“మన విధానాలు, పద్ధతులు కాలం చెల్లిపోయాయని గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను, పద్ధతులను, నినాదాలను రూపొందించుకోవలసి ఉంది. పాత వాటిని ప్రజలు అంగీకరించడంలేదు. అవి కనీసం ప్రజలలో భయాన్ని కూడా కలిగించడం లేదు. దీన్ని గ్రహించవలసి ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేది సామాజిక చలనానికి భారమితిలా పని చేస్తుందని, చేయాలని నేను అనుకుంటాను. సమాజంలో వచ్చే కదలికలను అది గుర్తించాలి.”
ఒక రాజకీయ పార్టీ తన విధానాలను సామాజిక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకోలేకపోతే అది ఒక రకమైన నకిలీగా మారిపోతుంది. వంద రూపాయల దొంగనోటు ఎట్లా చలామణీ అవుతుందో చూడండి. అసలు నోటుకూ నకిలీ నోటుకూ తేడా తెలియకుండా పోతుంది. నకిలీ నోటు అసలు నోటులాగ చలామణీ అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి పట్టుబడిపోతుంది తప్ప సాధారణంగా అది అన్ని చోట్లా చెల్లుతుంది. ఈ విషయం మనం తప్పనిసరిగా గుర్తించవలసి ఉంది. మన విధానాలు, పద్ధతులు కాలం చెల్లిపోయాయని గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను, పద్ధతులను, నినాదాలను రూపొందించుకోవలసి ఉంది. పాత వాటిని ప్రజలు అంగీకరించడంలేదు. అవి కనీసం ప్రజలలో భయాన్ని కూడా కలిగించడం లేదు. దీన్ని గ్రహించవలసి ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేది సామాజిక చలనానికి భారమితిలా పని చేస్తుందని, చేయాలని నేను అనుకుంటాను. సమాజంలో వచ్చే కదలికలను అది గుర్తించాలి. ఒక వేళ ప్రజలతో, సమాజంతో ఆ సజీవ సంబంధం గనుక తెగిపోయినట్టంయితే ఇటువంటి పరిణామాలు సంభవిస్తాయి . అందువల్ల మనం నిరంతరం ఇటువంటి విషయాల గురించి ఆలోచిస్తుండాలి.
ఈ వ్యవహారాలన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, విచారణ కమిషన్లు నియమించమని అడిగేటప్పుడు కూడా మనం ఇదే విధమైన పొరపాటు చేస్తున్నాం. పరిస్థితులు ఏ రకంగా మరిపోయాయో గుర్తించకుండా పాత పద్ధతిలోనే ఏదయినా ఘోరం జరిగినప్పుడల్లా విచారణ కమిషన్ నియమించమని అడుగుతూపోతున్నాం. చాలా యాంత్రికంగా న్యాయ విచారణ కమిషన్ నియమించమని అడుగుతూ పోతున్నాం. చాలా యాంత్రికంగా న్యాయ విచారణ జరపమనీ, పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జిచేతనో, సుప్రీంకోర్టు జడ్జి చేతనో, పదవిలో ఉన్న హైకోర్టు జడ్జిచేతనో, సుప్రీం కోర్టు జడ్జి చేతనో విచారణ జరిపించమని పదేపదే అడుగుతున్నాం. కాని ఇంత వరకూ అటువంటి న్యాయ విచారణ కమిషన్ల నివేదికలన్నిటికీ ఏమయిందో మనకు పట్టడం లేదు. అసలు చట్టం ఏమి చెబుతున్నదో మనకు పట్టడం లేదు. చట్టంపట్ల మన అసంతృప్తి, కోసం ఉండవచ్చుగాని, అసలు ఆ శాసన నిర్మాణం సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నదో మనకు తెలిసి ఉండాలి. దాన్ని విస్మరించగూడదు. దీన్నిలో కొన్ని తప్పుడు అభిప్రాయాలున్నాయి. ఒకటి ` జడ్జి అనగానే ఏదో ఉన్నత స్థాయి మనిషి అయినట్టు, ఒక జడ్జీకి న్యాయాన్యాయాలు గుర్తించగలిగే ప్రజ్ఞ ఏదో ఉన్నట్టు ఒక అభిప్రాయం ఉంది. అది పూర్తిగా తప్పు. ఒక వంద మంది జడ్జీలను తీసుకుంటే వారిలో దాదాపు అరవై, డెబ్పై మంది పెద్ద తెలివంయిన వాళ్లు కాదు, లేదా సాదాసీదా మనుషులు.
న్యాయమూర్తి కావడం అనేది ఏదో ఆ మనిషిలోని ప్రతిభను గుర్తించి ఇచ్చే పదవి కాదు. నిజానికి పోటీతత్వం కూడా ఒక దశలో ప్రతిభను, తెలివిని గుర్తించడానికి పనికి వస్తుంది. కాని, తర్వాత తర్వాత ఈ పోటీ అనేది, ఫలితాన్ని చూడాలనేది లావాదేవీలకు దారి తీస్తుంది. అన్ని రకాల తప్పుడు పనులు రంగంలోకి వస్తాయి.. పోటీ వ్యవస్థలో లావాదేవీలనేవి ప్రతిభను చంపేస్తాయి . లావాదేవీలు ఎవరు ఎక్కువగా చేయగలిగితే వారు జడ్జీలవుతారు. అంటే చాలాసార్లు నిజమైన ప్రతిభ, తెలివి ఉన్నప్పటికీ జడ్జీ అయ్యే అవకాశం లేదు. అందువల్లనే మనకు కృష్ణయ్యర్, చంద్రచూడ్, చిన్నపరెడ్డి లాంటి వాళ్లు జడ్జీలు కావడం మినహాయింపు గాని సూత్రం కాదు. ఎక్కడో ఒక చోట నిజంగా ఇట్లా ప్రతిభ ఉన్న వాళ్లు జడ్జీలవుతారు. మొత్తం మీద మాత్రం తిమ్మిని బమ్మిని చేయగలవాళ్లే జడ్జీలవుతారు. అటువంటి జడ్జీలతో వ్యవహరించడం నాకు చాలా సరదాగా ఉండేది. వాళ్లకు చట్టంలోగాని, న్యాయశాస్త్రంలోగాని, ఇతర విషయాలలోగాని ప్రావీణ్యం ఉండదు. పి వి రాజమన్నార్ లాగా అటు న్యాయ శాస్త్రంలోనూ, చట్టంలోనూ, సాహిత్యంలోనూ నిష్టాతులైన వాళ్లు చాలా అరుదు. అట్లాగే కొంత మంది న్యాయ వ్యవస్థకు మాత్రమే పరిమితమైన నిపుణులున్నారు. ఇటువంటి ప్రవీణులైన న్యాయమూర్తులు కొంత మంది ఉండడం మొత్తంగా వ్యవస్థకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. వ్యవస్థకు సమర్థతను ఇస్తుంది. ఈ అరుదైన వాళ్లు ప్రమాదవశాత్తు ఎంపికయిన వాళ్లే. వాళ్లు మొత్తం న్యాయమూర్తుల ఎంపిక వ్యవస్థకే మంచిపేరు తేగలుగుతారు. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక వ్యవస్థ దాని నిరంతర నియమాలవల్ల, పద్ధతులవల్ల పేరు తెచ్చుకోవాలిగాని, ఎక్కడో ఒకసారి ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలవల్ల కాదు.
నేను ఒకసారి ఒక వ్యాసం రాశాను. మనకు ఎప్పుడైనా ఒక మంచి న్యాయమూర్తి వచ్చారంటే అది కేలం పొరపాటువల్లనే, అది కూడా శిక్షార్హమైన పొరపాటువల్లనే అని నేను ఆ వ్యాసంలో రాశాను. జడ్జీ అనగానే అతడిని తీసుకొచ్చి అతనికి తెలియని విషయాల మీద కూడా మాట్లాడమనడం జరుగుతుంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద జరిగే సభలకు అధ్యక్షత వహించి మాట్లాడమంటుంటారు. నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది. జస్టిస్ ఎన్ రాజగోపాల అయ్యంగార్ అని మద్రాసులో ఒక జడ్జి ఉండేవారు. ఆయన చాలా తెలివైన మనిషి. ఆయన మా వీధిలో ఏదో ఒక ఆధ్యాత్మిక సమావేశం ప్రారంభించడానికి వచ్చాడు. జడ్జీగదా అని ఆయనను పిలిచారు. ఆయన రామాయణం గురించి ఇంగ్లీషులో ఒక నోట్‌రాసుకుని వచ్చి చదవడం మొదలు పెట్టాడు. జడ్జీ అనగానే ఏదైనా మాట్లాడగలడు అని అనుకుని, సైన్స్ మీద సమావేశం అంటే అతడిని పిలిచేది, తత్వశాస్త్రం మీద సమావేశం అంటే అతనినే పిలిచేది. మొత్తం మీద జడ్జీ అనేవాడు సర్వజ్ఞుడు అని మనలో ఒక అభిప్రాయం ఉంది. అది సరైనది కాదు. జడ్జీలు సర్వజ్ఞులు కారు. చాలాసార్లు తెలివైన వాళ్లు కూడా కాదు. అసలు ఈ రోజుల్లో అటువంటి బహుముఖ, విస్తృత ప్రతిభ ఉన్నవాళ్లే కరువయ్యారు. బహుశా కృష్ణయ్యర్ మాత్రమే ఇటీవలి కాలంలో అటువంటి ప్రతిభను కనబరిచాడు.
విచారణ కమిషన్ పరిమితులు
సరే, విచారణ కమిషన్ వేయమని అడగడం, దానికి ఒక జడ్జీని నియమించమని అడగడం ప్రజా ఉద్యమాలకు, సంఘాలకు, పార్టీలకు బాగా అలవాటయింది.. అసలు ఈ విచారణ కమిషన్ల చట్టం అనేదాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు. దాని ప్రయోజనం ఏమిటి అని తెలుసుకోవాలి. ఆ చట్టంలో కొన్నే సెక్షన్లు ఉన్నాయి. అది ఒక నిర్ధారితమైన తీర్పు ఇవ్వజాలదు. అది ఎవరికీ శిక్ష విధించజాలదు. అది కేవలం ప్రాసిక్యూషన్‌కు సలహా ఇవ్వగలుగుతుంది. కొన్ని ముఖ్యమైన కేసులలో, సమర్థులైన న్యాయమూర్తులచే జరిగే అటువంటి కమిషన్ విచారణ ఒక నివేదికకు దారి తీయవచ్చు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కొన్ని మార్గదర్శక పాలనా సూత్రాలను తయారు చేయవచ్చు. లేదా కొన్ని మార్గదర్శక సూత్రాలను మార్చడానికి వీలు కల్పించవచ్చు. అసలు విచారణ కమిషన్లు నియామకపు చట్టం ప్రకారం ఈ కమిషన్లను న్యాయమూర్తులచేతనే హోదాను కల్పించలేదు. అవి సివిల్ కోర్టులలాగనే సాక్ష్యాధారాల విచారణలు నిర్వహిస్తాయి . కాని వాటి పని ఆ కేసులో లేవనెత్తబడిన ముఖ్యమైన విషయాల మీద ప్రభుత్వానికి సలహా ఇవ్వడం మాత్రమే. అందువల్ల కమిషన్ ప్రభుత్వానికి తాను కనిపెట్టిన అంశాల మీద ఒక నివేదిక మాత్రం సమర్పిస్తుంది. ఈ క్రమంలో అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ ఆ తర్వాత కాలంలో సక్రమంగా అమలులోకి రాలేదు. వాటిలో ఒకటి ఏమంటే, ప్రభుత్వం ఈ విచారణ కమిషన్ నివేదికను పార్లమెంటు ముందరగాని, అసెంబ్లీ ముందరగాని ఉంచాలి. దానితోపాటే ఒక ఆక్షన్ టేకెన్ రిపోర్టు (తీసుకున్న చర్యల మీద నివేదిక)ను కూడా సమర్పించాలి. అంటే, కమిషన్ నివేదికలో చేసిన సిఫారసులలో వేటిని అంగీకరించారో, వేటిని అంగీకరించలేదో, అంగీకరించిన సిఫారసుల మీద తీసుకున్న చర్యలేమిటో చట్టసభల ముందర నివేదించాలి. ఆ చర్యలకు అవసరమైన చట్ట సవరణలను తీసుకురావడంగాని, కొత్తచట్టాలను ప్రవేశపెట్టడంగాని చేయాలి. తద్వారా విచారణ కమిషన్లు మెరుగైన పాలనకు ఉపయోగపడతాయని భావించడం జరిగింది.
-కె.జి. కన్నబిరాన్
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్




