సర్కార్ బడుల్లో సకల వసతులు సిద్ధించేనా ?

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లోనే వారిని చేర్పించి పిల్లలకు నాణ్యమైన విద్యనందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. “మీరు మీ బిడ్డను ప్రైవేట్ స్కూల్‌లో చేరిస్తే రూ.50,000 నుండి రూ. 1.5 లక్షలు. భవిష్యత్తులో మీ పిల్లల ఉన్నత చదువుల కోసం ఈ డబ్బును ఆదా చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేట్ పాఠశాలలపై మోజు తగ్గించేందుకు తల్లిదండ్రుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశారు. వీటి కింద అన్ని పాఠశాలలకు కొత్త ఫీచర్లతో తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల, తెలుగు మీడియంలో విద్యతోపాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందించారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఒక జత బూట్లు ఉచితంగా అందజేస్తున్నారు. జూన్ 19 వరకు బడిబాట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
అధిక ఉత్తీర్ణత సాధించిన పిల్లలను, డ్రాపౌట్‌లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ‘అమ్మ ఆదర్శ కమిటీలతో పాటు విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ బడిబాట సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణపై విస్తృత ప్రచారం చేపట్టి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు. రాష్ట్రంలోని మొత్తం 26,823 పాఠశాలల్లో 20,680 అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. 17,729 పాఠశాలల్లో అవసరమైన అన్ని పనులు ఈ కమిటీలకు అప్పగించారు. ఈ వేసవిలో పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, విద్యుత్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్స్, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతు లన్నింటినీ ప్రభుత్వం ప్రారంభించింది.   సర్కారు బడుల్లో విద్యార్థులను పెంచే లక్ష్యంతో బడిబాట కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది.  బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో చేరేలా కార్యక్రమాలకు ప్రణాళిక చేశారు.
జూన్ 12న బడులు తెరిచాక ఆరు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరపనున్నారు.  తొలిమెట్టు,  సామూహిక విద్యాభ్యాసం, పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఉన్నత విద్య, కెరీర్‌పై అవగాహన కల్పిస్తారు. చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతో పాటు  సర్కారు బడుల్లో విద్యార్థులను పెంచేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. జూన్ 3 నుంచి జూన్ 17వ తేదీ వరకు పండగ వాతావరణం ప్రతిబింబించేలా ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. బడిబాట లక్ష్యాలు, నిర్వహణ తీరుపై విధివిధానాలు వివరిస్తూ డీఈఓలకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు పంపించారు.   నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు విశ్వవిద్యాలయాలలో  విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లీష్‌లలో పదవ  తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం వరుసగా 32 శాతం, 35 శాతం, 37శాతం, 43శాతంగా నమోదయ్యాయని ‘నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే’ పేర్కొన్నది.
2017నాటి జాతీయ సర్వేతో పోల్చితే, 2021సర్వేలో సగటు ఫలితాలు పడిపోయాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా దిగువన ఫలితాలు నమోదయ్యాయి.   ఈనెల 31లోగా జిల్లా కలెక్టర్లు బడిబాట సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్యక్రమాలను ప్రణాళిక చేస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఈ సమావేశాలకు ఆహ్వానిస్తారు. మండల, గ్రామస్థాయి సమావేశాలు జరుగుతాయి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఇంటింటికీ తిరిగి పిల్లలను, తల్లిదండ్రులను కలిసేలా ప్రణాళిక చేశారు. బాలకార్మికులు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పిస్తారు.  ‘ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా చదువు చెప్పరని,  వసతులు ఉండవు’ అన్న భావనను తొలగించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ విధంగా అవగాహన కల్పించాలన్న దానిపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, రెండు జతల యూనిఫాం ఇస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాఠశాల ప్రత్యేకతలు, సాధించిన విజయాలను వివరిస్తూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయనున్నారు.
బడులు తెరిచాక జూన్ 12 నుంచి 17 వరకు వివిధ కార్యక్రమాలకు ప్రణాళిక చేశారు. జూన్ 12న మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి పేరిట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలకు రంగులు వేసి పండగ వాతావణం కల్పించి బడుల్లో పెరిగిన సదుపాయాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.  విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా పలు కార్యక్రమాలు చేస్తారు. తొలిమెట్టు ద్వారా విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యాలను ఎలా పెరిగాయో, గతంలో ఇప్పటికీ తేడాలను వివరిస్తారు.  బడుల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంలో బోధన సదుపాయాలు, రెండు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచుతారు. జూన్ 17 బాలికల విద్యపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తారు. ఇటీవల పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థిలను భవిష్యత్తు కెరీర్, ఉన్నత విద్యావకాశాలపై సలహాలు ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలతో పాటు, ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించిన అమ్మాయిలను సత్కరిస్తారు. బాలికలకు ఉపకార వేతనాలు, కరాటే వంటి ఆత్మరక్షణ శిక్షణలు, రుతుస్రావానికి సంబంధించిన విషయాలపై చర్చిస్తారు.   పాఠశాల కమిటీలు, తల్లితండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పౌర ప్రజా సంఘాలు  మెరుగైన పౌర సమాజమే ధ్యేయంగా కలిసి పని చేస్తే  ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి.
-డా. ముచ్చుకోట  సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *