- బాధితులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యం
- మంత్రి తన్నీరు హరీష్ రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : మహిళలు, బాలికల సహాయం అందించడమే ‘భరోసా’ అని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి రామ్ నగర్ కాలనీలో భరోసా సెంటర్ నూతన భవన నిర్మాణం కోసం హరీష్ రావు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ యం.పి. కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ. చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్,జిల్లా టి.ఆర్.యస్. అధ్యక్షులు చింత ప్రభాకర్ భరోసా కేంద్రం శిలాఫలక ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పర్యవేక్షణలో మహిళలు, పిల్లల రక్షణ గురించి మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో ‘‘భరోసా’’ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఇది తెలంగాణ రాష్ట్రంలో మే 2016లో స్థాపించబడిందని, హింసకు గురైన మహిళలు, యువతులు, పిల్లలకు సమగ్ర సహాయం, మద్దతు అందించడం ఈ భరోసా కేంద్రం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలు వివిధ రకాల హింసలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఒకే గొడుగు క్రింద వైద్య, చట్టపరమైన, మానసిక మరియు కౌన్సెలింగ్ మద్దతు వంటి అత్యవసర సేవలను పొందవచ్చునన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మాట్లాడుతూ..భరోసా అంటే మహిళల రక్షణకు సంబంధించిన అంశమని, ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక భరోసా సెంటర్ లను ఏర్పాటు చేసి సత్ఫలితాలను పొందుతున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అత్యాచారానికి గురైన మహిళలు, చిన్నారులకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం 24ఐ7 మహిళా భరోసా సిబ్బంది అందుబాటులో ఉంటూ బాధితులకు భరోసా ఇస్తారన్నారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధితులు అత్యాచారాలకు గురైన మహిళలను అక్కున చేర్చుకుని వారికి న్యాయ సహాయం చేయడం, వైద్య పరీక్షలు, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ అవ్వాలనే లక్ష్యంతో, వారికి తిరిగి స్వేచ్ఛ జీవితాన్ని కల్పించడంలో భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఫోక్సో మరియు క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్ కు సంబంధించిన కేసులను సత్వర న్యాయం చేయుట కొరకు భరోసా సెంటర్ కి బదిలీ చేయడం వలన మెడికల్ ఎగ్జామినేషన్, బాధితురాలి వాంగ్మూలం నమోదు, బాధితురాలికి మానసిక దృఢత్వానికి కౌన్సిలింగ్ ఇప్పించడం, 164 సిఆర్‌పిసి స్టేట్‌మెంట్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేయడం, బాధితురాలికి షెల్టర్ ఇవ్వటం వంటివి కల్పించడం, తద్వారా బాధితురాలు పోలీస్ స్టేషనులకు పదేపదే తిరగాల్సిన అవసరం ఉండదు.
వారు కూడా తమకు భరోసా కల్పించే అధికారులతో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించగలుగుతారు. చాలామంది బాధితురాళ్లు వారికి ఎదురైన సమస్యను పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయుటకు భయపడుతూ మరలా మరలా అదే ఆకృత్యాలకు గురి అవుతుంటారని వివరించారు. అటువంటి వారికి అండగా నిలిచేదే భరోసా కేంద్రం. భరోసా సెంటర్ ద్వారా ఇప్పటివరకు 183 మంది భాదితులను రక్షించి, రూ. 43.7 లక్షలు ఆర్దిక సహాయం అందించడం జరిగిందని అన్నారు. భరోసా సెంటర్ ప్రత్యేక భవన నిర్మాణం కోసం అదనపు డైరెక్టర్ జనరల్(విమెన్ సేఫ్టీ వింగ్) స్వాతి లక్రా ప్రత్యేక చొరవతో అరబిందో ఫార్మా లిమిటెడ్ యొక్క దాతృత్వ విభాగం అరబిందో ఫార్మా ఫౌండేషన్ ‘‘జెండర్ ఈక్విటీ మరియు మహిళా సాధికారత’’ అనే థీమ్ కింద సిఎస్‌ఆర్ నిధులతో మహిళలు మరియు పిల్లల భద్రతను ప్రోత్సహించడానికి అరబిందో ఫార్మా లిమిటెడ్ ఈ ప్రాజెక్టు చేపట్టి సుమారు రూ.
2 కోట్లతో బహుళ సేవలకు అనుగుణంగా, కార్పొరేట్ ఆఫీస్‌ను తలపించే విధంగా వివిధ సదుపాయాలతో 5,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భరోసా కేంద్రం నిర్మాణానికి పూనుకున్నది. అడగగానే సహృదయంతో స్పందించిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ మరియు అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & వైస్ చైర్మన్ కె నిత్యానంద రెడ్డి మరియు అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మరియు అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డికి, జిల్లా ఎస్‌పికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భరోసా సెంటర్లో మహిళలకు బాలలకు అందించే సేవలు
ఎఫ్‌ఐఆర్ నమోదు దశ నుండి, కోర్టులో తుది పరిష్కారానికి సంబంధించిన ప్రతి కేసుల్లో భరోసా చట్టప్రకారం సహాయాన్ని అందిస్తుందని, బాధితులను భరోసా సిడబ్ల్యుసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరపరచడం జరుగుతుంది. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతుంది. బాధితురాలికి తాత్కాలికంగా, అత్యవసర ఆశ్రయం అవసరమైతే సఖి కేంద్రానికి పంపివ్వడం జరుగుతుందని నిర్వాహకులు అన్నారు. భరోసా సెంటర్లో యుక్త వయసులో ఉన్న బాలికలు, అబ్బాయిలతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
బాధితులకు కౌన్సిలింగ్ మరియు బాధితుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి భరోసా ప్రతినిధులు వారి యొక్క గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. భరోసా సెంటర్లో సెంటర్ కో-ఆర్డినేటర్, మరియు సైకాలజిస్ట్, సపోర్ట్ పర్సన్, లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఏఎన్‌ఎం), డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, రిసెప్షనిస్టులతో భరోసా సెంటర్లో సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయ లక్ష్మీ రవి, జడ్పీ వైస్ చైర్మెన్ శాంకరి లత విజేందర్ రెడ్డి, డిడబ్యూఒఎ పద్మావతి, జడ్పీటిసి సునీత మనోహర్ గౌడ్, 22వ-వార్డ్ కౌన్స్లర్ తూర్పు నిర్మల, అరబిందో ఫార్మా నుండి జీవిఎస్ మూర్తి, రాధామాదవ్, ఇతర ఫార్మా ప్రతినిధులు, భరోసా టీమ్ ఇన్స్‌పెక్టర్ రాంరెడ్డి, ఎస్‌ఐ రాణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



