ఇథనాల్ ఫ్యాక్టరీ పై తిరగబడ్డ రైతులు

  • 12 గ్రామాల ప్రజల ఆందోళన 
  • కంటైనర్, గుడిసెలకు నిప్పు 
  • టిప్పర్ బొలెరో వాహనాలు ధ్వంసం 
  •  సంఘటన స్థలంలో మోహరించిన పోలీసులు 
  •  సమీక్షించిన ఎస్పీ:  పోలీస్ పికెట్ ఏర్పాటు

మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర జూన్ 4. గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ (Ethanol factory) నిర్మాణం పై 12 గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. బుధవారం ఉదయం ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి పెద్ద తన్వాడితోపాటు 11 గ్రామల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తీసుకువచ్చిన టిప్పర్లు, బొలెరో వెహికల్స్ ను ధ్వంసం చేశారు. తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలకు నిప్పు పెట్టారు. అదేవిధంగా అక్కడ ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న కంటైనర్లకు కూడా నిప్పు పెట్టారు.

పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్  ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని పెద్ద దన్వాడ, చిన్న దన్వాడ తో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. దాదాపు మూడు నెలల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. రాజోలి తాహసిల్దార్ సమక్షంలో కంపెనీ యజమాన్యం, గ్రామస్తులతో మీటింగ్ నిర్వహించిన దాంట్లో కూడా 12 గ్రామల ప్రజలు ముక్తకంఠంతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. గద్వాల ఆర్డిఓ తో పాటు గద్వాల డిఎస్పి కంపెనీ యజమాన్యం,ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితితో గతంలో ఆర్డీవో కార్యాలయంలో మీటింగ్ నిర్వహించారు. అప్పుడు కూడా గ్రామస్తులంతా ఏకతాటిపై ఉండి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కంపెనీ వినిపివేసింది.

గ్రామస్తులంతా ముక్తకంఠంతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఇథనాల్ కంపెనీ యాజమాన్యం మాత్రం గత సోమవారం అర్ధరాత్రి పనులు ప్రారంభించేందుకు కంటైనర్లు, జెసిబిలు, హిటాచీలు, బొలెరోలు, టిప్పర్లు తీసుకొచ్చి ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం దగ్గర ఉంచింది. ఈ విషయం కాస్త 12 గ్రాముల ప్రజలకు తోపాటు ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీకి తెలియడంతో మంగళవారం రోడ్డెక్కి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం ఉదయమే అకస్మాత్తుగా 12 గ్రామాల ప్రజలంతా ఏకతాటిపై కొచ్చి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామాగ్రిని ధ్వంసం చేశారు. గుడిసెలకు, కంటైనర్లకు నిప్పు పెట్టారు. టిప్పర్లు, బొలెరో వెహికల్స్ లో ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బందిని తరిమికొట్టారు. ఒకసారి పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి ఫ్యాక్టరీ నిర్మాణం దగ్గర విధ్వంసం సృష్టించారు. 

పచ్చని పంట పొలాల మధ్య విషయం చిన్న ఫ్యాక్టరీ మాకొద్దంటూ రైతులు ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని చెప్పి దాదాపు రెండేళ్ల నుంచి తాము పోరాటం చేస్తున్నామన్నారు. అయినా వినకుండా ఫ్యాక్టరీ యజమాన్యం మొండి పట్టుదలకు పోయి తమ గ్రామాలు పొలాలపైకి విషం చిమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే 12 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, పచ్చని పంట పొలాలు బీడు బారి పోతాయని, ప్రజలు క్యాన్సర్ తదితర రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. 

ఎట్టి పరిస్థితుల్లో తాము ఫ్యాక్టరీ నిర్మాణాన్ని జరగనివ్వమని తేల్చి చెప్పారు. విధ్వంసం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న ప్రజలను చెల్లా చెదురు చేసి పరిస్థితి చేయి జారిపోకుండా అదుపులోకి తెచ్చారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇలాంటి గొడవలు, విధ్వంసం జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *