‌ప్రజల విశ్వాసం కోల్పోయిన భారాస..

రెండింటిలో ఒక స్థానంలోనే కెసిఆర్‌ ‌గెలుపు..

( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  )
తెలంగాణ రాజకీయాల్లో  అనూహ్యమార్పు జరిగింది. తెలంగాణ సాధించిన పార్టీని కాదని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా మెజార్టీని కాంగ్రెస్‌ ‌సాధించుకుంది. మ్యాజిక్‌ ‌ఫిగర్‌ అరవై కావాల్సి ఉండగా కడపటి ఫలితాలు వెలువడే వరకు అది 65 నుండి 70 కి చేరుకునే అవకాశముంది. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను గజ్వెల్‌లో గెలిపించిన ప్రజలు కామారెడ్డిలో మూడవ స్థానలంలో నిలిపారు. గతంలో 88 స్థానాలతో పాలన చేపట్టిన బిఆర్‌ఎస్‌ ఇప్పుడు 39 స్థానాలకే పరిమితమైంది.  భారతీయ జనతాపార్టీ గతంలోకన్నా ఎక్కువగా ఎనిమిది స్థానాలను గెలుచుకుంది.  వందేళ్ళ వృద్ధ పార్టీగా పేరున్న కాంగ్రెస్‌ ‌పార్టీని రాష్ట్రంలో పదేళ్ళ తర్వాత ప్రజలు మళ్ళీ అధికారంలోకి తీసుకువొచ్చారు. అయితే ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం కాంగ్రెస్‌ ‌మొదటిసారిగా  ఇప్పుడు అధికారాన్ని చేపట్టబోతున్నది.

సుమారు పద్నాలుగు ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను సాధించిన పార్టీగా పేరున్న  భారత రాష్ట్ర సమితిని పదేళ్ళపాటు భరించిన స్థానిక ప్రజలు ఆ పార్టీ ఇక సెలవు ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటినుండి ప్రభుత్వంలో మార్పు రావాలన్న విషయాన్ని ప్రజలు గట్టిగా వినిపించారు. మార్పు అనివార్యంగా అందరూ ఏకకంఠంగా కోరుకోవడం కాంగ్రెస్‌కు కలిసి వొచ్చింది. పదేళ్ళ సుదీర్ఘ పాలనలో భారత రాష్ట్ర సమితి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టినా, వాటిని అనుభవిస్తున్న అనేక మంది అధికార పార్టీకి వోటు వేయకపోవడం గమనార్హం. అయితే తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో తమ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ శక్తివంచనలేకుండా పోరాటం చేసిన బిజెపిని కూడా కాదని ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. పాలనలో మార్పురావాలన్నది ఒకటికాగా, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా తెలంగాణ ప్రజల మనస్సును దోచుకున్నాయన్నది దీని వల్ల అర్థమవుతున్నది. దానికి తగినట్లుగా బిఆర్‌ఎస్‌ ‌పాలకులపైన ప్రజలు పెంచుకున్న వ్యతిరేకత భావం కూడా తోడైంది.

బిఆర్‌ఎస్‌ ‌నుండి పోటీలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే లలో చాలామంది పైన ఆయా నియోజకవర్గ ప్రజలకు మంచి అభిప్రాయం లేకపోడం,  అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడినవారిపైన కనీసంగానైనా రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చర్యలు తీసుకోకపోగా, ఈ ఎన్నికల్లో కూడా వారికే టికట్లు ఇవ్వడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. బిఆర్‌ఎస్‌ ‌ప్రవేశపెట్టిన పథకాలు మంచివే ఆయినా వాటిని అమలు పర్చడంలో ప్రభుత్వ వైఫల్యం కూడా మరో కారణంగా మారింది.  అవి నిజమైన, అవసరమైన లబ్ధిదారులకు చేరుతున్నాయాలేదా అన్న విచక్షణ ప్రభుత్వానికి లేకపోవడం కూడా మరో కారణం. కర్ణుడి• చావుకు అనేక కారణాలన్నట్లుగా బిఆర్‌ఎస్‌ ఓటమికి స్వయంకృత అపరాధాలే కారణబూతంగా నిలిచాయనడంలో అతిశయోక్తికాదు. ఏదిఏమైనా కాంగ్రెస్‌ ‌మరో పార్టీ వైపు చూడాల్సిన అవసరం లేకుండా మెజార్టీని కైవసం చేసుకుంది. నిన్నటివరకు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ను నాల్గవ వంతు మెజార్టీకి తగ్గించింది. అంటే ఆ పార్టీని 39 స్థానాలకే పరిమితం చేశారు.  దీంతో తెలంగాణ ఏర్పడిన దశాబ్ధకాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ‌వర్గాల్లో అమితోత్సాహం చోటుచేసుకుంది. మధ్యాహ్నం లోగానే నేతలు ఒక్కొక్కరుగా గాంధీభవన్‌ ‌చేరుకోవడంతో గాంధీభవన్‌ ‌పూర్వంలా కలకలలాడటం ప్రారంభించింది. సుమారు ఒంటిగంట ప్రాంతంలో కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వెంటరాగ విజయదరహాసంతో తన ఇంటినుండి గాంధీభవన్‌కు చేరుకున్నారు. అంతకుముందే రాష్ట్ర డిజిపి అంజనీకుమార్‌, ఇతర ఐపిఎస్‌ అధికారి మహేష్‌భగత్‌లు రేవంత్‌రెడ్డి ఇంటికి వొచ్చి పుష్పగుచ్చాలిచ్చి అభినందన తెలపారు. కాగా ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ ‌గాందీభవన్‌ ‌చేరుకోగా, ఆ పార్టీ కేంద్ర నాయకులుకూడా త్వరలో హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉందంటున్నారు.

మాట నిలుపుకున్న పొంగులేటి ;
పొంగులేటి శ్రీనివాసనెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఖమ్మం జిల్లానుండి బిఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఒక్కరిని కూడా గెలువకుండా చేస్తానన్నట్లుగానే ఆయన పది స్థానాలకు గాను 9 స్థానాలను విపక్షాలే గెలుచుకున్నాయి. ఒక్క భద్రాచలంలో బిఆర్‌ఎస్‌ అబ్యర్థి తెల్లం వెంకట్రావ్‌ ఒక్కడే నెగ్గడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *