లోక్‌ సభ ఎన్నికలకు బిఆర్‌ఎస్‌ సమాయత్తం

జనవరి 3 నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : పార్లమెంట్‌ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సమాయాత్తమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పార్గీ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్‌ వేదికగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు, పార్టీ సెక్రటరీ జనరల్‌ కే. కేశవరావు, మాజీ మంత్రులు హరీష్‌ రావు, కడియం శ్రీహరి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి తదితర కీలక నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్నాయి. తొలి విడతలో జనవరి 3 నుంచి 12 వరకు సవిూక్షలు కొనసాగనున్నాయి. ఇతర సీనియర్‌ నేతల సమక్షంలో ఈ సవిూక్షలు జరగనున్నాయి. కేసీఆర్‌కు తుంటి ఆపరేషన్‌ జరగడంతో ఇంకా కోలుకోదు కనుకనే కేటీఆర్‌ అధ్యక్షతన సమావేశాలు జరగనున్నాయి.
సంక్రాంతి పండగ నేపథ్యంలో మూడు రోజులు విరామం అనంతరం మళ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 3న ఆదిలాబాద్‌, 4న కరీంనగర్‌, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్‌, 8న జహీరాబాద్‌, 9న ఖమ్మం, 10న వరంగల్‌, 11న మహబూబాబాద్‌, 12న భువనగిరి సమావేశాలు జరుగుతాయి. రెండో విడుతలో భాగంగా 16న నల్గొండ , 17న నాగర్‌ కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్‌, 20న మల్కాజ్‌గిరి, 21 సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నియోజవర్గాల సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలకు ఆయా పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల ఎంపీలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇలా కీలక నేతలు సమావేశాలకు హాజరవనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *