ఎక్కడెక్కడో పుట్టిన
ఎన్నెన్నో జీవితాల నదుల్ని
సముద్రంలా అక్కున చేర్చుకొని
సంఘటితపరుస్తుంటుంది…
మోడువారిన
శిశిరపు హృదయోద్యానంలో
అనుభూతుల పూలపరిమళాల్ని
వెదజల్లుతూ
ఆమనిలా విరబూస్తుంటుంది…
వేదన మంచులో
వణికే హృదయాన్ని
వెచ్చదనం తరంగాల్లో

చలిమంటలా
వోలలాడిస్తుంటుంది…
పగుళ్లుదీసిన
బ్రతుకు పుడమిమీద
ఓదార్పు మేఘమై
చినుకు చినుకుగా కురుస్తూ
సేదదీరుస్తుంటుంది…
మమతల ఉలితో
మహత్తర శిల్పిలా
రాతిగుండెకు సైతం
రమణీయాకృతినిస్తుంటుంది…
ఎన్నెన్నో ఆశల దప్పికల్ని తీరుస్తూ
మనిషిమనిషికీ మధ్య
మనసుమనసుకీ మధ్య
నిరంతరం సాగిపోయే
మహాప్రవాహం స్నేహం…

డాక్టర్‌ ‌కొత్వాలు అమరేంద్ర
 (సీనియర్‌ ‌జర్నలిస్టు), తిరుపతి (ఆ.ప్ర). 9177732414 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *