నైతిక ప్రాతిపదిక లేని నిర్మూలన యుద్ధం

“వర్తమానం కోసం రేపటిని రద్దుచేయడానికి వెనుకాడని పాలకులు, హిడ్మాను ప్రస్తుతం నుంచి తొలగించి, రేపటిలోకి తరలించారు. పూవర్తిలో ఆదివాసీ మహిళల చారిత్రక ఆర్తనాదానికి నేడు దేశం చెవులు మూసుకోవచ్చు, మీడియా దాన్ని సులువుగానే మరచిపోవచ్చును. కానీ, ఒక మూడు నాలుగు తరాల తరువాత, అతని పేరు జనస్మరణలో పాదుకుపోయి, విమానాశ్రయాలూ, యూనివర్సిటీలూ అతని పేరు మీద వెలిసి, అప్పటి పాలకులు అతని పేరు చెప్పుకుని కాయలమ్ముకోవలసిన స్థితి వచ్చినా రావచ్చు. చరిత్ర అంతా అటువంటి ఉదాహరణలే కదా!”

k srinivas sannivesam article

ముప్పైయ్యైదేళ్లకిందట ఈ వ్యాసకర్త రాంచీకి వెళ్లినప్పుడు, ఒక చౌరస్తాలో ఉన్న బిర్సాముండా విగ్రహం ఆచూకీని అడుక్కుని వెదుక్కుని కనుగొనవలసి వచ్చింది. ఆదివాసుల నెత్తురంటిన నేతలే ఆ తరువాత భగవాన్‌ బిర్సాముండా అంటూ ఆరాధిస్తున్నప్పుడు, ఒక ఆభాసవాస్తవికత అపహసించినట్టు అనిపించింది. భగత్‌సింగ్‌ నో అటువంటి మరొకరినో, వారి మార్గాలను వ్యతిరేకించేవారే, వారి మరణాలను రచించినవారే, అనంతరకాలంలో తమ అవసరాల కోసం గోముఖాలుగా వాడుకుంటున్నారు. మన కళ్లముందు వ్యక్తి కాబట్టి, వారితో పోల్చదగ్గవాడా, ఆ పేర్లలో ఈ పేరు చేర్చవచ్చునా లేదా అని ప్రశ్నలు రావచ్చును కానీ, మాడ్వి హిడ్మాని అటువంటి వరుసలోకి పాలకులే అసంకల్పితంగా నెట్టివేశారు.

మాడ్వి హిడ్మాను చంపేసిన వార్త విన్నప్పుడు, దాన్ని ఎప్పుడో అప్పుడు వినవలసివస్తుందన్న సంసిద్ధతనో, ఒక క్రమంలో జరుగుతున్న నిర్మూలన యుద్ధంలో అది అనివార్యమన్న అవగాహనో ఉండి ఉండవచ్చును. అయినా, ఆ కబురు ఒక రోజువారీ ఎన్‌కౌంటర్‌ వార్త లాగా, నిర్లిప్తతలో సమసిపోలేదు. ప్రధానస్రవంతి మీడియా కూడా హిడ్మా సాహసపరాక్రమాలకు సంచలనాత్మకత దట్టించి, పతాకశీర్షికలను అలంకరించిందంటే, అతనొక యథాలాపపు వ్యక్తి కాదని వ్యవస్థలే గుర్తించినట్టు అయింది. ఒక పెద్ద చారిత్రక పరిణామం మధ్య జీవిస్తున్నాం కాబట్టి, పెరటిచెట్టు లాగా, సమకాలం కూడా మన ప్రాధాన్యాలకు పనికిరాదు కానీ, ఈ మనిషి స్ఫురణ మానవచరిత్రతో చాలా కాలం ప్రయాణిస్తుందనిపిస్తుంది. వర్తమానం కోసం రేపటిని రద్దుచేయడానికి వెనుకాడని పాలకులు, హిడ్మాను ప్రస్తుతం నుంచి తొలగించి, రేపటిలోకి తరలించారు. పూవర్తిలో ఆదివాసీ మహిళల చారిత్రక ఆర్తనాదానికి నేడు దేశం చెవులు మూసుకోవచ్చు, మీడియా దాన్ని సులువుగానే మరచిపోవచ్చును. కానీ, ఒక మూడు నాలుగు తరాల తరువాత, అతని పేరు జనస్మరణలో పాదుకుపోయి, విమానాశ్రయాలూ, యూనివర్సిటీలూ అతని పేరు మీద వెలిసి, అప్పటి పాలకులు అతని పేరు చెప్పుకుని కాయలమ్ముకోవలసిన స్థితి వచ్చినా రావచ్చు. చరిత్ర అంతా అటువంటి ఉదాహరణలే కదా!

అతని ఖాతాలో చాలా హత్యలున్నాయి. పోలీసులు, రాజకీయ నాయకులు, సాయుధబృందాల నాయకులు చాలా మంది అతని చేతిలో చనిపోయారు. అటువంటి వ్యక్తికి, అందునా రాజ్యాన్నే కూలదోయబోయిన శక్తికి ప్రతినిధిగా నిలిచిన వ్యక్తికి, ఎటువంటి పర్యవసానం లభిస్తుంది, నిర్మూలన తప్ప? అతను తన రాజకీయాలలో భాగంగానే వ్యవహరించాడు తప్ప, చర్యలేవీ వ్యక్తిగతం కావన్న వాదన ఎవరు పట్టించుకుంటారు? రాజ్యం అతన్ని ఒకానొక హంతకుడిగా చూసిందా? ఒక నిషిద్ధ సాయుధ రాజకీయపార్టీకి కీలకమయిన నేతగా చూసిందా? ఇంతకూ అతను, అతని లాంటి వాళ్లు ఎందుకోసం ఈ యుద్ధంలోకి దిగారు? ఏ స్వార్థం కోసం? ఏ విలాసాల కోసం? మైదానం, వ్యాపారం, అతని అడివిలోకి వచ్చాయా? అతనే నాగరిక ప్రపంచం మీదకు దండయాత్రకు వచ్చాడా? ఎవరు ఎక్కడికి చొరబడ్డారు? ఇటువంటి అనేక ప్రశ్నలను చర్చించవచ్చు, లేదా, నిద్రపుచ్చవచ్చు.

“ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే, మావోయిస్టుల మీద బిజెపి ప్రభుత్వం ఎటువంటి దేశద్రోహనిందలు కానీ, ఆపాదనలు కానీ, ప్రజలలో ఏవగింపు కలిగే ఏ ముద్రలను కానీ వేయలేదు. మన్మోహన్‌ సింగ్‌ అన్నట్టుగా, దేశానికి నెంబర్‌ వన్‌ అంతర్గత శత్రువులన్నమాట కూడా నరేంద్రమోదీ అన్నట్టు గుర్తు లేదు. తప్పుడుమార్గమనీ, సమస్యల పరిష్కారానికి ఇతర మార్గాలున్నాయని, ప్రధానస్రవంతిలోకి వచ్చి ప్రజాసేవ చేయమని అనడమే తప్ప, మహా అయితే, అభివృద్ధికి ఆటంకంగా మారారన్న ఆనవాయితీ ఆరోపణ తప్ప, వారిని సంహరించక తప్పని స్థితికి సమర్థన ఏమిటో ఎప్పుడూ చెప్పలేదు. ఫలానా తేదీ లోపల అంతం చేస్తామన్న శపథానికి కూడా వివరణ ఏదీ ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు.”

దండకారణ్యంలోని విలువైన ఖనిజరాశులను తవ్వుకుపోవడానికి, మిత్రులకు తవ్విపోయడానికి ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయా? లేక, రాజ్యాన్ని సవాల్‌ చేసే సాయుధశక్తులను అణచివేయడానికి జరుగుతున్నాయా? అన్న విచికిత్సకు, ఏ ఒక్కటి అయినా, రెండూ అయినా సమాధానాలు కావచ్చు. ప్రభుత్వాలు మరో ఆయుధాన్ని సహించవు కాబట్టి, ఈ అణచివేతలకు ఒక కనీస వివరణ అయితే ఉంది. మరి బయటి శత్రువు మీద దండయాత్రకు ఉండే నైతిక సమర్థన, లోపలి పౌరశత్రువు మీద చేసే దండయాత్రకు ఉంటుందా? కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క కావాలి కదా? మరి ఈ మావోయిస్టులు ఎవరు? అమాయక పౌరులను చంపే ఉగ్రవాదులా, విదేశీ ఏజెంట్లా? సరిహద్దుల ఆవలి నుంచి ఆయుధాలూ డబ్బూ అందుతున్న తిరుగుబాటుదారులా? ప్రభుత్వం ఏమి చెబుతోంది? వారి నిర్మూలన ప్రజాప్రయోజనాలకు ఆవశ్యకమని మాటవరసకైనా అంటోందా?

భారతదేశంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ, పార్టీ కానీ ప్రజలను మతపరంగా పరిగణిస్తాయని, ఫలితంగా దేశంలో విభజన తీవ్రమైందని వ్యాఖ్యలు వింటుంటాము. ఈ విభజనను పెంచడానికి అనుసరించిన వ్యూహం, కొన్నిమతవర్గాలను, కొన్ని భావ వర్గాలను ‘ఇతరులు’గా ముద్రవేయడం. మనము, వాళ్లు అన్న ద్వంద్వం ఈ విభజనకు కీలకం. మనం కాని ఇతరులు చెడ్డవాళ్లు అని చెప్పడానికి రకరకాల కథనాలు నిరంతరం ప్రచారంలో పెడతారు. ఆ ప్రచారం వల్ల ‘ఇతరులు’గా వాళ్లుచెప్పే మనుషుల మీద అనుమానాలు కలుగుతాయి. ఫలానా నేరం వాళ్లే చేశారని, ఆ వర్గం వాళ్లంతా కలిసి చేశారని, వాళ్లు అటువంటి వాళ్లేనని ఒక అభిప్రాయం సులువుగా ఏర్పడుతుంది. ఈ సామాజిక విభజన రాజకీయ విభజనగా మారినప్పుడు, ప్రభుత్వానికి అత్యధిక మద్దతుతో అధికారం సంక్రమిస్తుంది. మరి కేంద్రప్రభుత్వం మావోయిస్టుల మీద భావోద్వేగ పరమయిన ఏ ముద్ర వేసి, తన నిర్మూలనయుద్ధానికి సమ్మతిని సాధించింది? వారిని ‘ఇతరులు’గా నిర్వచించి, ప్రజలలో వారి మీద ద్వేషాన్ని ఎందుకు పెంచాలనుకోలేదు? హిడ్మా, ఉనికిని తొలగించవలసిన చెడుగే అయితే, అతని ఇంటికి వెళ్లి మంత్రి ఎందుకు విజ్ఞాపనలు చేయాలి? గౌరవప్రదమైన పరిహారంతో బేషరతుగా బహిరంగ జీవితంలోకి రమ్మని ఎందుకు ఆహ్వానించాలి? నిజంగా మావోయిస్టులను వేలెత్తి చూపించగల కారణం ఏదైనా ప్రభుత్వాల వద్ద ఉన్నదా?

ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే, మావోయిస్టుల మీద బిజెపి ప్రభుత్వం ఎటువంటి దేశద్రోహనిందలు కానీ, ఆపాదనలు కానీ, ప్రజలలో ఏవగింపు కలిగే ఏ ముద్రలను కానీ వేయలేదు. మన్మోహన్‌ సింగ్‌ అన్నట్టుగా, దేశానికి నెంబర్‌ వన్‌ అంతర్గత శత్రువులన్నమాట కూడా నరేంద్రమోదీ అన్నట్టు గుర్తు లేదు. తప్పుడుమార్గమనీ, సమస్యల పరిష్కారానికి ఇతర మార్గాలున్నాయని, ప్రధానస్రవంతిలోకి వచ్చి ప్రజాసేవ చేయమని అనడమే తప్ప, మహా అయితే, అభివృద్ధికి ఆటంకంగా మారారన్న ఆనవాయితీ ఆరోపణ తప్ప, వారిని సంహరించక తప్పని స్థితికి సమర్థన ఏమిటో ఎప్పుడూ చెప్పలేదు. ఫలానా తేదీ లోపల అంతం చేస్తామన్న శపథానికి కూడా వివరణ ఏదీ ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు.

“కార్పొరేట్ల మైనింగ్‌ కోసం దండకారణ్యంలో మావోయిస్టులను అణచివేస్తున్నారని, ఆదివాసులను భయభ్రాంతులను చేస్తున్నారని వివిధ సంస్థలు, మీడియా విమర్శిస్తున్నప్పుడు, అదేమీ లేదని మాటవరసకైనా అనవలసిన అవసరం కూడా కేంద్రానికి, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోయింది. లొంగుబాటుమేళాల వద్ద మైనింగ్‌ కంపెనీల యజ మానులు తచ్చాడుతున్నారంటే, విషయం బాహాటం అయిపోతుందన్న సంకోచం కూడా లేదు. ఎన్నికల రాజకీయాలకు సంబంధించి ఓటుచోరీ విషయంలోను, సాయుధ ప్రతిపక్షరాజకీయాల అణచివేతకు సంబంధించి మైనింగ్‌ లింకుల విషయంలోను, కేంద్రం ఒకే బోరవిడుపు వైఖరిలో ఉంది. మితిమీరిన, ఎదురులేని అధికారం కలిగిన ప్రభుత్వాలు, అటు ప్రజలేమనుకుంటారో అని కానీ, రాజ్యాంగ వ్యవస్థల అతిక్రమణ అవుతుందేమో అని కానీ, భయపడనప్పుడు, భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది? ఏ ప్రాతిపదికా లేకుండా, తీవ్రమైన అణచివేతను నిర్వహించ వచ్చునన్న ఆనవాయితీ ఏర్పడితే, అది ఏ నిరంకుశత్వానికి దారి తీస్తుంది?”

ప్రజలలో ఏవగింపు కలిగించి, అణచివేతకు సానుకూల భావ వాతావరణం కల్పించి, ఆ పైన విజృంభించి ఉంటే, ఆ క్రమాన్ని అర్థం చేసుకోవడం సులువు. అందులో ప్రజలను ఏదో ఒక మేరకు ఒప్పించడం, ప్రజామోదంతోనే పనిచేయడం అనే విలువలు దాగి ఉన్నాయి. కానీ, ఎటువంటి చెడు ఆపాదనలు లేకుండానే ఒక సాయుధ అణచివేతను సాగించడం అంటే, జనమనోభావాలతో నిమిత్తం లేకుండా ఏదైనా చేయగలమనే బేఖాతరు ధోరణి అవుతుంది. ఒక పరిపాలనాచర్యకు రాజకీయ నిర్దేశం ఉంటుంది. అట్లా కాక, ఒక రాజకీయ చర్యను, అందులోనూ ఎటువంటి బాధ్యత వహించలేని రాజకీయ చర్యను, బ్యూరోక్రటిక్‌ వ్యవహారంగా నడపడమంటే, అందులో యాంత్రిక అమానవీయత మూర్తీభవించినట్టు. అదే నిర్దాక్షిణ్యతగా, కర్కశత్వంగా వ్యక్తమవుతోంది. లేదా, మావోయిస్టుల మీద నైతికస్థాయిలో, ప్రచారాల సాయంతో అయినా, నిలబడే యోగ్యత తనకు లేదని ప్రభుత్వం భావించి ఉండాలి. అంటే, ఒకరకంగా, క్రౌర్యం తప్ప తన దగ్గర మరో సాధనం లేదని అంగీకరించినట్టే.

కార్పొరేట్ల మైనింగ్‌ కోసం దండకారణ్యంలో మావోయిస్టులను అణచివేస్తున్నారని, ఆదివాసులను భయభ్రాంతులను చేస్తున్నారని వివిధ సంస్థలు, మీడియా విమర్శిస్తున్నప్పుడు, అదేమీ లేదని మాటవరసకైనా అనవలసిన అవసరం కూడా కేంద్రానికి, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోయింది. లొంగుబాటుమేళాల వద్ద మైనింగ్‌ కంపెనీల యజమానులు తచ్చాడుతున్నారంటే, విషయం బాహాటం అయిపోతుందన్న సంకోచం కూడా లేదు. ఎన్నికల రాజకీయాలకు సంబంధించి ఓటుచోరీ విషయంలోను, సాయుధ ప్రతిపక్షరాజకీయాల అణచివేతకు సంబంధించి మైనింగ్‌ లింకుల విషయంలోను, కేంద్రం ఒకే బోరవిడుపు వైఖరిలో ఉంది. మితిమీరిన, ఎదురులేని అధికారం కలిగిన ప్రభుత్వాలు, అటు ప్రజలేమనుకుంటారో అని కానీ, రాజ్యాంగ వ్యవస్థల అతిక్రమణ అవుతుందేమో అని కానీ, భయపడనప్పుడు, భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది? ఏ ప్రాతిపదికా లేకుండా, తీవ్రమైన అణచివేతను నిర్వహించవచ్చునన్న ఆనవాయితీ ఏర్పడితే, అది ఏ నిరంకుశత్వానికి దారి తీస్తుంది?

హిడ్మా విషయంలో విప్లవాభిమానులు కాని సాధారణులు కూడా సామాజికమాధ్యమాల్లో స్పందించిన తీరు చూస్తుంటే, అతని లాంటి వాళ్ల మీద జనంలో ఎప్పుడూ అభిమానం మిగులుతుందని అనిపిస్తుంది. అతని ఊరు, ఇల్లు, దీనురాలైన అతని తల్లి చూసినవారెవరూ, అతని ఆచరణ తప్పనుకున్నా, స్వార్థపూరితమని మాత్రం అనుకోరు. ఆదివాసుల మీద ప్రభుత్వం చేస్తున్న యుద్ధం అమాయకమైనదని అనుకోరు. కాకపోతే, ప్రజలు మౌనంగా ఉన్నారు. నిర్వేదంలో ఉన్నారు. అది సమ్మతి కానక్కరలేదు. అణగారిన తనం మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *