బీఆర్‌ఎస్‌కు 76 సీట్లు…
‌ప్రజల్లో కెసిఆర్‌ ‌పథకాలకే మొగ్గు
అన్ని కులల్లో కూడా సిఎంకు మద్దతు
మళ్లీ బిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలనే భావన
మిషన్‌ ‌చాణక్య సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని ప్రముఖ సర్వే సంస్థ ‘మిషన్‌ ‌చాణక్య’ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాష్ట్రంలోని యువత, ఉద్యోగార్థులు బీఆర్‌ఎస్‌ ‌పాలనపై సంతృప్తిని వ్యక్తంచేస్తున్నారని, బీసీలు, ముదిరాజ్‌లు మళ్లీ బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే కొలువుదీరాలని కోరుకుంటున్నట్టు తేలింది. కొత్త వోటర్ల నుంచి మొదలుకొంటే పండు ముసలివరకూ అంతా బీఆర్‌ఎస్‌వైపే మొగ్గుచూపిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొన్నది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పక్కాగా 76 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక కాంగ్రెస్‌ 20 -25‌కే పరిమితం కానుండగా, బీజేపీకి 9 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది. ఎంఐఎం పార్టీ తన 7 అసెంబ్లీ సెగ్మెంట్లను నిలుపుకోనున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల రాష్ట్రంలోని 85శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇక సామాజికవర్గాల వారీగా తీసుకొంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ అనే తేడా లేకుండా బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి అందరి అండ పుష్కలంగా లభిస్తున్నది. అన్నింటికంటే అధికంగా మైనార్టీల్లో 48.31 శాతం మద్దతును బీఆర్‌ఎస్‌ ‌సాధించగలిగింది. బీసీ నినాదంతో కొన్ని పార్టీలు లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నా, వారిని బీసీలు నమ్మడం లేదు, విశ్వసించడం లేదని సంస్థ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌కు 44.62శాతం వోట్లు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘మిషన్‌ ‌చాణక్య’ రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం నిర్వహించింది. ‘నా రాష్ట్రం-నా వోటు-నా నిర్ణయం’ ట్యాగ్‌లైన్‌తో పరిశోధన నిర్వహించి సంస్థ ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయా అధ్యయన నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 117 నియోజకవర్గాల్లో 14 లక్షల శాంపిళ్లను అధ్యయనం చేసిన సంస్థ ఆయా వివరాలను వెల్లడించింది. మే నెలకు ముందు, మే నుంచి ఇప్పటి వరకు రెండు విడతల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది. మే నెల ముందు వరకు బీఆర్‌ఎస్‌కు 46.75 శాతం వోట్లు, మే నుంచి ఇప్పటి వరకు 44.62 శాతం వోట్లు వస్తాయని మిషన్‌ ‌చాణక్య సంస్థ చైర్మన్‌ ఏ ‌శివకేశవ్‌ ‌వెల్లడించారు. మరీ ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ‌మ్యానిఫెస్టో విడుదల తర్వాత మహిళావర్గం నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నదని శివకేశవ్‌ ‌తెలిపారు. తాము ఏ పార్టీకి అనుకూలం కాదని, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఈ నివేదికను వెల్లడించామని స్పష్టం చేశారు.

పార్టీలు గెలుచుకొనే సీట్లు
సామాజిక వర్గాలవారీగా బీఆర్‌ఎస్‌కు మద్దతు

సామాజిక వర్గాలవారీగా తీసుకొంటే బీఆర్‌ఎస్‌కు బీసీలు 45.97, ఓసీలు 41.20, ఎస్సీలు 43.17, ఎస్టీలు 44.45 శాతం, మైనార్టీలు 48.31 శాతం చొప్పున మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీకి 24.60 శాతం మంది బీసీలు మాత్రమే మద్దతిస్తున్నారు. ఇక ఓసీలు 24.89, ఎస్సీలు 16.60, ఎస్టీలు 16.41, మైనార్టీలు 5.52 శాతం మాత్రమే ఆ పార్టీ పట్ల సర్వేలో సానుకూలత వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అన్ని వర్గాల మద్దతును పొందలేకపోతున్నది. ఆ పార్టీకి బీసీల అండ 26.70శాతం మాత్రమే కాగా, ఓసీలు 29.62, ఎస్సీలు 33.67, ఎస్టీలు 37.16,, మైనార్టీలు 36.41శాతం మాత్రమే అనుకూలంగా ఉన్నారు. మైనార్టీల్లో ముస్లింలు 48.32, క్రిస్టియన్లు 50.23, ఇతర మైనార్టీలు 46.38 శాతం బీఆర్‌ఎస్‌కే జై కొడుతున్నారు. కార్మికుల్లో 44.14, గృహిణుల్లో 50.29, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 38.97, ప్రైవేట్‌ ఉద్యోగుల్లో 38.95, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 40.35, నిరుద్యోగుల్లో 37.98, వ్యాపారుల్లో 43.34, విద్యావేత్తల్లో 45.08శాతం ఓటర్లు గులాబీ పార్టీవైపే ఉన్నారు. ఆసరా పెన్షన్‌దారుల్లో 52.13 శాతం, దివ్యాంగుల్లో 51, రైతుల్లో 48.52 శాతం ప్రభుత్వ పట్ల సానుకూలంగా ఉన్నారు.

కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ ‌మధ్య తేడా 11 శాతం
మిషన్‌ ‌చాణక్య సర్వేలో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ ‌మధ్య వోట్ల శాతం తేడాయే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌కు 44.62 శాతం, కాంగ్రెస్‌కు 32.71 శాతం వోట్లు వస్తాయని మిషన్‌ ‌చాణక్య సంస్థ వెల్లడించింది. అంతే ఈ రెండు పార్టీల మధ్య వోట్ల తేడా 11.91 శాతం. ఒక్కోసారి వోట్ల శాతం రెండు, మూడు శాతం ఉండగా ఫలితాల్లో భారీ తేడాలున్న సందర్భాలెన్నో ఎన్నికల్లో జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *