– కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు అండ
– టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించాలని నిర్ణయం
– ఆయా జిల్లా కలెక్టర్లకు లేఖ ద్వారా వెల్లడి
కరీంనగర్,ప్రజాతంత్ర,నవంబర్5: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభవార్త అందించారు. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖ రాశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్ధినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాలో 4,847, సిరిసిల్ల జిల్లాలో 4,059, సిద్దిపేట జిల్లాలో 1,118, జగిత్యాల జిల్లాలో 1,135, హన్మకొండ జిల్లాలో 1,133 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ పరీక్ష ఫీజు చెల్లించాలంటే రూ.15 లక్షలకుపైగా ఖర్చవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. వారిలో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలి పని చేసి బతికేటోళ్లు. పిల్లలకు పరీక్ష ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుసుకున్న సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని ఆయా స్కూళ్లలో చదివే విద్యార్థుల ఫీజు మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఆ మొత్తాన్ని తన వేతనం నుండి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారు. వాస్తవానికి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు సరస్వతి శిశు మందిరాల్లో చదువుకునే విద్యార్థులుసహా దాదాపు 20 వేల మందికి మోదీ గిప్ట్ పేరుతో బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేశారు. అతి త్వరలోనే సర్కారీ స్కూళ్లలో 9వ తరగతి చదువుకునే విద్యార్థులకు సైతం సైకిళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. అట్లాగే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే మోదీ కిట్స్ పేరుతో విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్ను, పెన్సిళ్లు, స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ చేయబోతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





