ఉత్తమ పౌర సమాజం ఆశించే ప్రతి నాయకుడు వాటి  మూలాలను  సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  మెరుగైన సమాజానికి  మూలస్థంభాలు  విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి, సంక్షేమం, రవాణా కళలు మహిళా సాధికారత అంశాల పైన ఆధారపడి ఉంటుంది.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, సీఎం గా రేవంత్‌ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సంవత్సర కాలంలో ప్రజా పాలన పై ప్రజల వద్దకు వెళ్లాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంక్షేమ. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్లాన్‌ ప్రజా పాలన ప్రజా విజయోత్సవం పేరుతో నిర్వహించే సంబరాల పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశలు  బహిరంగ సభలు  నిర్వహించారు.  ఏడాది కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం యోచిస్తోంది.  గత  దశాబ్ది కాలంగా ఛిద్రమైన జీవనం,   ఉపాధి లేకుండా చేసిన ప్రభుత్వాన్ని  గద్దె  దింపారు.  వచ్చిన  ఏడాదిలో  యాభై ఐదు వేల పైగా ఉద్యోగాలు  ఇచ్చారు.  రెండు వందల  యూనిట్లు  లోపు  ఉన్న వారికి విద్యుత్‌ ఉచితం,  500 రూపాయలకు  గ్యాస్‌ సిలిండర్‌,  మహిళలకు  ఉచిత  రవాణా, రెండు లక్షల రూపాయలు  రైతు రుణమాఫీ, సన్నాలకు ఐదు వందలు  ఎక్కువ ఇచ్చి  రైతు పండుగ  జరిపారు.  సమగ్ర కుల గణన చేపట్టి  దేశంలోనే  తెలంగాణ  ఆదర్శప్రాయంగా మారింది.

మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి వంటి అనేక అంశాలలో ప్రభుత్వం చేసిన కృషిని ప్రజల్లోకి  తీసుకు వెళ్లాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. ఇవి ప్రజలకు తెలిసేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇక ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా వరంగల్‌, పెద్దపల్లి, మహబూబ్నగర్‌ జిల్లాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని  తాము చేసిన అభివృద్ధిని  వివరించారు.    ఏడాదిగా ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని, కేసీఆర్‌ నియంతపాలన ముగియడంతో అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిరచారు. లాగిచెర్ల  ఘటనతో  రైతులకు ఫార్మా  స్థల  సేకరణ ఉపసంహరించుకోవడం,  నిజామాబాద్‌  ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఉపసంహరించుకొని చేసిన  తప్పుని  తొందరగా  గ్రహించారు.   ఎక్కడ  నెగ్గాలో కాదు  ఎక్కడ  తగ్గాలో  తెలిసిన నాయకుడిగా మెలుగుతున్నారు.  హైడ్రా పేరుతో  దురాక్రమణ దారులపై  ఉక్కుపాదం  మోపుతున్నారు.  మూసీ నది  ప్రక్షాళనకు  రూపకల్పన  చేస్తున్నారు.  పౌర జీవనానికి  మెరుగైన  రవాణా  సౌకర్యం కల్పిస్తూ  ఇప్పుడు  ఉన్న  మెట్రోని  శంషాబాద్‌, బాటసింగారం వరకు  విస్తరిస్తున్నారు. అధునాతన మార్కెట్‌ ని ఇబ్రహీంపట్నం లో,  ముచ్చర్ల లో ఫార్మా సిటీ   ఏర్పాటు చేస్తున్నారు.

 

లోక్‌ సభ ఎన్నికల్లో  పేలవమైన  అభ్యర్థులను  నిలపడం అలాగే  పట్టణ ప్రజలలో మతం పిచ్చి  ఎక్కువగా  ఉండటంతో  ఆశించినంత  ఫలితాలు  రాకపోయినా తరువాత పాలన గాడిలో పడిరది.   ఆరు వాగ్దానాలు  అరవై ఆరు  మోసాలు పేరుతో  బీజేపీ అగ్రనాయకులు  చేస్తున్న నిరసన దీక్షలు  తిప్పి కొట్టగలిగాడు. పక్క నున్న ఆంధ్రాలో  అధికారంలో  ఉన్న  కూటమి  ప్రభుత్వం  తమ  ఉమ్మడి మేనిఫెస్టో లో ఒక్కటంటే  ఒక్క  హామీ  అమలు చేయలేదు.  ప్రతి  హైస్కూల్‌ విద్యార్థికి  పదిహేను వేలు  ఇస్తామని  ఇవ్వలేదు, రైతుకు  పెట్టుబడి  సాయం  ఇరవై వేలు ఇస్తామని  ఇవ్వలేదు,  గద్దె నెక్కితే  ఒక్క పైసా  విద్యుత్‌ చార్జీ పెంచమని  చెప్పి  ఇప్పుడు  ముక్కుపిండి  వసూలు చేస్తున్నారు. ఉచిత  రవాణా లేదు,  రైతు భరోసా  లేదు,  ఎస్సి ఎస్టీ  వారికి రెండువందల యూనిట్ల లోపు  ఉచిత  విద్యుత్‌  పథకాన్ని  రద్దు చేశారు.  బొంకరా  బొంకరా  పోలిగా  అంటే  టంగుటూరి  మిరియాలు  తాటికాయంత  అన్నాడంట.  ఏరు దాటే దాక ఓడ మల్లన్న  ఏరు దాటింతరువాత బోడి మల్లన్న అన్నట్లు  ఉంది   బీజేపీ తీరు.   ప్రభుత్వానికి  అవసరమైన  సలహాలు  ఇస్తూ  అనవసర విషయాలు తగ్గిస్తే పార్టీలు   మనగలుగుతాయి.   ప్రతిపక్షాలు  నిర్ణయాత్మకమైన  పాత్ర  పోషించాలి.  ప్రభుత్వ  విశ్వవిద్యాలయాల బలోపేతానికి  కేంద్రం  నుంచి నిధులు  రాబట్టాలి,  పెండిరగ్‌  ప్రాజెక్టులు రూపుదిద్దుకోవడానికి   తక్షణమే  గ్రాంట్లు  కేంద్ర  విడుదల చేయాలి.  పట్టణాభివృద్ధి, మౌలిక  సదుపాయాల  కల్పనకు, సప్ప్లై చైన్‌  మేనేజ్మెంట్‌ పటిష్ట పరచడానికి బీజేపీ నాయకులు కృషి చేస్తే మంచిది.

డా.ముచ్చుకోట సురేష్‌బాబు,
(అధ్యక్షుడు
ప్రజాసైన్స్‌ వేదిక)    9989988912

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *