2023 సంవత్సరానికి గాను ఆర్థికశాస్త్రములో ప్రతి ష్ఠాత్మక నోబెల్ బహుమతిని అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్ మార్కెట్ అసమా నతలకు గల కారణాలను విశ్లేషణ చేసినందుకు గాను ఈమె ఈ అవార్డును పొందారు. 1990లో హార్వర్డ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవీవిరమణ పొందిన మొదటి మహిళ. అలాగే నోబెల్ ఎకనామిక్స్ బహుమతిని గెలుచుకున్న మూడవ మహిళ. అంతేకాక ఆర్థిక శాస్త్రంలో ఒంటరిగా నోబెల్ బహుమతి పొందిన మహిళగా రికార్డును సృష్టించారు. గత 200 సంవత్సరాలుగా పనిచేసే ప్రదేశంలో మహిళలు భాగస్వామ్యాన్ని ఈమె అధ్యయనం చేసి ఈ అసమానతలకు కారణాలు వివరించారు.
ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా మరియు మనదేశంలో పనిచేసే ప్రదేశంలో స్త్రీ ,పురుషుల ఆదాయాల వ్యత్యాసాన్ని ఒకసారి చూద్దాం.
ఉత్పాదక ఉపాధి రంగంలో స్త్రీలు మరియు పురుషులందరికీ సమాన విలువ కలిగిన పనికి సమాన వేతనం కల్పించడం, ఆర్థికవృద్ధిని గణనీయ స్థాయిలో ముందుకు తీసుకుపో వడానికి దోహదం చేస్తుంది. అన్ని రంగాలలో లింగ వివక్షతకు తావుండకూడదని యు.యన్.ఒ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పొందుపర్చుకున్నప్పటికీ, సమాన విలువ కలిగిన పనికి సమాన వేతనం పొందడంలో అన్ని ప్రాంతాలలో, స్త్రీలు పురుషుల కంటే తక్కువ వేతనం పొందుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా 20 శాతం లింగ వేతన వ్యత్యాసం ఉందని, ఈ అంతరాన్ని తగ్గించడంలో పురోగతి నెమ్మదిగా ఉందని, పురుషులు మరియు మహిళలకు సమాన వేతనం విస్తృతంగా ఆమోదించబడినప్పటికీ, ఆచరణలో దానిని వర్తింపజేయడం కష్టముతో కూడుకున్న పని అని, ఐక్యరాజ్యసమితి నివేదికలు తెలుపుతున్నాయి. సమాన వేతనం సాధించడం మానవ హక్కులు మరియు లింగ సమానత్వానికి ఒక ముఖ్యమైన మైలురాయి. సమాన చెల్లింపు అంతర్జాతీయ కూటమి ( ఈక్వల్ పే ఇంటర్నేషనల్ కోయలిషన్ – ఇ.పి.ఐ.సి) అనేది ప్రస్తుతం ప్రపంచ, ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలలో లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించడానికి పనిచేస్తున్న ఏకైక కూటమి.
అంతర్జాతీయ కార్మిక సంస్థ ( ఐ.ఎల్.ఒ ) వెల్లడించిన కొన్ని నిజాలు :
ప్రాంతీయంగా విస్తృత అసమానతలతో ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా నిరుద్యోగులుగా ఉన్నారు. ఉద్యోగం చేస్తున్న మహిళల్లో కేవలం 28 శాతం మంది మాత్రమే వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను పొందుతున్నారు. స్త్రీలు పురుషుల కంటే కనీసం రెండున్నర రెట్లు ఎక్కువ జీతం లేని గృహ మరియు సంరక్షణ పనులను నిర్వహిస్తున్నారు. ఉప-సహారా ఆఫ్రికా మరియు దక్షిణాసియాలో లింగ వేతన వ్యత్యాసం వరుసగా 4 మరియు 14 శాతంగా ఉంది. ఇంకా పిల్లలతో ఉన్న స్త్రీలు , పిల్లలు లేని స్త్రీలకన్న తక్కువ వేతనాన్ని పొందుతున్నారు. దీనిని మాతృత్వ వేతనా వ్యత్యాసం అని కూడా పిలుస్తారు. ఈ వ్యత్యాసం పై వారిలో వరుసగా 4 మరియు 14 శాతాలుగా ఉన్నాయి.
మనదేశంలో…
మనదేశం అధిక జనాభాతో పాటు విస్తృత మార్కెట్ కలిగి ఉండడం మూలాన ప్రపంచ ఆర్థిక మరియు నిర్మాణాత్మక అభివృద్ధిని ప్రభావితం చేసే ముఖ్యమైన దేశాలలో మన దేశం ఒకటిగా నిలుస్తుంది. ఈ అభివృద్ధి సాధించడానికి మన దేశ లేబర్ మార్కెట్లో పురుషులతో పాటుగా మహిళల వాటా కూడా కీలకపాత్ర కలిగి ఉన్నారు. అయినా మనదేశం యొక్క లేబర్ మార్కెట్లో అసమానతలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం మన దేశంలో ఉపాధి లింగ వ్యత్యాసం 50.9% ఉంది. 70.1% పురుషులతో పోలిస్తే శ్రామిక శక్తిలో 19.2% మహిళలు మాత్రమే ఉన్నారు. భారతదేశంలో కాలక్రమేణా లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించడంలో చెప్పుకోదగ్గ పురోగతి ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వ్యత్యాసం ఎక్కువగా ఉంది. 1993-94లో పురుషులతో పోలిస్తే భారతీయ మహిళలు సగటున 48% తక్కువ సంపాదిం చారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ యొక్క లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం 2018-19లో ఈ వ్యత్యాసం 28%కి తగ్గింది. అధిక సంస్థలలో మహిళల పని సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. మాతృత్వ వేతనా వ్యత్యాసం మన దేశంలో కూడా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 ప్రకారం, భారతదేశం 146 దేశాలలో 135వ స్థానంలో ఉంది.
నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ మన దేశంలో 7 రకాల అసమానతలు ఉన్నాయని తెలిపారు. అవి మరణాల అసమానత, జన్మతః అసమానత, ఉపాధి అసమానత, యాజమాన్య అసమానత, ప్రత్యేక అవకాశాల అసమానత, ప్రాథమిక సౌకర్యాల అసమానత , గృహ అసమానత.
భారత్ తీసుకుంటున్న చర్యలు:
లింగ వేతన వ్యత్యాసాన్ని పూడ్చేందుకు భారతదేశం అనేక చట్టాలను తీసుకు వచ్చింది.
1948లో కనీస వేతనాల చట్టాన్ని రూపొందించింది. 1976లో సమాన వేతన చట్టాన్ని ఆమోదించిన అగ్రగామి దేశాల్లో మన దేశం ఒకటి. మన దేశం రెండు చట్టాల్లోనూ 2019 సమగ్ర సంస్కరణలు చేపట్టి వేతనాలపై కోడ్ను రూపొందించింది. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించడంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహాయపడిందని ఆధారాలు చూపిస్తున్నాయి.
దేశంలో మొత్తం గ్రామీణ మరియు వ్యవసాయ వేతనాలు వేగంగా పెరగడానికి ఈ పథకం దోహదపడింది. ఇంకా దీని ద్వారా ప్రత్యక్షంగా, కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కార్మికుల వేతన స్థాయిలను పెరగడం మరియు పరోక్షంగా అధిక సంపాదన ద్వారా వ్యవసాయ వృత్తులలో పాల్గొన్న మహిళలకు ప్రయోజనాలు చేకూర్చింది. 2017లో, ప్రభుత్వం 1961లో ప్రసూతి ప్రయోజన చట్టాన్ని సవరించడం వలన 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ వేతన రక్షణతో కూడిన ప్రసూతి సెలవును 12 వారాల నుండి 26 వారాలకు పెంచింది. ఇది అధికారిక ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న మధ్యస్థ మరియు అధిక-స్థాయి వేతన సంపాదకుల్లోని తల్లుల మధ్య మాతృత్వ వేతన వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఉపయోగడుతుంది.స్కిల్ ఇండియా మిషన్ లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించగ లుతుంది.
జనక మోహన రావు
అధ్యాపకుడు, ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, 8247045230





