- పరిమళాలు వెదజల్లే పట్టు చీరను నేసిన విజయ్
- ఆవిష్కరించి అభినందించిన మంత్రులు కెటిఆర్, హరీష్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ మరోసారి ప్రతిభ చాటుకున్నాడు. ఇప్పటి వరకు అగ్గి పెట్టెలో పట్టే చీర నుంచి మొదలుకుని దబ్బనంలో దూరే చీరలు తయారు చేసిన ఆయన, ఈసారి 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మరమగ్గంపై నేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో తయారు చేసిన 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆవిష్కరించారు.
విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరిచందన పట్టుగా మంత్రులు నామకరణం చేశారు. ఈ సందర్భంగా యువ చేనేత కళాకారుడు విజయ్‌ను మంత్రులిద్దరూ అభినందించారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చి, పైజామా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు.




