– ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకారం
– సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల సిఎంల భేటీ
– ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరిగాయన్న నిమ్మల
న్యూదిల్లీ,జూలై16: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అడుగు పడింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటు కమిటీ ఏర్పాటు చేసి ముందుకు సాగాలని నిర్ణయించారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ సాగింది. గంటన్నరపాటు సాగిన ఈ భేటీ ముగిసిన తర్వాత ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల మిడియాతో మాట్లాడుతూ చర్చలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే స్ఫూర్తితో చర్చలు జరిగాయి. మూడు అంశాలపై నిర్ణయాలు జరిగాయి. రిజర్వాయర్ల ద్వారా బయటకు వెళ్లే నీటిని లెక్కలు వేసేందుకు టెలిమెట్రీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. గోదావరి నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం హైదరాబాద్ లో, కృష్ణా నదీ నిర్వహణ బోర్డు కార్యాలయం అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక తెలంగాణ ప్రస్తావించిన పలు అంశాల్లో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందిన సాంకేతిక నిపుణులు, పాలనాపరమైన అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్ట్ తో పాటు, ఇతర అన్ని అంశాలను కూడా ఈ ప్రత్యేక కమిటీ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటుంది. జాప్యం లేకుండా వచ్చే సోమవారం కల్లా ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి పాటిల్ స్పష్టం చేశారని మంత్రి నిమ్మల వెల్లడించారు. కమిటీలో కేంద్ర, రాష్టాల్ర నిపుణులు ఉంటారని చెప్పారన్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో చర్చలు జరిగాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ క్రమంలో ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై చర్చించామన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారని పేర్కొన్నారు. కృష్ణా నది బోర్డు అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే గోదావరి బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేసేలా నిర్ణయించామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులు చేసేందుకు ఏపీ అంగీరించిదన్నారు. అలాగే టెలిమెట్రీ ఏర్పాటుకు సైతం అంగీకరించామని మంత్రి నిమ్మల వివరించారు. ఈ సమావేశంలో పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఆవశ్యతను సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది. గోదావరి నుంచి సముద్రంలోకి ఏటా 2 వేల నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తాయని తెలిపారు. ఈ నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమకు మళ్లిస్తే ఆ ప్రాంతానికి లబ్ది చేకూరుతోందని సోదాహరణగా ఈ భేటీలో వివరించారని సమాచారం. అలాగే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను సైతం కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు ఆయన అందజేశారు. ఏ ఒక్క రాష్టాన్రికి ఇబ్బంది కలిగించకుండా సముద్రంలోకి వెళ్లే గోదావరి మిగులు జలాలను మాత్రమే వినియోగించుకోవడమే తమ ప్రధాన లఁ్యమని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎజెండాలోని 13 అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆ ప్రాజెక్ట్‌ల విషయంలో సీఎం చంద్రబాబు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని తెలుస్తుంది.
—–





