దొరల తెలంగాణ కావాల్నా.. ప్రజల తెలంగాణ కావాల్నా ప్రజలే తేల్చుకోవాలి

బీసీ సీఎం అంటన్న బీజేపీ ముందు గుజరాత్‌లో బీసీని సీఎం చేయాలి
‘ధరణి’ స్థానంలో ఎవరికీ నష్టం జరుగకుండా మరింత మంచి పోర్టల్‌
కాంగ్రెస్‌ ‌వొస్తే కరెంట్‌ ఉం‌డదని దుష్ప్రచారం
డిసెంబర్‌ ‌తొమ్మిదిన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం
ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, ‌రాజేంద్ర నగర్‌ ‌నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌నవంబర్‌ 08 : ‌దొరల తెలంగాణ కావాలా..ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో కోట్లు ఉన్నోళ్లకే టికెట్లు ఇస్తారని బీఆరెస్‌ ‌సన్నాసులు ప్రచారం చేస్తున్నారు..డబ్బులు లేకపోయినా బొజ్జుకు కాంగ్రెస్‌ ‌టికెట్‌ ఇచ్చింది కనిపించడంలేదా అంటూ ప్రశ్నించారు.  బుధవారం ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, ‌రాజేంద్ర నగర్‌ ‌నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో బీసీని సీఎం చేస్తామని చెబుతున్న మోదీ…ముందు గుజరాత్‌లో బీసీని సీఎం చేయాలని చురకలు అంటించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ముగ్గురు బీసీలను సీఎం చేసింది..కానీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క బీసీని సీఎం చేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి 100 స్థానాల్లో కూడా డిపాజిట్లు రావని రేవంత్‌ ‌వ్యాఖ్యానించారు. దళిత, గిరిజనులపై కాంగ్రెస్‌కు ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదన్నారు రేవంత్‌ ‌రెడ్డి. ఇందిరమ్మ కంటే ముందు దళితులు, ఆదివాసీలకు ఎవరైనా భూములు ఇచ్చారా..? లేదా అనే విషయాన్ని ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ఐటీడీఏ ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు. ధరణి పోర్టల్‌ ‌తీసుకువచ్చి అసైన్డ్ ‌భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ‌దగ్గర నోట్లు ఉంటే..తమ అభ్యర్థుల దగ్గర వోట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌కు అబద్దాలు చెప్పడంలో ప్రైజ్‌ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే ధరణి తీసేస్తారంటూ కేసీఆర్‌ ‌తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతి ఉండే మాట్లాడుతున్నారా..? అని ప్రశ్నించారు. రైతుబంధును 2018లో ప్రవేశపెట్టారని, ధరణి పోర్టల్‌ను మాత్రం 2020లో తీసుకొచ్చారని, మరి ఆ రెండేళ్లు లబ్ధిదారులకు రైతుబంధు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పేదల భూములను కంప్యూటరీకరణ చేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్ణయించిందన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్‌  ‌పార్టీనే కంప్యూటర్‌ ‌తెచ్చిందన్నారు.

ధరణి స్థానంలో మంచి పోర్టల్‌ ‌తీసుకొస్తామన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ హయంలో ఇచ్చిన భూములకు పట్టాలు ఇస్తామని, వాటిని అమ్ముకునే సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ధరణి పోర్టల్‌ ‌ని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. ధరణి ముసుగులో కేసీఆర్‌ ‌కుటుంబం హైదరాబాద్‌ ‌పరిసరాల్లో 10 వేల ఎకరాల భూములను కబ్జా చేసిందని ఆరోపించారు. తెలంగాణ వచ్చినా ఆదిలాబాద్‌ ‌జిల్లా  ప్రజలకు నీళ్లు రాలేదన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్  ‌నిర్మాణ ప్రదేశాన్ని మార్చి ఆదిలాబాద్‌ ‌జిల్లాకు అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టును కేసీఆర్‌ ‌దెబ్బ తీశారన్నారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు కేసీఆర్‌ ‌దిగమింగారని ఆరోపించారు. కేసీఆర్‌ ‌ధన దాహనికి ప్రాణహిత ప్రాజెక్టు బలైందన్నారు. కాంగ్రెస్‌ ‌కట్టిన కడెం, సదర్‌మాట్‌ ‌ప్రాజెక్టులను కేసీఆర్‌ ‌పట్టించు కోలేదన్నారు. కేసీఆర్‌ ‌సాధించిన అభివృద్ధి రాష్ట్రంలో బెల్టు షాపులను పెంచడమే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ‌వొస్తే కరెంటు ఉండదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ ‌నాయకులపై మండిపడ్డారు. దేశంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఆలోచన చేసిందే కాంగ్రెస్‌ ‌పార్టీ అని వ్యాఖ్యానించారు.  వైఎస్‌ ‌హయంలో రుణమాఫీ చేశామని గుర్తు చేశారు.  24 గంటల కరెంట్‌ ఇచ్చినట్లు నిరూపిస్తే నామినేషన్‌ ‌వెయ్యబోమన్నారు.  ప్రభుత్వం ఉచిత కరెంట్‌ ‌పేరుతో వేల కోట్లు దోచుకుందన్నారు.  దొరల పాలనలో విభజించి పాలించడం ఎప్పటి నుంచో వస్తున్న అనవాయితీ.. అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఆదివాసి లంబాడీల మధ్య మనస్పర్ధలు తెచ్చి వారిని వేరు చేశారని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాగానే ఆదివాసీలు లంబాడీలను ఏకం చేస్తామని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి రెండు వర్గాలు రెండు కళ్ళ లాంటి వారిని అన్నారు, వీరిద్దరి మధ్య నెలకొల్పిన విభేదాలను వెంటనే తొలగిస్తామని తెలిపారు.

కాంగ్రెస్‌ ఏమి చేసిందని కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌మాట్లాడుతున్నారు..కానీ కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇచ్చింది కాబట్లే కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే అడుక్కుతినే వారని చురకలు అంటించారు. బీఆర్‌ఎస్‌ ‌దోపిడి చేయలేని రంగమే లేదన్నారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌ ‌రావు రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చివరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని వదిలి పారిపోతారని అన్నారు. వీళ్లను గెలిపిస్తే ఆలి మీద తాళిని కూడా లాక్కుపోతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ, బీఆరెస్‌ ఒక్కటే. నిన్న ఎల్బీస్టేడియంలో జరిగిన సభలో ప్రధాని మోడీ కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మోడీ మేడిగడ్డకు ఎందుకు పోలేదన్నారు. మోడీ లిక్కర్‌ ‌స్కాం గురించి మాట్లాడుతాడు కానీ…కాళేశ్వరం గురించి మాట్లాడలేదన్నారు. బీజేపీకి వోటేస్తే..బీఆర్‌ఎస్‌కు వోటేసినట్టేనని విమర్శించారు. రాజేంద్ర నగర్‌ అభివృద్ధి నిధులు తేకుండా…ఇక్కడి భూములను ప్రభుత్వం అమ్ముకుంటుంది. దోచుకోవడానికి భూములు ఉంటాయి కానీ.. డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లు కట్టించేందుకు ప్రభుత్వానికి భూమి దొరకడంలేదని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. కోకాపేటలో దళితులకు కాంగ్రెస్‌ ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం గుంజుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌విధానాల వల్లే హైదరాబాద్‌ ‌నగరానికి అంతర్జాతీయ గుర్తింపు పేదలు ఇండ్లు కట్టుకుంటే 111 జీవో అని చెప్పి కూలగొడతారు..కానీ బీఆరెస్‌ ‌నేతలు ఫామ్‌ ‌హౌస్‌లు కట్టుకుంటే ఒక్క అధికారి వెళ్లడని విమర్శించారు.

అధికారంలోకి వొచ్చిన వెంటనే ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని, ఆ బాధ్యత కూడా తనదే అన్నారు. కేసీఆర్‌ ‌నోరు తెరిస్తే అబద్దాలే ఆడుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చోట తాము వోట్లు అడుగుతాం… డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లు ఇచ్చిన చోట బిఆర్‌ఎస్‌ ‌వాళ్లు వోట్లు అడగాలనే సవాల్‌కు బీఆరెస్‌ ‌సిద్ధమా..అంటూ రేవంత్‌ ‌ప్రశ్నించారు. పార్టీలో ఆశావహులు ఎందరు ఉన్నా ఒక్కరికే టికెట్‌ ఇవ్వగలమని, టికెట్‌ ‌రాని వారిని కాంగ్రెస్‌ ‌కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. దొరల తెలంగాణ పోయి ప్రజా తెలంగాణ కావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావా•ని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌గాలి వీస్తుందన్నారు. కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే  పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ ‌రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు.  టికెట్‌ ‌రాని నేతలెవరు బాధపడొద్దని…ప్రభుత్వం రాగానే సముచిత న్యాయం చేస్తామని చెప్పారు.  డిసెంబర్‌ 9‌న తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు రేవంత్‌ ‌రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *