విజయ భేరి సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్న సోనియాగాంధీ

బీఆరెస్‌ ‌పతనం ఖాయమనే సభ జరగకుండా కుట్రలు
విజ్ఞతను ప్రదర్శించాల్సిందిపోయి కుట్రలా?
బీజేపీ, బీఆరెస్‌ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ‌సభను అడ్డుకోలేరు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి
తుక్కుగూడలో సభాస్థలి పరిశీలన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ఈ ‌నెల 17న తుక్కుగూడాలో నిర్వహిచే విజయ భేరి సభా స్థలాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఏర్పాట్లు, ఇతర అంశాలపై నేతలకు రేవంత్‌ ‌రెడ్డి పలు సూచనలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. విజయ భేరి సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. సభ కోసం మొదట పరేడ్‌ ‌గ్రౌండ్‌ను డిఫెన్స్ అధికారులను ఆడిగాం. కానీ బీజేపీ ప్రతిష్టను కాపాడుకునేందుకు కిషన్‌ ‌రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆరెస్‌ ‌కుట్ర చేసి పరేడ్‌ ‌గ్రౌండ్‌ను కాంగ్రెస్‌కు ఇవ్వకుండా చేశారన్నారు. గచ్చిబౌలి స్టేడియంను అడిగినా స్పోర్టస్ అథారిటీ తిరస్కరించిందన్నారు. ట్రాఫిక్‌ ‌సమస్య లేకుండా తుక్కుగూడాలో ఖాళీ స్థలంలో నిర్వహించాలనుకున్నాం కానీ దేవాదాయ భూములు ఉన్నాయని అందులో అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్‌ ‌సభ జరిగితే బీఆరెస్‌ ‌పతనం ఖాయమని దేవుడిని అడ్డుపెట్టుకుని అనుమతి రాకుండా చేశారని రేవంత్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తుక్కుగూడ రైతులు ముందుకొచ్చి కాంగ్రెస్‌ ‌సభకు భూములు ఇచ్చారన్నారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇచ్చిన నాయకురాలు సోనియా గాంధీ వొస్తుంటే….ప్రభుత్వం సహకరించి విజ్ఞతను ప్రదర్శించాల్సింది. దురదృష్టవశాత్తు విజ్ఞత, విజ్ఞానం కేసీఆర్‌కు లేవని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామిక విలువలు కాపాడే ఆలోచన ఆయనకు లేదని చురకలు అంటించారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు తాము ఒక హోటల్‌ను మాట్లాడుకుంటే… కేటీఆర్‌ ఆ ‌హోటల్‌ ‌వాళ్లను బెదిరించి కాంగ్రెస్‌కు ఇవ్వొద్దని చెప్పారని, ఇవేం చిల్లర రాజకీయాలు…తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని రేవంత్‌ ‌మండిపడ్డారు. అధికారం ఉందని అణచివేస్తామని కేసీఆర్‌ అనుకుంటే… ఆ ఆటలు ఇక సాగవని రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరించారు. ఈ నెల 16న తాజ్‌ ‌కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ఉంటయన్నారు.

సీడబ్ల్యూసీలో దేశ రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయాలు ఉంటాయి. ఖమ్మం సభకు ఎన్ని ఆటంకాలు కలిగించిన ఎలా విజయవంతం చేశారో….ఆ సభ స్ఫూర్తిగా ఈ విజయ భేరి సభకు లక్షలాది మంది యువకులు, రైతులు, నిరుద్యోగులు తరలిరావాలని రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. మోదీపై భారత్‌ ‌జోడో ప్రభావం పడినట్లుంది..ఇండియా కూటమిని నిలువరించలేక ఇండియా పదాన్ని తొలంగించాలనుకున్నారు. అందుకే భారత్‌ అని పేరు మారుస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ ఆయనకు తెలియదేమో.. ఏడాది ముందే రాహుల్‌ ‌చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర చేశారని చురకలు చేపట్టారు. కిషన్‌ ‌రెడ్డి, కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ ‌సభను అడ్డుకోలేరని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *