రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు!

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు మంచు తెరలుగా తేలిపోయాయి. రెండు రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య లడాయి తీవ్ర తరమైనది. ఈ నేపథ్యంలో గోదావరి కావేరి అనుసంధానం సమ్మక్క బ్యారేజీ (తుపాకుల గూడెం) నుండి మాత్రమే తరలించాలని సవాలక్ష షరతులు పెడుతుండిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్లకు చెక్ పెట్టేందుకు ఇచ్చంపల్లి నుండి మొదలు పెట్టమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల అనుసంధానం తగాదా లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చంపల్లి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వారు కాదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చిన కేంద్ర ప్రభుత్వం అదను కోసం వేచి ఉండి రంగంలోకి దిగింది.”

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల అధికారాల్లో నిస్సిగ్గుగా చొరబడటానికి తోడు అరచేతిలో స్వర్గం చూపడంలో ఆరి తేలింది. పైగా రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను సకాలంలో పరిష్కరించకుండా నాన బెట్టి మరింతగా చిచ్చు రగిలిన తర్వాత తద్వారా లాభం పొందటంలో కూడా ముందుంది . ఆగస్టు 22 వతేదీ హైదరాబాద్ లో జరిగిన జాతీయ జల అభివృద్ధి సంస్థతో పాటు నదుల అనుసంధానం సంప్రదింపులు కమిటీ సమావేశంలో ఛత్తీస్గఢ్ బిజెపి పాలిత రాష్ట్రమైనా గోదావరి కావేరి అనుసంధానానికి అత్యంత కీలక మైన తాము ఉపయోగించుకొనని 148 టియంసిలు ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పింది. అయితే సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ అంతగా పరిగణనలోకి తీసుకోలేదు.

వాస్తవంలో ఏ నదీ లోయ నుండైనా మరొక నదీ లోయకు జలాలను తరలించే సమయంలో అన్ని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఏకీభావం ఉండాలి. దీని కన్నా మించి ఆ నదీ లోయ లోని ప్రజల అవసరాలు పూర్తిగా తీరి మిగులు ఉంటేనే ఇందుకు తలపడాలి. గోదావరి నది లోయలో ఏకీభావం లేక పోగా ఎవరి వాటా ఎంతో తేలకుండా తగాదాలు పడుతున్నాయి. అసలు గోదావరిలో ఎంత నీరు ఉందో సరైన గణాంకాలు లేవు. వీటన్నింటికీ మించి కేంద్ర జల సంఘమే గోదావరిలో మిగులు జలాలు లేవని తేల్చింది. ఇన్ని అననుకూలాల మధ్య కేంద్ర ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానానికి తలపడుతోంది.

హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో కేంద్ర జల సంఘం ఛైర్మన్ అతుల్ జైన్ వైఖరి రాష్ట్రాల అధికారాల్లో చొరబడే విధంగా ఉండటమే కాకుండా అర చేతిలో స్వర్గం చూపే విధంగా ఉండినది. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ వాటాతో గోదావరి కావేరి అనుసంధానం మొదలు పెడతామని ఒక వేళ ఛత్తీస్గఢ్ తన వాటా నీళ్లు అవసరమై వాడుకొనేటిగా ఉంటే కావేరికి తరలించడం నిలుపుదల చేస్తామన్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? కోట్లాది రూపాయలు వ్యయం చేసి అంతర్ రాష్ట్ర నదుల అనుసంధానంగా నిర్మించే పథకాన్ని హఠాత్తుగా నిలుపుదల చేస్తామని చెప్పడం ఎవరి చెవిలో పువ్వు పెట్ఠడానికి? ఒక వేళ ఛత్తీస్గఢ్ తన వాటా నీళ్లు వినియోగించుకోవడం మొదలు పెడితే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వాటాల్లో కోత పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్బుద్ధితో వ్యవహరిస్తోందో అవగతం చేసుకోగలం. పైగా అతుల్ జైన్ మరో రెండు సుభాషితాలు చెప్పారు.

వచ్చే పదిహేను సంవత్సరాల వరకు ఛత్తీస్ ఘడ్ తన వాటా ఉపయోగించు కోలేదని తేల్చేశారు. . ఇంకా మాట్లాడితే గంగా జలాలు గోదావరికి వస్తాయని అభయమిచ్చారు. వాస్తవంలో అటు వంటి ప్రతిపాదనే ఇంత వరకు లేనే లేదు. ప్రప్రధమంగా అతుల్ జైన్ నోట నుండి వినడమే. వాస్తవంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదన చేసిన అనుసంధానాల్లో మహానది గోదావరి తొలిది. మహా నది నుండి గోదావరికి నీళ్లు తరలించేందుకు ఒడిషా ఏ మాత్రం అంగీకరించడం లేదు. అయితే గియితే ఈ అనుసంధానం నిరుపయోగమే. మహానది నుండి 420 టిఎంసిలు తరలించి మార్గ మధ్యలో 200 టిఎంసిలు సాగుకు ఇస్తూ 220 టిఎంసిలు ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు చేర్చడం ఈ అనుసంధాన లక్ష్యం. అయితే ధవళేశ్వరం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం మూడు టిఎంసిలు. 220 టిఎంసిలు వస్తే ఎలా నిల్వ చేస్తారు? ఏ విధంగా ఉపయోగించుకొంటారు?

గోదావరికి పక్క రాష్ట్రమైన తమిళనాడుకు నీళ్లు తరలించేందుకు ఏళ్ల తరబడి చర్చలు సాగుతున్నాయి. నెహ్రూ హయాంలో గంగా కావేరి అనుసంధానం గురించి డాక్టర్ కె ఎల్ రావు ప్రతిపాదన చేశారు. గంగా కావేరి మధ్య దూరం మూడు వేల కిలోమీటర్లుగా అంచనా వేశారు. పాట్నా వద్ద గంగా నదీ జలాలను నర్మదా నది లోనికి ఎత్తిపోతలు చేయాలని భావించారు. తుదకు అన్ని విధాలుగా ఆచరణ సాధ్యం కాదని విరమించుకొన్నారు. అప్పట్లోనే కేవలం విద్యుత్ బిల్లు ఏడు వేల కోట్లుగా రమారమిగా అంచనా వేశారు. అయితే వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు ఉన్నందున ఆ లోపు ఏదో విధంగా పథకం ఆమోదం పొందేందుకు కేంద్ర జల సంఘం ఛైర్మన్ అతుల్ జైన్ ఆచరణ సాధ్యం కాని గంగానది అనుసంధానం తెర మీదకు తెచ్చారు. నాణేనికి ఇదొక వైపు అయితే మరో వైపు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య బనకచర్ల అనుసంధానం బాగా ముదిరే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది.

గత ఏడెనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం గురించి చేయని యత్నం లేదు. తమిళనాడు ఎన్నికల ముంచుకొస్తున్నాయి. ఒక వేళ తన పోటీ కాళ్లతో కేంద్ర ప్రభుత్వ మనుగడ ఉన్నా స్వతహాగా బిజెపికి రాజకీయ ప్రయోజనం ఉంటే అటు వేపే మొగ్గుతుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు అంచనా వేయ లేక పోయారో ఆశ్చర్యంగా ఉంది. బనకచర్ల అనుసంధానం ఏ ధీమాతో ప్రతిపాదించారో అర్థం కాదు. రెండు అనుసంధానాలు ఒకే దఫా అమలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీరింగ్ అధికారులు అంచనాకు ఏలా వచ్చారు? ఇప్పుడు ఏమైంది? ఆంధ్ర ప్రదేశ్ పంపిన ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గల నాలుగైదు సంస్థలు వేసిన కొర్రీలే తెలంగాణలోని అధికార ప్రతి పక్షాలకు వజ్రాయుధాలుగా తయారైనవి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు మంచు తెరలుగా తేలిపోయాయి. రెండు రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య లడాయి తీవ్ర తరమైనది. ఈ నేపథ్యంలో గోదావరి కావేరి అనుసంధానం సమ్మక్క బ్యారేజీ (తుపాకుల గూడెం) నుండి మాత్రమే తరలించాలని సవాలక్ష షరతులు పెడుతుండిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్లకు చెక్ పెట్టేందుకు ఇచ్చంపల్లి నుండి మొదలు పెట్టమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల అనుసంధానం తగాదా లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చంపల్లి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వారు కాదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చిన కేంద్ర ప్రభుత్వం అదను కోసం వేచి ఉండి రంగంలోకి దిగింది. బనకచర్ల అనుసంధానం గురించి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ కేంద్ర జల సంఘం గోదావరి కృష్ణ యాజమాన్య బోర్డులు అంతిమంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చిన రిపోర్టు లే బనకచర్ల అనుసంధానం వ్యతిరేకించేందుకు తెలంగాణలో అధికార ప్రతి పక్షాలకు వెయ్య ఏనుగుల బలం లభించింది.

బనకచర్ల ప్రతిపాదన లేకుంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చంపల్లి అంగీకరించేది కాదు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగు దేశం భాగస్వామిగా ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధానం అంశంలో కేంద్ర జల శక్తి శాఖ పూర్తి తటస్థత పాటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుకున్న ఆశలను నిర్దాక్షిణ్యంగా వమ్ము చేసింది. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా మున్ముందు శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రజా వ్యతిరేకత లేకుండా ఉండేందుకు తుదకు ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ నోరు విప్పలేదు. ముఖ్యమంత్రుల సమావేశం తర్వాతనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు బిజెపి తనకు పార్టీ పరంగా రాజకీయ ప్రయోజనం లేనిదే పిల్లికి కూడా భిక్షం పెట్టరని తెలిసొచ్చి ఉం డాలి.
-వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *