సివిల్స్‌ ఇంటర్వ్యూలకు 43మంది ఎంపిక అభినందనీయం

– అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయ హస్తం’తో ఆర్థిక సాయం 
– నిరుద్యోగుల కలలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: సివిల్స్‌ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన 43 మంది మెయిన్స్‌కు ఎంపిక కావడం అభినందనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటివరకు 342 మంది యువత రూ.3.62 కోట్ల ఆర్థిక సహాయాన్ని సింగరేణి సంస్థ ద్వారా పొందారని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడంలో భాగంగా సివిల్స్‌ మెయిన్స్‌, ఇంటర్వూలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకాన్ని ప్రారంభించి ప్రతి దశలో రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఈ పథకం కింద ఈ సంవత్సరం మెయిన్స్‌కు ఎంపికైన 202 మంది సివిల్స్‌ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందులో 43మంది విద్యార్థులు సివిల్స్‌ లక్ష్యానికి చేరువ కావడం అభినందనీయమన్నారు. ఇంటర్వ్యూకు ఎంపికైన 43మందికి మరో రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, దీంతోపాటు దిల్లీలో వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను సాకారం చేయడానికి ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల సందర్భంగా మరోమారు నిరూపితమైంది అన్నారు. ఫైనల్‌ ఇంటర్వ్యూలకు ఎంపికైన విజేతలకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఇంటర్వ్యూలోనూ సత్తా చాటి తెలంగాణ ప్రతిష్టను దేశవ్యాప్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. గొప్ప సంకల్పంతో 2024లో ఈ పథకాన్ని ప్రారంభించగా మొదటి సంవత్సరం 140మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారని, 20 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా అందులో ఏడుగురు సివిల్‌ సర్వీసెస్‌ సాధించి వివిధ హోదాల్లో స్థిరపడడం రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక సహకారం అందించిన సింగరేణి గర్వకారణంగా భావిస్తున్నాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *