“కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా ఆధారపడుతున్నందున ఎన్ని ఇబ్బందులున్నా కేంద్ర నుండి అనుమతులు లభిస్తాయని రాష్ట్ర జల వనరుల శాఖాధికారులు విశ్వసించారు. అంతిమంగా అంతా తలకిందులైంది. కేంద్ర బీజేపీ నాయకత్వం తెలంగాణ కు వ్యతిరేకంగా ఎట్టి చర్యకు సిద్ధంగా లేదని తేలిపోయింది.”

గోదావరి కావేరి అనుసంధానం అమలుకు తెలంగాణ ప్రభుత్వం యధాప్రకారం సవాలక్ష షరతులు పెట్టింది. ఈ నెల ఒకటవ తేదీ జరిగిన జాతీయ జల అభివృద్ధి సంస్థ సంప్రదింపులు సమావేశం వివరాలు ఇటీవల విడుదల అయ్యాయి. తెలంగాణ విధించిన షరతులు ఆమోదించడం సాధ్యమయ్యే అవకాశం లేదు. నరేంద్ర మోదీ 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుండి హేమాహేమీలైన నేతలను తన అదుపులోనికి తీసుకొంటున్నారు. ఒకప్పుడు తూలనాడిన వారే జీ హుకుమ్ అంటున్నారు. ఎదురు లేకుండా అప్రతిహతంగా ముందుకు పోతున్నారు. గాని పదేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా గోదావరి కావేరి అనుసంధానం మాత్రం సాధించ లేక పోతున్నారు. తమిళనాడు గత శాసన సభ ఎన్నికల మునుపు మొన్న పార్లమెంటు ఎన్నికల ముందు సకల యత్నాలు చేశారు. కాని ముందుకు సాగలేదు. కెసిఆర్ అడ్డం తిరిగారు. తొమ్మిది అనుసంధానాల్లో ఒకటవదైన మహానది గోదావరి అనుసంధానం చేసిన తరువాత గోదావరి కావేరి అనుసంధానం పరిశీలించి కొన్నాళ్లు మొండిగా అడ్డం తిరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వమూ అదే వైఖరి తీసుకొన్నది. తీరా ఇప్పుడు శాసన సభ ఎన్నికల ముందైనా సాధించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేసిన యత్నాలు ఫలించేట్టు లేదు.
ఈ నెల ఒకటవ తేదీ బేసిన్ లోని భాగస్వామ్య రాష్ట్రాలతో జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించింది. ఇంత కాలం ఇచ్చంపల్లి వద్ద నుండి కాకుండా సమ్మక్క బ్యారేజీ నుండి చేపట్టాలని పేచీ పెడుతుండిన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ చేపట్టిన బనకచర్ల అనుసంధానం నిలువరించేందుకు ఇచ్చంపల్లి నుండే చేపట్టమని లైన్ క్లియర్ చేసింది. కాని తీరా సవాలక్ష షరతులు పెట్టింది. తరలించే నీటిలో 50 శాతం తమకు కేటాయించాలని కోరినట్లు విడుదలైన మినిట్స్ లో ఉంది. ఇది ఏలాగూ అసాధ్యం. కాగా గతం కన్నా భిన్నంగా బనకచర్ల అనుసంధానానికి పోటీగా 200 టీఎంసీలు వరద జలాలతో తమకు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కోరింది. వీటన్నింటికీ మించి 968 టియంసిలతో గోదావరిపై తమ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కోరింది. పనిలో పనిగా బనకచర్ల అనుసంధానానికి అంగీకరించబోమని తెలిపింది. ఇదంతా పరిశీలించితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో మిలాఖత్ అయ్యారని బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేసే అవకాశం లేకుండా చూసుకున్నారు. ఇచ్చంపల్లి నుండి అనుమతి ఇచ్చిన తొలి రోజుల్లోనే బిఆర్ఎస్ నేతలు తీవ్ర మైన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రతిపాదనలను మాట వరసకు పరిశీలించుతామని జాతీయ జల అభివృద్ధి సంస్థ చెప్పింది గాని ఇది సాధ్యం కాదు. గోదావరిలో ఛత్తీస్ ఘడ్ వాటాగా మిగిలి ఉండే నికర జలాలు 148 టియంసిలే. ఇందులో యాభై శాతం తెలంగాణకు ఇచ్చి ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు పాండిచ్చేరి కేరళ రాష్ట్రాలకు ఇచ్చేందుకు మిగిలేదెంత? ఇంతకీ ఛత్తీస్ ఘడ్ తన వాటా నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఎటొచ్చీ ఈ ఝంఝాటకంలో తమిళనాడు కన్నా ఎక్కువ నష్ట పోయేది ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే. ఒక వేళ గోదావరి కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుండి అమలు జరిగితే ఆంధ్ర ప్రదేశ్ బనకచర్ల అనుసంధానం అమలుకు తక్కువ అవకాశాలు ఉన్నాయి. పైగా తమకూ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వరద జలాల వాటా అడుగుతున్నాయి.
ఇవన్నీ అటుంచి ఇంత వరకు కేంద్ర జల సంఘం వరద జలాలు ఆధారంగా భారీ ప్రాజెక్టుల డిపిఆర్ ఆమోదించి ఉండ లేదు. పైగా గోదావరి కావేరి అనుసంధానం అమలు జరిగితే ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని టీఎంసీలు నీళ్లు లభ్యమంతాయో ఇప్పుడే చెప్పలేం. తమిళనాడు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నది. అనుసంధానం జరిగితే లాభమే లేకున్నా వెంటనే నష్ట పోయేది లేదు. కాని ఆంధ్ర ప్రదేశ్ భిన్నమైనది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం బనకచర్ల అనుసంధానానికి లెక్క లేనన్ని బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు మున్ముందు ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు సక్రమంగా నివేదించడంలో జరిగిన వైఫల్యం అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరపతి దెబ్బ తినింది. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా ఆధారపడుతున్నందున ఎన్ని ఇబ్బందులున్నా కేంద్ర నుండి అనుమతులు లభిస్తాయని రాష్ట్ర జల వనరుల శాఖాధికారులు విశ్వసించారు. అంతిమంగా అంతా తలకిందులైంది. కేంద్ర బీజేపీ నాయకత్వం తెలంగాణ కు వ్యతిరేకంగా ఎట్టి చర్యకు సిద్ధంగా లేదని తేలిపోయింది.





