బిజెపి పెద్దల పార్టీ…కాంగ్రెస్ పేదల పార్టీ
తెలంగాణలోనూ అధికారం మాదే
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 23 : విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా 2024 సాధారణ ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు హాజరయిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ…కాంగ్రెస్ సామాన్యుడి వెన్నంటి నిలిస్తే బీజేపీ మాత్రం కేవలం ఇద్దరు ముగ్గురు అత్యంత సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలకే మేలు చేస్తుందని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో సిద్ధాంతపరమైన ఘర్షణ జరుగుతుందని, కాంగ్రెస్ ‘భారత్ జోడో’ మరియు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి భారత్ తోడో సిద్ధాంతాల మధ్య యుద్ధం నడుస్తుందని అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్వేశం, హింసను వ్యాప్తి చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తుంటే..తాము దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు, అందులో భాగంగానే నేడు విపక్ష పార్టీలన్నీ పాట్నా వొచ్చాయని, అందరం ఏకమై బిజెపిని ఓడిస్తామని రాహుల్ తెలిపారు.
ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కునలేమని, కేవలం ప్రేమతోనే ఓడించగలమని ఆయన అన్నారు. దేశాన్ని ఏకం చేసి ప్రేమను పంచడానికి కాంగ్రెస్ కృషిచేస్తుందని ఆయన అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలసి బిజెపిని ఓడిస్తాయని ఆయన ప్రకటించారు. కర్నాటకలో బిజెపి నాయకులు ఉపన్యాసాలు ఇస్తూ రాష్ట్రమంతా తిరిగారని, కాని ఫలితం ఎలా ఉందో అందరూ చూశారని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సమైక్యంగా నిలబడిన మరుక్షణం కర్నాటకలో బిజెపి అద్యమైపోయిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డిఎన్‌ఏ బీహార్‌లో ఉందని అన్నారు. త్వరలో తెలంగాణ, మధ్యప్రతేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక పార్టీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ..బీహార్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తే దేశమంతా గెలుస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అంతా ఏకం కావాలని ఆయన ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు.


