక్కువ వ్యయంతో ప్లాంటు నిర్మించి, తక్కువ రేటుకు కరెంటు ఇస్తం అంటే దానికే అవకాశం ఇస్తారట. ఎంత డ్రామా? రేవంత్ రెడ్డి? ఒక మెగావాట్ ఉత్పత్తికి 12.23 కోట్ల ఖర్చు తో మొత్తం 2400 మెగావాట్లు ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ఎన్టీపీసీ డీపీఆర్ చేసుకుంది. కానీ జెన్ కో డీపీఆర్ లో మాత్రం మెగావాట్ ఉత్పత్తికి రూ.14కోట్లు అవుతుందని స్పష్టంగా పేర్కొంది. ఒక మెగావాట్ కు రూ. 12.23 కోట్లు ఎన్టీపీసీ ఖర్చు చేస్తే.. జెన్కో 14కోట్లు ఖర్చు చేస్తదని డీపీఆర్ లోనే ఉంది. ఇందులో ఏది మేలు.. ఎక్కువ ధరనా, తక్కువ ధరనా.. ఇదంతా తెలిసి కూడా డ్రామా ఎందుకు రేవంత్ రెడ్డి.. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల ఖర్చు చూస్తే..మెగావాట్ కాస్ట్ వైటీపీపీ 8.63 కోట్లు, భద్రాద్రి 9.74కోట్లు, ఎన్టీపీసీ 12.23 కోట్లు కానీ రేవంత్ నిర్మించబోయే పవర్ ప్లాంట్ కాస్ట్ పర్ మెగావాట్ 14 కోట్లు. ఈ 14 కోట్లు కూడా ఇనిషియల్ కాస్ట్. నిజానికి రామగుండం దగ్గర.. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క రామగుండం వద్ద పవర్ ప్లాంట్ నిర్మించేందుకు అంతా సిద్దంగా ఉంది. భూసేకరణ చేయాల్సింది లేదు, పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ఎఫ్ జీ డీ నిబంధనల్లో సడలింపుల వల్ల మెగావాట్ ఉత్పత్తి కాస్ట్ కోటి రూపాయల వరకు తగ్గుతుంది. మెగావాట్ కు యాదాద్రి ఏడున్నర అయితే ఇప్పుడు మీరు 14 కోట్లు ప్రతిపాదించారు. పూర్తి అయ్యే వరకు 16 అవుతుంది. 800 మెగావాట్లు అంటే ప్రతి మెగావాట్ కు ఏడు కోట్లు అంటే మొత్తం 5600 కోట్లు. రామగుండం, పాల్వంచ, మక్తల్ లో మొత్తం 15,20వేల కోట్లు ధరలు పెంచి బడా స్కాంకు పాల్పడుతున్నారు. విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉండగా పవర్ ప్లాంట్లు దండుగ అన్నాడు. ఇప్పుడు పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట అందినకాడికి దండుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసిండు. కమీషన్ల కక్కుర్తికి నిలువెత్తు నిదర్శనం నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ‘‘బిఆర్ఎస్ ప్రభుత్వం 2400 మెగావాట్ల విద్యుత్ కోసం ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకపోవడం తెలంగాణకు తీరని అన్యాయం, చారిత్రక ద్రోహం” అన్నాడు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి భారీ వ్యయంతో కొత్త థర్మల్ కేంద్రంల ఏర్పాటుకు సిద్దమయ్యాడు. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. రేవంతు సొంత ప్రయోజనాల కోసం. కాంగ్రెస్ కమీషన్ల కోసం అని హరీష్ రావు విమర్శించారు.
అధికారంలోకి రాగానే అసెంబ్లీలో జులై 29, 2024 ఏమన్నాడు. — ‘‘మార్కెట్లో 5 రూపాయలకే యూనిట్ అందుబాటులో ఉంది. ఎన్టీపీసీ నుంచి తీసుకుంటే.. ఒక్క యూనిట్‌కు 8–9 రూపాయల ఖర్చు వొస్తుంది. అంత రేటు అవసరం లేదు” అన్నడు. ఇప్పుడు ప్రతిపాదిత రామగుండం ప్లాంట్ డీపీఆర్ ప్రకారం అనుకున్నా.. యూనిట్ కు 7.92 పర్ యూనిట్ ఖర్చు చేయబోతున్నాడు. ఇప్పుడు ఎందుకు యూనిట్ కు రూ.8 ఖర్చు చేయబోతున్నాడు. నిజానికి ఈ 800 మోగావాట్ల ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం నాలుగైదు ఏండ్లు పడుతుంది. అదనంగా పెరిగే ఇతర వ్యయాలు కలుపుకుంటే ప్లాంటు నిర్మాణ వ్యయం 10,880 కోట్ల నుంచి 14,15వేల కోట్లకు పెరుగుతుంది. కరెంట్ యూనిట్ కాస్ట్ 7.92 నుంచి 9,10 రూపాయలకు పెరుగుతుందని అంచనా. అంటే యూనిట్ కు 10 రూపాయలు ఖర్చు చేయబోతున్నాడు. నాడు 4 నుంచి 5 కాస్ట్ తో విద్యుత్ కొనుగోలు చేయవచ్చు అన్న రేవంత్ రెడ్డి నేడు 10 రూపాయలు ఒక్క యూనిట్ కోసం ఖర్చు చేస్తనంటున్నడు. ఎవరికి ప్రయోజనం చేయడం కోసం? కమీషన్ల కోసమే కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు. 2400 మెగావాట్ల ప్లాంట్లు అంటే 50వేల కోట్లు కావాలి. ఇందులో 80శాతం అప్పు, 20శాతం జెన్కో అంటే చెప్పులు ఎత్తుకుపోయే వాడికి 40వేల కోట్ల అప్పులు ఎక్కడ ఇస్తారు, పది వేల పెట్టుబడి ఎక్కడ తెస్తావ్. NTPC స్టేజ్–1లో భాగంగా నిర్మించిన (2×800) మెగావాట్ల ప్లాంట్ నుండి యూనిట్‌కు రూ.4.88 నుంచి రూ.5.96 వరకు ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకున్నది. ఇప్పుడు అదే ఎన్టీపీసీ స్టేజ్–2లో భాగంగా (3×800) మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగా 2400 మెగావాట్ల ప్లాంట్ నిర్మిస్తోంది. 4.12 రూపాయలకే యూనిట్ విద్యుత్ ఇచ్చేందుకు మేం సిద్దంగా ఉన్నం, రాష్ట్ర విభజన చట్టంలో భాగంగానే మేం కట్టాము అని ఎన్టీపీసీ రాష్ట్రానికి చెప్పింది. 2400 మెగావాట్లు విద్యుత్ సప్లై చేస్తామంది. మూడు లేఖలు రాసింది. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. పెట్టుబడి అవసరం లేదు, రాష్ట్రం అప్పులు తేవాల్సిన అవసరం లేదు రూపాయి పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ కరెంటు ఇస్తా అనంగా ఎందుకు తీసుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం, ఎన్టీపీసీ 2400 మెగావాట్ల కరెంటు ఇస్తా అంటే వద్దని 10 రూపాయలకు కరెంటు తయారు చేస్తం అంటున్నవు ఎందుకు ఎన్టీపీసీది వద్దు అంటున్నవు. ఎందుకు అప్పులు తేవడం ముద్దు అంటున్నావు ఎన్టీపీసీని తిరస్కరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? కేసీఆర్ ముందు చూపుతో నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంకల్పించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పటి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నడు.. ‘‘మేం అధికారంలోకి వస్తే ప్రాజెక్టు ఆపేస్తాం. అన్యాయమైన ప్రాజెక్టు ఇది. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా దీని మీద లీగల్ గా పోతాం. పోరాటం చేస్తం.’ అన్నాడు. ఇలా అన్న కోమటి రెడ్డి అధికారంలోకి రాగానే పోటీ పడి మరీ ప్రారంభించిండు.
బిజేపీ ప్రభుత్వం డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి యాక్షన్ చేస్తున్నడు. కొత్త డిస్కం ఎవరిని ఉద్దరించడానికి పెడుతున్నావు కొత్త డిస్కంలో ఉద్యోగులు పని చేస్తారా? పరిపాలనను గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి.. కమీషన్లు దండుకునేందుకు స్కాంలకు తెరతీసిండు. లగచర్ల, మూసీ, ఆర్ ఆర్ ఆర్, హెచ్ సీ యూ, హైడ్రా… నిన్న పారిశ్రామిక భూములు. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న 5లక్షల కోట్ల ల్యాండ్ స్కాంను బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టాం. నేడు 50వేల కోట్ల పవర్ స్కాంను ఆధారాలతో సహా బయటపెడుతున్నాం . ప్రజలను మీడియాను అప్రమత్తం చేస్తున్నాం. స్కాంలకు సమాధానం చెప్పకుండా ఎదురు దాడికి దిగుతున్నారు. త్వరలో హైదరాబాద్ అండర్ గ్రౌండ్ కేబుల్ స్కాం, పంపుడ్ స్కోరేజీ, బ్యాటరీ స్టోరేజీ స్కాం బయటపెడుతాం. త్వరలో రేవంతు రెడ్డి చేసి ఇంటర్ స్టేట్ స్కాంను ఆధారాలతో సహా బయటపెడుతాను 90శాతం సమాచారం సేకరించినం. ఇంకో 10శాతం రెండు మూడు రోజుల్లో వస్తుంది. వెంటనే మీడియా సాక్షిగా రేవంతు ఇంటర్ స్టేట్ స్కాంను బయటపెడుతాం. బరితెగించి స్కాంలు చేస్తున్నారు. నువ్వు అసెంబ్లీలో పెట్టిన దానికి కట్టుబడి ఉన్నవా లేదా? తక్కువ రేటు కరెంటు వస్తుంటే ఎక్కువ ఉత్పత్తి రేటుతో ప్లాంట్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నావు? ఎన్టీపీసీ తక్కువ ధరకే 2400 మెగావాట్లు ఇస్తము అన్నది నిజమా కాదా? లేఖలు రాసింది నిజమా కాదా? ఎన్టీపీసీ చైర్మన్ నీ వద్దకు వచ్చి 2400 మెగావాట్లు తక్కువకే ఇస్తము అని చెప్పింది నిజమా కాదా? ఎందుకు నీ కమీషన్ల కోసం విద్యుత్ ప్లాంట్లు కట్టే ప్రయత్నం చేస్తున్నవు రేవంత్ రెడ్డి? వీటన్నిటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మేం ప్రతిపక్షంగా ప్రజల తరుపున మీరు చేస్తున్న స్కాంలపై, అన్యాయాలపై ప్రశ్నిస్తే మాపై ఎంక్వైరీలు అంటున్నవు. నీ ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేసుకో. మీ స్కాంలపై అవసరమైతే బిఆర్ఎస్ న్యాయ పోరాటానికి సిద్దవవుతుంది. బిజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కాకుంటే స్కాంలపై విచారణ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.





