17 ఎంపి సీట్లు గెలవడమే లక్ష్యం

హైదరాబాద్‌ సీటుపైనా పాగా వేస్తాం.. ఈసారి మా తడాఖా చూపిస్తాం
 బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌
 కేంద్ర పథకాలను జనంలోకి తీసుకుని వెళ్లడమే  లక్ష్యంగా 10 నుంచి బండి సంజయ్‌ పాద యాత్ర

కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను సాధించడమే బీజేపీ లక్ష్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ తమ జాగీరని ఎంఐఎం భావిస్తుందని, అయితే ఈసారి పాతబస్తీలోని హిందువులంతా వోటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించబో తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని 48వ డివిజన్‌లోని బ్రాహ్మణవాడలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బండి శ్రీకారం చుట్టారు. అనంతరం 58వ డివిజన్‌లో ఎంపీ లాడ్స్‌ నిధులకు సంబంధించి రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో లక్షలాది భోగస్‌ వోట్లున్నట్లు ఆధారాలు సేకరించామని, అట్లాగే పెద్ద ఎత్తున వోట్లు కూడా గల్లంతయ్యాయని, వోటర్లను సుదూర ప్రాంతాల్లోని పోలింగ్‌ బూత్‌లకు కేటాయించడంతో వోటింగ్‌ శాతం కూడా తగ్గిందన్నారు. వీటికి సంబంధించి బీజేపీ నేతలు మర్రి శశిధర్‌ రెడ్డి, ఆంటోనీరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బృందం  అన్ని ఆధారాలతోసహా  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని, దీనికితోడు కొత్త వోటర్లను నమోదు చేయిస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని ప్రజలంతా పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి వోటేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒక నిర్ణయానికి వొచ్చారని, అన్ని సర్వేలు, జాతీయ విూడియా సంస్థలు సైతం బీజేపీ తెలంగాణలో అత్యధిక సీట్లను గెలవబోతుందని నివేదికలు కూడా ఇచ్చాయని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. అయోధ్య దర్శనానికి వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా రైళ్లను ప్రకటించిందని, దానితో బీజేపీకి సంబంధం లేదని, భక్తులు అయోధ్య వెళ్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే రైలు ప్రయాణం సహా అన్ని రకాల వసతి సౌకర్యాలను కల్పిస్తూ భక్తులకు ఒక్కో పార్లమెంట్‌ సెగ్మెంట్‌ నుండి రైళ్లను ప్రత్యేకంగా వేసిందన్నారు. గావ్‌ ఛలో అభియాన్‌లో భాగంగా ప్రతి నాయకుడు ఒక్కో గ్రామానికి వెళ్లి ప్లలె నిద్ర చేయాలని, నగరాల్లో బస్తీ నిద్ర చేయాలని, 24 గంటలపాటు ఆ గ్రామంలో, బస్తీలో ఉండి ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావాలన్నారు. చారిత్రాక కట్టడాలుంటే సందర్శించాలని, కొత్త వోటర్లుంటే వారితో మమేకం కావాలన్నారు. అందులో భాగంగా హుజూరాబాద్‌ లోని రంగాపూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి బస చేస్తున్నట్లు వెల్లడిరచారు. కాంగ్రెస్‌లో చేరికలపై స్పందిస్తూ..ఏ రాజకీయ పార్టీ అయినా వారి మనుగడ చూసుకుంటుందని, కానీ ప్రజలు మాత్రం బీజేపీనే ఆదరిస్తున్నారని, ఎందుకంటే ఈ దేశానికి దశ దిశ చూపబోయే నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమేనని విశ్వసిస్తున్నారని, రాజకీయ పార్టీల నేతల భవిష్యత్తు బాగుండాలంటే వారంతా బీజేపీలో చేరడం ఉత్తమమని బండి సంజయ్‌ సలహా ఇచ్చారు.

కేంద్రపథకాలను జనంలోకి తీసుకుని వెళ్లడమే లక్ష్యంగా 10 నుంచి బండి సంజయ్‌ పాద యాత్ర
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ఈనెల 10 నుంచి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ప్రజాహితమే లక్ష్యంగా.. కేంద్ర అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్‌ మ్యాప్‌ ను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి బండి సంజయ్‌ తన యాత్రను ప్రారంభించనున్నారు ఈ యాత్ర తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు. తొలిదశలో మొత్తం 119 కి.విూల మేరకు యాత్ర చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో యాత్ర చేయడంతోపాటు అధిక సంఖ్యలో గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివృద్ధి కి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *