ప్రతీ డివిజన్‌ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు

– జీహెచ్‌ఎంసీ జనరల్‌ బాడీ తీర్మానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ సాధారణ సమావేశం మంగళవారం ముఖ్యమైన తీర్మానం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక్కో వార్డు/డివిజన్‌కు రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌ కేటాయింపులో భాగంగా రూ.కోటి కార్పొరేటర్‌ ప్రత్యక్షంగా ప్రతిపాదించే పనులకు రూ.కోటి జిల్లా ఇన్‌చార్జి మంత్రితో సమన్వయం చేస్తూ కార్పొరేటర్‌ ప్రతిపాదించే పనులకు మంజూరు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసి స్పష్టం చేసింది. ఈ నిధులను రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్‌ లైట్లు, కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి కాల్వలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్‌, పబ్లిక్‌ సౌకర్యాల అభివృద్ధి వంటి అత్యవసర పౌర సదుపాయాల మెరుగుదలకు వినియోగించాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. నగర డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలతాశోభన్‌ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌ అభివృద్ధి, ప్రజల అవసరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను పారదర్శకంగా వినియోగిస్తామని తెలిపారు. నగర అభివృద్ధి పట్ల జీహెచ్‌ఎంసీ కట్టుబాటును ప్రతిబింబించే కీలక నిర్ణయమిది అని పేర్కొన్నారు. తార్నాక డివిజన్‌ను ఒక మోడల్‌ డివిజన్‌గా తీర్చిదిద్దడంలో ఈ బడ్జెట్‌ ఎంతో దోహదం చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మంజూరు ఇవ్వడంతో ఈ కేటాయింపు సాధ్యమైందని డిప్యూటీ మేయర్‌ పేర్కొన్నారు. పౌర సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయని అభిప్రాయపడ్డారు.

జీహెచ్‌ఎంలో 27 మున్సిపాలిటీల విలీనం ప్రతిపాదనకు ఆమోదం

ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) పరిధిలో లేదా దానిని ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ప్రీయాంబుల్‌ను కార్పొరేషన్‌ ముందు జీహెచ్‌ఎంసీ ఉంచింది.పెరిఫెరల్‌ మున్సిపాలిటీల్లో అభివృద్ధి వ్యత్యాసాలు, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ ఒత్తిడి వంటి అంశాలను ప్రభుత్వం ప్రస్తావిస్తూ ఏకరీతిగల ప్రణాళిక, మెరుగైన పౌరసేవలు, సమన్వయిత మెట్రోపాలిటన్‌ అభివృద్ధి కోసం విలీనం అవసరమని అభిప్రాయపడిరది.

విలీన ప్రతిపాదనలో ఉన్నవి

పెద్ద అంబర్‌పేట్‌, జల్‌పల్లి, శంషాబాద్‌, తుర్కయాంజల్‌, మణికొండ, నర్సింగి, ఆదిబాట్ల, తుక్కుగూడ, మేడ్చల్‌, దమ్మాయిగూడ, నాగారం, పొచారం, ఘట్‌కేసర్‌, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్‌, బోలారం, తెల్లాపూర్‌, అమీన్పూర్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జగీర్‌, మీర్‌పేట్‌, బోడుప్పల్‌, పీరజాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట్‌. జీహెచ్‌ఎంసీ చట్టం 1955 ప్రకారం జీహెచ్‌ఎంసీ ఈ ప్రతిపాదనపై పరిశీలన చేసి అవసరమైన అధ్యయనం నిర్వహించి, తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సర్కార్‌ మెమో నం.5924/ఎంఏ(1)/2024, తేదీ 21-11-2025 ప్రకారం ప్రియాంబుల్‌ను జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం ముందు టేబుల్‌ ఐటమ్‌ 2గా ఉంచారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ దీనికి ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *