దిల్లీ లిక్కర్ కేసులో ముగిసిన వాదనలు
విచారణ డిసెంబర్ 15కు వాయిదా
న్యూదిల్లీ,నవంబర్30: లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై వాదనలు ముగిశాయి. ఛార్జీ షీటును పరిశీలించిన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. అనంతరం కేసు విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 25న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఆప్ నేత విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లితో సహా ఏడుగురు నిందితులపై అభియోగాలు మోపుతూ 10వేల పేజీల ఛార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టులోఫైల్ చేసింది.
ఏ1గా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్, ఏ2గా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ సింగ్, ఏ3గా అభిషేక్ బోయిన్పల్లి, ఏ4గా విజయ్ నాయర్, ఏ5గా అరుణ్ రామచంద్ర పిల్ళై, ఏ6గా సర్ మహేంద్రు, ఏ7గా ముత్తా గౌతమ్ పేర్లను చేర్చింది. ఇదే కేసుకు సంబంధించి.. ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసింది. గురుగ్రాంకు చెందిన అమిత్ అరోరా బడ్డీ రిటైల్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితులైన ముగ్గురిలో అమిత్ ఒకరు. అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా సిసోడియాకు అత్యంత సన్నిహితులు కాగా..వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్‌గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను అదుపులోకి తీసుకున్నట్లు ఇడి తెలిపింది. అమిత్ గురుగ్రామ్‌లోని బుడ్డీ రిటైల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి డైరెక్టరైగా ఉన్నారు. మనీలాండరింగ్ చట్టం కింద గత రాత్రి అమిత్‌ను అరెస్టు చేసినట్లు ఇడి వర్గాలు బుధవారం వెల్లడించాయి.
ఆయనను స్థానిక కోర్టులో హాజరుపరిచి .. కస్టడీ కోరే అవకాశం ఉన్నటుల ఆ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇడి ఇటీవల మూడు వేల పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిసోడియా సన్నిహితులైన అమిత్ అరోరా, దినేశ్ అరోరా, అర్జున్ పాండేలు లిక్కర్ లైసెన్స్‌ల నుండి సేకరించిన నగదును నిర్వహించడంలో, ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి మళ్లించడంలో చురుకుగా వ్యవహరించినట్లు చార్జిషీటులో పేర్కొంది.




