– కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం
– కక్ష సాధింపు చర్యలంటున్న బీజేపీఆర్‌ఎస్ నేతలు
(మండువ రవీందర్‌రావు)
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో బిఆర్‌ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావును ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఏసిబికి అనుమతించడంపై బీఆర్‌ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకమని తీవ్రంగా ద్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీఆర్‌ఎస్ అధినాయకత్వంపై ఏదో ఒక ఆరోపణతో పబ్బం గడుపుకోవాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడని వారు విమర్శిస్తున్నారు. దానికి బీజేపీ సహకరిస్తున్నదనడానికి తాజాగా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతించడమేనంటున్నారు. ఈ విషయంలో ఇంతకాలం మాట్లాడకుండా పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బీఆర్‌ఎస్‌ను కట్టడి చేసేందుకే ఈ రెండు పార్టీలు ఒక్కటై ప్రధాన విపక్షంపైన కేసులు బనాయిస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలని వారు ప్రశ్నిస్తున్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే కేసుల నాటకానికి తెరలేపుతున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరులపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి వేరే పనేమీలేదని బీఆర్‌ఎస్ బహిష్కృత నేత, తెలంగాణ జాగృతి అధినేత, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రతిపక్షాలు నిలదీస్తున్న క్రమంలో ప్రజల దృష్టిని మళ్ళించేందుకే కేసులతో కుట్రపన్నుతున్నారంటున్నారు. దేశంలో కుట్రపూరిత రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ఈ కేసులే నిదర్శనమంటోంది కవిత. తమ నాయకుడు కెటిఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, ప్రశ్నించే గొంతును నొక్కివేయాలని చూస్తున్నదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలవేళ రాజకీయ లబ్ధికోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ఇది కోడిగుడ్డుపై ఈకలు పీకటమే అవుతుందని ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. కాగా ప్రతీకార రాజకీయ దాడిలో భాగంగానే ఈ కేసును సిఎం తెరపైకి తెచ్చారంటున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఇది కేవలం కెటిఆర్ వ్యక్తిత్వహననం కోసం పెడుతున్న కేసన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచిన కెటిఆర్‌పై కేసేమిటని మాజీ ఎంపి వినోద్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అంటే కెసిఆర్ అని, ఐటి అంటే కెటిఆర్ అన్న తరహాలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన సాగిందంటూ ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ను దెబ్బతీయాలన్నదే ప్రభుత్వం కుట్ర అంటూ ఆ పార్టీ సీనియర్ నాయకులు పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. రెండేళ్ళ కింద జరిగిన శాసనసభ ఎన్నికల వేళ కాళేశ్వరాన్ని కూలేశ్వరమంటూ ఆ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్, అప్పటినుండి ఏ ఎన్నికలు వచ్చినా ఏదో ఒక ఆరోపణతో బిఆర్‌ఎస్ ఇమేజ్‌ని దెబ్బతీయాలని చూస్తున్నదంటున్నారు బిఆర్‌ఎస్ నేతలు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబందించి ఇప్పటికే మాజీ మంత్రి కెటిఆర్ రెండుసార్లు ఏసిబి ఎదుట, ఒకసారి ఈడి ముందు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాడు జరిగిన ఒప్పందాలు, లావాదేవీలకు సంబందించిన వివరాలన్నీ పారదర్శకంగా ఉన్నాయంటూ కెటిఆర్ వివరణ ఇచ్చారు కూడా. అయితే ఈ కేసును మరింత లోతుగా పరిశోధించేందుకు కెటిఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతివ్వాల్సిందిగా ఏసిబి గవర్నర్‌ను కోరింది. ప్రజాప్రతినిధులను ప్రాసిక్యూషన్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏసిబి అధికారులు చాలాకాలం కిందనే అనుమతికోరినప్పటికీ పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనుమతించడాన్ని బిఆర్‌ఎస్ తప్పుపడుతున్నది. ఇదిలాఉంటే ఈ రేస్‌కు సంబందించి 54.88 కోట్ల రూపాయల అక్రమంపైన ఏసిబి ప్రధానంగా దృష్టిపెట్టింది. క్యాబినెట్ అనుమతి, ఆర్‌బిఐ అనుమతి లేకుండా రెండు విదేశీ సంస్థలకు డబ్బులు ఎలా పంపారన్నది ఈ కేసులోని ప్రధాన అంశం. దీని కారణంగా ప్రభుత్వం 8.07 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చిందన్నది అభియోగం. ఈ కేసులో ఏ1గా కెటిఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్విందకుమార్, ఏ3గా హెచ్‌ఎండిఏ అధికారి బిఎల్‌ఎన్ రెడ్డిపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. గవర్నర్ అమోదంతో ఇప్పుడు వీరిపైన ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశముంది. ఈ క్రమంలోనే కెటిఆర్‌ను అదుపులోకి తీసుకుంటారా అన్న చర్చకూడా జరుగుతున్నది. తనను జైలుపాలు చేసిన కెసిఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. కెసిఆర్ కుటుంబాకి, బిఆర్‌ఎస్ పార్టీకి రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలన్న దృఢ సంకల్పం ఆయనలో ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారంలో ఉంది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయినా దూకుడుగా వ్యవహరిస్తున్న కెటిఆర్‌కు కళ్ళెం వెయ్యడానికే ఈ కేసును ముందుకు తీసుకువస్తున్నట్లు బిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తాను ఎట్టి పరిస్థితిలోనూ భయపడేదిలేదని కెటిఆర్ ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ కేసుకు సంబందించి ఒక్క రూపాయికూడా అవినీతి జరగలేదన్న విషయాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుండి చెబుతున్నారు. వందసార్లు అడిగినా అదే చెబుతాను. లై డిటెక్టర్ టెస్ట్‌కు కూడా సిద్దమేనంటున్న కెటి రామారావు అసలు ఈ ప్రభుత్వానికి తనను అరెస్టు చేసే ధైర్యముందా అని సవాల్ విసురుతున్నారు. కాగా, సుమారు రు.5లక్షల కోట్ల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తున్నదంటూ ఆయన ఎదురు దాడికి దిగడం మరో మలుపు.





