ఎన్టిపిసి పూర్తి స్థాయి సామర్థ్యానికి..
మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి..
తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహరాష్ట్రను ఒప్పించేందుకు..
పలు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరుతూ ప్రధాని మోదీకి సిఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : ఎన్టిపిసిలో ప్రస్తుతమున్న 1600 మెగావాట్ల ఉత్పత్తి నుంచి 4000 మెగా పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి విన్నవించారు. రెండు రోజుల పర్యటన అనంతరం మంగళవారం ఒడిషాకు పయనమయ్యే ముందు బేగంపేట విమానాశ్రయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రధానికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని కోరుతూ వినతి పత్రాన్ని ప్రధానికి సమర్పించారు. అందులో భాగంగా ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని, మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
అదే విధంగా తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు ప్రధాని జోక్యం చేసుకుని మార్గం సుగమం చేయాలని ప్రధానిని సిఎం వినతి పత్రంలో అభ్యర్థించారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని, 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసిందని, రూ.7700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని, ఈ కారిడార్‌తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, దక్షిణ తెలంగాణ వైపు రవాణ మార్గాలు విస్తరిస్తాయని సిఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని, దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదని, సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య , పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలని, కేంద్ర హోమ్ శాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసిందని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను బట్టి రాష్ట్రంలో పోలీసు అధికారుల అవసరం పెరిగిందని, అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించి వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలని సిఎం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. కాగా హైదరాబాద్-రామగుండం, హైదరాబాద్-నాగ్‌పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలని, లీజు గడువు ముగిసిన శామీర్ పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (1038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలని కోరారు. ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని, అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నందున..అందులో భాగంగా హైదరాబాద్‌లో ఐఐఎం(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) నెలకొల్పాలని, అందుకు అవసరమైనంత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నామని, 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్త్తుందని, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కల్వకుర్తి-కొల్లాపూర్, గౌరెల్లి-వలిగొండ, తొర్రూర్-నెహ్రూనగర్, నెహ్రూనగర్-కొత్తగూడెం, జగిత్యాల-కరీంగర్ ఫోర్ లేన్, జడ్చర్ల-మరికల్ ఫోర్ లేన్, మరికల్-డియసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సిఎం ప్రధానికి సమర్పించిన విజ్ఞాపన పత్రంలో కోరారు. అలాగే తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నామని, ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని, సెమీ కండక్లర్లు, డిస్ ప్లే మ్యానుఫ్యాక్షరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండకర్ల మిషప్లో భాగంగా కేంద్రం సాయం అందించాలని సిఎం కోరారు.





