- దొరలకు, ప్రజలకు మధ్య పోటీ
- బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటే..
- అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు
- ఆరు గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం
- ఆర్మూర్ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ఆర్ముర్, ప్రజాతంత్ర. అక్టోబర్ 20 : రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధృ అన్నారు. ప్రత్యేక తెలంగాణలో ప్రజల గొంతు వినిపిస్తుందనుకున్నామని, తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, కానీ తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయిందని ఆయన మండిపడ్డారు. మూడురోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మొదటి పర్యటన ఆఖరి రోజు శుక్రవారం రాహుల్ ఆర్మూర్ బహిరంగ సభలో మాట్లాడుతూ ..సోనియమ్మ ఆకాంక్ష దొరల తెలంగాణ కాదని, ప్రజల తెలంగాణ కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్లుగా ప్రజల సొమ్ము దోచుకున్నారని, కేసీఆర్ ప్రజల నుంచి దోచుకున్న సొమ్మునంతా వారికి అందేలా చూస్తానన్నారు. రాహుల్ పర్యటనలో కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయని టీ కొట్టులో వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొంటూ రూ.4 వేలు పెన్షన్, మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ప్రతీ నెలా రూ.2500, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పసుపు రైతులకు ప్రధాని హామీ ఇచ్చి మోసం చేశారని తెలుపుతూ రైతు భరోసా ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వబోతున్నామని, ఛత్తీస్ గడ్‌లో ఇచ్చిన మాట ప్రకారం వారి ధాన్యాన్నీ క్వింటా రూ.2500లకు కొంటున్నామని, పసుపు రైతులకు క్వింటాకు రూ.12 వేలు నుంచి 15వేలు ధర కల్పించనున్నామని రైతులకు రాహుల్ హామీ ఇచ్చారు. తను అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదని పేర్కొంటూ అధికారంలోకి వొచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని, ఇందిరమ్మ ప్రజల భూముల కోసం కొట్లాడిన సంగతి గుర్తు చేస్తున్నానన్నారు. ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతుందని, ఆ క్రమంలో సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, తెలంగాణ ప్రజలు ఎప్పుడూ తమ కుటుంబానికి అండగా ఉన్నారని, తెలంగాణతో తన అనుబంధం ఇప్పటిది కాదన్నారు.
బీజేపీతో పోరాడిన తనపై 24 కేసులు పెట్టారనీ..మరి కేసీఆర్‌పై ఎన్ని కేసులున్నాయని ఆయన ప్రశ్నించారు. విపక్షాలపై కేసులు పెట్టె ప్రధాని మోదీ..కేసీఆర్ పై ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటేనని, పార్లమెంట్‌లో ప్రతీ బిల్లుకు బీజేపీకి బీఆరెస్ మద్దతు పలికిందని, బలం లేకపోయినా ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని, బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఎంఐఎం పోటీ చేస్తుందని, ఎంఐఎం ఎక్కడెక్కడ పోటీ చేయాలో…బీజేపీ లిస్టు తయారు చేసి ఇస్తుందని రాహుల్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ కారు టైర్‌లో వారికి తెలియకుండానే గాలి పోయిందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు బీజేపీ నుంచి క్యూ కడుతున్నారని, రాష్ట్రంలో బీఆరెస్‌ను..రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్‌లో బీజేపీ ని ఓడించి తీరతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, ఎంఐఎంకు వోటు వేస్తే అది బీఆరెస్‌కు వేసినట్లేనని, తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ఆర్మూర్ పర్యటనలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. .తెలంగాణలో రాహుల్ గాంధీ విజయభేరీ తొలి విడత బస్ యాత్ర..శుక్రవారం ముగిసింది.



