మన ఊరు.. మన బడిపై నీలినీడలు

  • వెక్కిరిస్తున్న ఉపాధ్యాయుల, పర్యవేక్షణాధికారుల కొరత
  • బదిలీలు, పదోన్నతులు లేక ఉపాధ్యాయుల గుస్సా
  • రాష్ట్రంలో కేవలం 17 మండలాలకు మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓలు
  • 20 వేలకు పైగా ఉపాధ్యాయుల కొరత
  • ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు ఉపాధ్యాయుల ఆందోళన బాట

జగిత్యాల, ప్రజాతంత్ర, జులై 5 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన ఉపాద్యాయుల భర్తీ, బదిలీలు, పదోన్నతులు ప్రకటనలు అమలుకు నోచుకోకపోవడంతో ఉపాధ్యాయులు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయులకు నాలుగేళ్ళుగా బదిలీలు, ఏడేళ్ళుగా పదోన్నతులు లేవు. పదిహేడేళ్ళుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ కాక విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1962 హైస్కూల్‌ ‌హెడ్మాస్టర్‌ ‌పోస్టులు, 7136 స్కూల్‌ అసిస్టెంట్స్, 2043 ‌పిఎస్‌ ‌హెడ్మాస్టర్‌, 8185 ఎస్జీటీ తత్సమాన పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కేవలం 17 మండలాలకు మాత్రమే రెగ్యులర్‌ ఎంఈఓలున్నారు. కొత్త జిల్లాలకు డిఈఓలు, ఉన్నత పాఠశాలల పర్యవేక్షణకు డిప్యూటీ విద్యాధికారులు లేరు. డైట్‌, ‌బిఇడి కళాశాలల్లో 95 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో సగటున మూడు సబ్జెక్ట్ ‌టీచర్‌ ‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు (పిఓ- 2018) ప్రకారం బదిలీలు, పదోన్నతులకు గల ఆటంకాలు తొలగిపోయాయని, విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభం పరిష్కారానికి మార్గం సుగమమైందని భావించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి 2021 మార్చి 22న, 2022 మార్చి 10 తేదీల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించారు.

విద్యాశాఖ మంత్రి  సైతం వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని పలుమార్లు హామీ ఇచ్చారు. ఈ రోజు రేపంటూ ఎదురు చూస్తున్నా షెడ్యూల్‌ ‌మాత్రం విడుదల కాలేదు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి కనీసం చర్చించలేదు. ప్రమోషన్లకు గల ఆటంకాలేమిటో…ఎందుకు షెడ్యూల్‌ ఇవ్వలేక పోతున్నారో వెల్లడించడం లేదు. 2017 నుండి పండితులు, పిఈటి ల అప్‌‌గ్రెడేషన్‌ ‌వివాదం రావణ కాష్టంలా రగులుతున్నది. 10478 అప్‌‌గ్రెడేషన్‌పై ఉన్న న్యాయ వివాదాల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపటం లేదు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఉపాధ్యాయుల సమస్య మాత్రమే కాదు విద్యార్థులది కూడా….ప్రమోషన్లు ఇస్తే ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ ‌టీచర్ల కొరత తీరుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మన ఊరు-మన బడి, ఇంగ్లీషు మీడియం పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే కూడా పాఠశాలల్లో ఉపాధ్యాయుల, పర్యవేక్షణ అధికారుల కొరత తీర్చాల్సిన అవసరం ఉన్నది. ఉపాధ్యాయుల పదోన్నతుల అనంతరం క్రింది క్యాడర్లలో ఏర్పడిన ఖాళీలకు ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలి. ఈలోగా తాత్కాలిక ఉపాధ్యాయులను (విద్యావాలంటీర్లను) నియమించాలంటే ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. కోవిడ్‌ ‌కు ముందు 15 వేలమంది విద్యా వాలంటీర్లు పనిచేశారు. వారిని రీ ఎంగేజ్‌ ‌చేయటంలేదు. పాఠశాలల పారిశుద్ధ్య నిర్వహణ కోసం సర్వీస్‌ ‌పర్సన్స్ ‌నియామకానికి గత రెండు సంవత్సరాలుగా అనుమతించటం లేదు. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు అప్పగించామన్నారు.

ఇప్పుడు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో మనకు తెలిసిందే, బడులకు రంగులేసి అందంగా తీర్చిదిద్దుతున్నామని ప్రచారం చేసుకుంటే సరిపోదు. బోధించే ఉపాధ్యాయులుండాలి. పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు సకాలంలో సరఫరా చేయాలి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి. అప్పుడు మాత్రమే సర్కారీ చదువులపట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చి అమలు చేసిన జిఓ 317 వలన వేలాది మంది ఉపాధ్యాయులకు తీరని నష్టం జరిగింది. అర్ధాంతరంగా చేపట్టిన ఉద్యోగుల విభజన కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు చేసుకున్న అప్పీల్స్ ‌పరిష్కారం చేయటంలో అసాధారణ జాప్యం జరుగుతుంది. జూనియర్‌ ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయారు.

భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు కెటాయించబడి వేదన చెందుతున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించమంటే పట్టించుకోలేదు. అలాంటి వారందరూ న్యాయం కోసం హైకోర్టు బాట పట్టాల్సివచ్చింది. జీఓ 317 సృష్టించిన విలయం నుండి బయట పడటానికి ఉపాధ్యాయులు పదే పదే రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనా కుటుంబాలను స్థిరపరచుకోలేక తీవ్రమైన మానసిక వత్తిడికి లోనౌతున్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారంలో నిబంధనల పేరిట తాత్సారం చేస్తున్న అధికారులు ఏలినవారి ప్రాపకం కలిగిన వారికి, పైరవీ చేసుకున్న వారికి నిబంధనలతో నిమిత్తం లేకుండా జిల్లాలు దాటించి కోరుకున్న స్థానాలను కట్టబెడుతున్నారు. పరస్పర బదిలీల ప్రహసనం ఇంకా కొనసాగుతుంది. తొలివిడత చేసిన మూడు వేల బదిలీల్లో 300 పైగా గల్లంతయ్యాయి.

అందుకు బాధ్యత ఎవరు వహిస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వల్ప కారణాలకే ఉపాధ్యాయులను కఠినంగా దండించే అధికారులు వారి నిర్లక్ష్యంపై ఏం చర్యలు తీసుకున్నారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి ఆధ్వర్యంలో పలుమార్లు విద్యా శాఖ మంత్రిని కలిసి చర్చించినా సమస్యల పరిష్కారంలో పురోగతి లేకపోవటంతో మే 18న జిల్లా కేంద్రాల్లో వేలాది మంది ఉపాధ్యాయులు ధర్నాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్సెస్సీ మూల్యాంకన కేంద్రాల వద్ద ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వం నుండి స్పందన లేదు. జూన్‌ ‌నెలాఖరులోగా అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ‌విడుదల చేయాలని, లేని యెడల జులై 7న హైదరాబాద్లో ఉపాధ్యాయుల మహాధర్నా నిర్వహిస్తామని ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి పక్షాన ప్రభుత్వానికి నోటీసు ఇచ్చినప్పటికీ స్పందన లేదు.

విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై వేగంగా స్పందించి పరిష్కరించాల్సిన శాఖాధిపతి (డియస్‌ఈ) ఉపాధ్యాయ సంఘనాయకులకు, సాధారణ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండటం లేదని వారు ఆరోపించారు. కార్యాలయంలో నిర్దిష్టమైన సందర్శన వేళలు లేవని, ఉపాధ్యాయుల వ్యక్తిగత సర్వీసు సమస్యల పరిష్కారంలో నాన్చుడు ధోరణి కొనసాగుతున్నదని వారు వాపోతున్నారు. రాష్ట్ర విద్యారంగంలో నెలకొన్న అపసవ్య ధోరణిని, సమస్యల తీవ్రతను, ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని ప్రజల దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడానికి ఈ నెల 7న ఆందోళన బాటను ఎంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *