రేపు రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

  • సిఎంగా మొదటి విదేశీ పర్యటనకు రేవంత్‌ రెడ్డి
  • దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌కు హాజరు
  • పది రోజుల పాటు రాష్ట్రం బయట సిఎం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదిరోజుల పాటు తెలంగాణ బయట ఉండనున్నారు. శుక్రవారం దిల్లీ చేరుకున్న సిఎం తన పర్యటనలో భాగంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే తదితరులతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత రేపు ఆదివారం ఉదయం ఆయన మణిపూర్‌ వెళ్ళి రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన తిరిగి దిల్లీకి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ చేరుకుని అక్కడ జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమ్మిట్‌కు హాజరుకానున్నట్లు సమాచారం. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండనుండగా మరో మూడు రోజులు లండన్‌లో పర్యటిస్తారు. 15 నుండి 20 వరకు సిఎం విదేశీ పర్యటన కొనసాగనుంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీ నేషనల్‌ కంపెనీల కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతుంటారు.

భారత్‌ నుంచి ముఖేష్‌ అంబానీ, ఆనంద్‌ మహీంద్ర, కుమారమంగళం బిర్లా, గౌతమ్‌ అదాని.. వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొంటుంటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది దావోస్‌ సదస్సుకు రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఆయన దావోస్‌లో పర్యటిస్తారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సుతో పాటు లండన్‌ పర్యనటనలోనూ సిఎం రేవంత్‌ బృందం పర్యటించనుంది.

సీఎం రేవంత్‌ వెంట మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సీఎంఓ సెక్రటరీలు, ఓఎస్డీ తతదితరులు దావోస్‌ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత తిరిగి ఈ నెల 23న సీఎం రేవంత్‌ నేతృత్వంలోని టీమ్‌ హైదరాబాద్‌కు తిరిగి వొస్తుంది. ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి నెల రోజులు దాటినా తీరిక లేని షెడ్యూల్‌తో  బీజీగా ఉన్న  రేవంత్‌ రెడ్డి తెలంగాణకు పెట్టుబడుల సాధన విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదని నిర్ణయించుకున్నారు. దావోస్‌ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ప్రతీ సారి తెలంగాణ ప్రతినిధి బృందం  పాల్గొంటున్న క్రమంలో ఈ సారి కూడా మిస్‌ కాకూడదన్న ఉద్దేశంతో ఆయన ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *