మతమౌఢ్యం ఫలితమే-మణిపూర్ మంటలు

మణిపూర్ లో జరిగిన సంఘటన మానవత్వానికి మాయని మచ్చ.సంఘటన  జరిగి 77 రోజులు గడచిన,సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయి బయటి ప్రపంచానికి తెలిసేంత  వరకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించలేదంటే,. సుప్రీంకోర్టు కేంద్రాన్ని “మీరు చర్యలు తీసుకుంటారా? లేక మేము తీసుకోవాలా” అని హెచ్చరిస్తే గానీ కేంద్రం స్పందించలేదంటే..  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఉదాసీనంగ వ్యవహరించాయో అర్థం చేసుకోవచ్చు.అస్సలు అక్కడ అగ్గి రాజేసింది ఎవరు? ఆజ్యం పోసింది ఎవరు? చలి మంటలు కాచుకుంటున్నది ఎవరు?  లూటీలకు లూటీలు,హత్యలకు హత్యలు జరుగుతు,మధ్యయుగ కాలం నాటి మత యుగాన్ని తలపిస్తున్నా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు?.స్థానికంగా ఉన్న పోలీసులు చర్యలేమయినట్లు? ఆర్మీ కాళ్లకు సంకెళ్లు వేసింది ఎవరు?న్యాయం చేయాల్సిన న్యాయస్థానం(హై కోర్టు)అన్యాయానికి ఆజ్యం పోసి ఆరని అగ్గి రాజేస్తే అన్యాయం అయిన ఆదివాసిలను ఆదుకునేదేవరు?.స్వయంగా దేశ హోంశాఖ మంత్రి  రాష్ట్రంలో పర్యటించినా ఫలితమేమి?.ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని చల్లబరిచినట్లా? లేదా అగ్నికీ మరింత ఆజ్యం పోసినట్లా?.

అక్కడ చెరబట్టింది ఆదివాసీ ఆడబిడ్డలను కాదు,యావత్ భారత దేశ మాన ప్రాణాలను చేరబట్టారు.దేశాన్ని కాపాడిన సైనికుని భార్యకు దేశంలోనే రక్షణ లేదంటే దేశం ఏటు పోతునట్లు?.ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలు మారుతున్నాయని పదే పదే ప్రసంగించిన వారు దీనికి సమాధానం చెప్పాలి.రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తుతున్నట్లుంది ప్రధాని గారి 78 రోజుల మౌనం.న్యాయస్థానం(హై కోర్టు)అన్యాయానికి ఆజ్యం పోస్తే,రక్షించాల్సిన పోలీసులే రాక్షసులకు అప్పగిస్తే బాధితులకు రక్షణ కల్పించేది ఎవరు?.విదేశాల్లో ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే మనం,మనం దేశ సంఘటన సోషల్ మీడియాలో వస్తేగాని స్పందించలేరంటే దేశంలో ప్రజాస్వామ్యం ఎంత పరిఢవిల్లినట్లు?.

మతం మత్తుమందు లాంటిది అన్నాడు కారల్ మార్క్స్.మధ్యయుగ కాలంలో జరిగిన సంఘటన నేపథ్యంలో మార్క్స్ అలా అని ఉండవచ్చు.మధ్య యుగంలో మతాల పేరా జరిగిన మారణ హోమం  అంతా ఇంతా కాదు.అయితే మతమౌఢ్యం ఒక దేశానికో,ఒక ప్రాంతానికో,ఒక మతానికో,ఒక జాతికో పరిమితం కాలేదు.ప్రపంచవ్యాప్తంగా అనేక మతాల,జాతుల్లో ఘర్షణలు జరిగాయి.ఆధునిక కాలంలో యూదులపై హిట్లర్ హింసాకాండ మత మౌఢ్యానికి  ఒక ఉదాహరణ.తాలిబాన్ల కాలంలో మతమౌఢ్యం రాజ్యమేలింది,ఏలుతుంది. అయితే ఈ అన్ని సంఘటనల్లో బాధితులు మాత్రం మహిళలే.దేశాన్ని భారతమాత గా భావించే మనదేశంలో,మహిళలను పూజించే జంబుద్వీపంలో మహిళలను చెరబట్టడమా ?
ఈ ఆధునిక కాలంలో కూడా మతమౌఢ్యంలో ఉండి పొదామా?ఇంకా తెగలు,జాతులు, మతాల పేరా వైర్యం రాజేద్దామా?.

దేశ విభజనకు మతమే కారణం.ఆనాడు జరిగిన మరణ హోమం అంతఇంత కాదు. 1984లో పంజాబ్ లో జరిగిన అల్లర్ల కు మతానికి సంబంధం ఉంది.బొంబాయిలో జరిగిన అల్లర్లకు మతమే కారణం.2002లో గోద్ర సంఘటనకు,తర్వాత జరిగిన సంఘటనలకు మతం  కారణం కాదా?.ఇప్పుడు మణిపూర్ లో జరిగిన సంఘటన స్థానిక గిరిజన,గిరిజనేతర తెగల మధ్య జరిగిన సంఘటనగా కనిపించినా మతమే అసలు కారణమని అందరికీ తెలుసు. అక్కడ అల్లర్లు ముందు ఎవరు ప్రారంభించారు,న్యాయం ఎవరిది,అన్యాయం ఎవరిది అనేది ప్రశ్న కాదు.శాంతి నెలకొల్పాల్సిన పోలీసుశాఖ,న్యాయం చేయాల్సిన న్యాయ శాఖ ఏం చేస్తునట్లు.న్యాయం చేయాల్సిన న్యాయశాఖ(హైకోర్టు)పరిధికి మించి వ్యవహరించడం వల్ల మణిపూర్ మంటలు అంటుకుంది.రక్షించాల్సిన పోలీస్ శాఖ బాధితులను రాక్షసులకు అప్పగించి ప్రేక్షక పాత్రవహించడం కారణంగా  ఆ ఘోరం జరిగింది.

ఈ వైఫల్యాలకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? దేశాన్ని కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వం 355 అధికరణ ప్రయోగించిన ఫలితం రాలేదంటే ఆ వైఫల్యం కేంద్రానిది కాదా?.ప్రజాస్వామ్యం అంటే  మెజార్టీ అభిప్రాయమే కాదనలేం,కానీ మైనార్టీ మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందేగా. ఎవరు ఏమి కోరుకున్న రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం అది న్యాయబద్దమైతెనేగా  అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. దేశంలో మెజార్టీలు,మైనార్టీలు,ఎస్టీలు,ఎస్సీలు ఓబీసీలు,ఓసిలు ఎవరైనా సరే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉండాల్సిందే..

మతమౌఢ్యం తలకెక్కిన వారికి మానవత్వం కనిపించదు.ఆ మతమౌఢ్యం ఏ ఒక్క మతానికో పరిమితం కాలేదు.ఇప్పటికి తాలిబాన్ రూపంలోనో, కొన్ని ఆఫ్రికా,ఆసియా దేశాలలోనో చూస్తున్నాం. మన దేశంలో కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం తమ సిద్ధాంతాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు. అది మితవాద చర్యల నుంచి మొదలై చివరకు అతి తీవ్రమైన చర్యలుగా పరిణమిస్తున్నాయి.రాజ్యాంగ మౌలిక స్వరూపం నచ్చని వారు ప్రారంభం నుంచి రాజ్యాంగాన్ని అంగీకరించడం లేదు.దేశంలో రాజ్యాంగ పద్ధతుల్లోనే అధికారంలోకి  రావాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అంగీకరిస్తూ మితవాద చర్యలతో మొదలై,మెల్లగా తమ సిద్ధాంతాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర క్రమంగా జరుగుతూనే ఉంది.నేడు అధికరణ 371 సి నీ మార్చే కుట్ర మణిపూర్ లో  కావచ్చు..రేపు 371 ఎ నాగాలాండ్ లో కావొచ్చు,371 బీ అస్సాంలో కావచ్చు,371 ఎఫ్ సిక్కింలో కావొచ్చు,371 జీ మిజోరాంలో కావచ్చు, 371 హెచ్ అరుణాచల్ ప్రదేశ్ లో కావొచ్చు.ప్రస్తుతం మణిపూర్ లాంటి డిమాండ్లు రావని  గ్యారెంటీ ఏంటి?.ప్రకరణ 244(1) 5వ షెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా గిరిజన ప్రాంతాలపై,ప్రకరణ 244(2)ఆరవ షెడ్యూల్ ప్రకారం అస్సాం,మేఘాలయ,త్రిపుర,మిజోరం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలపై కూడా ఇటువంటి డిమాండ్లు రావని గ్యారెంటీ ఏంటి?.వస్తే ప్రభుత్వం మెజార్టీ వోట్ల కోసం రావణ కాష్టం రగిలించినా చూస్తూ మౌనం వహిస్తుందా?. మతమౌఢ్యం తమ సిద్ధాంతాలను సామ దాన భేద దండోపాయాలతో అమలుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది.

    మొన్న కర్ణాటకలో హిజాబ్ లొల్లి,నిన్న దిల్లీ నడివీధుల్లో న్యాయం కోసం ఆడబిడ్డల(రైజర్ల) ఆర్తనాదాలు,నేడు ఎస్టీ హోదా కోసం మణిపూర్ లో మంటలు రగులుతున్నాయి.కొన్ని రాష్ట్రాల పాలనలోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి.మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వయంగా ప్రధానమంత్రి “కుటుంబంలో ఇద్దరి వ్యక్తులకు రెండు చట్టాలు ఉంటాయా” అని బలవంతంగానైనా సరే ఉమ్మడి పౌరస్మృతి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించకనే ప్రకటించారు.దేశ మౌలిక స్వరూపమైన భినత్వంలో,ఏకత్వాన్ని కాదనే ఆలోచనలు మానుకోవాలి. మధ్యయుగం కాలం నాటి మత ఆలోచనలు విడనాడాలి. ఏ మతస్థులైన,ఏ కులస్తులైన,ఏ జాతులవరైన,ఏ తెగలవరైన అందరికీ రాజ్యాంగ సూత్రాలు వర్తిస్తయని ప్రజలందరూ గమనించాలి. ఇది ఆధునిక కాలం..ప్రజలకు కావలసింది సమగ్ర సమ్మిళిత అభివృద్ధి కానీ,మతం పేర జాతుల పేర,తెగల పేర ప్రజల మధ్య విద్వేషాలు రావణకాష్టంలా నిరంతరం రగిలించడం కాదు. ఒక ప్రక్క అభివృద్ధి,మరో ప్రక్క ప్రజాసంక్షేమం కావాలి.అభివృద్ధి,ప్రజాసంక్షేమమనే రెండు పట్టాలపై దేశం,రాష్ట్రాలు ప్రయాణించాలి.
image.png
జుర్రు నారాయణ యాదవ్,
తెలంగాణ టీచర్స్ యూనియన్,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
(జిల్లా అధ్యక్షులు)
మహబూబ్నగర్,
9494019270.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *