ప్రజలు, వలంటీర్లకు సూచనలు
: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్‌ను రక్షణ శాఖ బృందాలు నిర్వహించనున్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్ బాగ్, మల్లాపూర్‌లోని ఎన్ఎఫ్‌సీలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.
మాక్ డ్రిల్ లో భాగంగా హైదరాబాద్ (ఓఆర్ఆర్ లోపల) మొత్తం సైరన్లు మోగించనున్నారు. ఇండస్ట్రియల్ సైరన్లు, పోలీస్ మైకులు (చౌరస్తాల వద్ద) వాహనాలు, ఫైర్ సైరన్లు 4:00 గంటలకు వినిపించాల్సి ఉంటుంది. పోలీస్, ఫైర్, మెడికల్, పరిశ్రమల శాఖలు అన్ని సైరన్లు నగరంలో ఒకేసారి 2 నిమిషాలపాటు ప్రారంభమవుతాయి. ప్రజలు, వాలంటీర్లకు పలు సూచనలు పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చెప్పింది. సైరన్ విన్న వెంటనే, వేగంగా కానీ శాంతంగా స్పందించాలి. తక్షణం ఆశ్రయం పొందడం, బహిరంగ ప్రదేశాల నుంచి తప్పించుకుని, పటిష్టమైన భవనం లేదా షెల్టర్ లోకి వెళ్లాలి.. పుకార్లను వ్యాప్తి చేయొద్దు.. అధికారిక సూచనలు మాత్రమే అనుసరించాలి. విద్యుత్, గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇంట్లో ఉంటే ఎలక్ట్రిక్ పరికరాలు, గ్యాస్, స్టౌవ్స్ లేదా అగ్ని సంబంధిత పరికరాలను ఆఫ్ చేయాలి. సురక్షితం అయ్యే వరకు అక్కడే ఉండాలి. అధికారులు ప్రమాదం తీరినట్టు ప్రకటించే వరకు మీ ఆశ్రయంలో ఉండాలి. బయట ఉంటే, దగ్గర్లో ఆశ్రయం లేకపోతే, తక్కువ ప్రదేశంలో పడుకొని తలని కప్పుకోవాలి. తగినంత రక్షణ పొందేందుకు ప్రయత్నించాలని అధికారులు సూచిస్తున్నారు.





