- పదేళ్ల నిరంకుశ, నిర్బంధాల నుంచి బయటపడ్డ రాష్ట్రం
- సిఎం రేవంత్ పనితీరు…పద్ధతి బాగుంది
- మార్పు కోసం కృషి చేస్తున్నారు
- నెల రోజుల కాంగ్రెస్ పాలనపై టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ విశ్లేషణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్ధతి, పాలనీతీరు బాగుందని..జీతాలు సమయానికి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, అన్ని అంశాలపై సవిూక్షలు చేస్తూ మార్పు కోసం కృషి చేస్తున్నారని టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణలో ఆంక్షలు బద్ధలయ్యాయని..ప్రాణం పోతున్న సందర్భంలో ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తుందని నెల రోజుల కాంగ్రెస్ పాలనపై ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు స్వేచ్ఛగా బతికే రోజులు వొచ్చాయని అన్నారు. గత పదేళ్ల పాలన అంతా నిరంకుశంగా, నిర్బంధాలతో సాగిందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరకుశం రాజ్యామేలిందన్నారు.
శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల కాంగ్రెస్ పాలన బాగుందని కొనియాడారు. వాట్సాప్ కాల్స్ ఆపేసి నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితి వొచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో పెట్టిన కేసులు ప్రభుత్వం ఎత్తేస్తుందని, ఉద్యమ కేసులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తుందని ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న తపతనో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చడంతో పాటు, పాపప్రక్షాళనకు కూడా పూనుకోవడం ఆహ్వానించదగ్గ అంశమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. పదవులు బాధ్యత తప్ప తమకు అవేమి అధికారాన్ని అనుభవించే అవకాశం కాదని చెప్పారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోమని ఆనాడే చెప్పామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి పోటీ చేయకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.
21న తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో…
‘‘రాష్ట్ర విభజన హామీల అమలు – కేంద్ర ప్రభుత్వ వివక్షత..’’ సదస్సు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12 : ఈ నెల 21న తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జరిగే ‘‘రాష్ట్ర విభజన హామీల అమలు – కేంద్ర ప్రభుత్వ వివక్షత’’ రాష్ట్ర సదస్సు జరుగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ మరియు కరపత్రాలను శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ప్రొ. కోదండరామ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ రాష్ట్ర నాయకులు, యువజన సమితి మరియు విద్యార్థి జన సమితి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.




