భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : దళిత మహిళలని కూడా చూడకుండా తమ కుటుంబానికి చెందిన సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూమిని వరంగల్ జిల్లా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి జున్ను సంతోష ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆత్మకూరు మండలం గుడేస్పాడు చెరువు శిఖంలోని సర్వే నెం.731 లోని 25 ఎకరాలు(లావని పట్టా వ్యవసాయభూమి)తమ ఉమ్మడి కుటుంబానికి చెందినదని అన్నారు. భూమిని కబ్జా చేయడమే కాకుండా ప్రశ్నిస్తే ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా తనపై భౌతిక దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. భూమిలో అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట వేయగా మొత్తం దోచుకుపోయారని, ప్రశ్నించిన తనను విపరీతంగా కొట్టారని ఆరోపించారు. ఇదే విషయమై ఏప్రిల్ 28న ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానన్నారు. కానీ పోలీసులు ఎమ్మెల్యేకి వత్తాసు పలుకుతూ తననే కాగితాలపైన సంతకాలు పెట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. వెంటనే ఆత్మకూరు ఎస్ఐ, సిఐలను సస్పెండ్ చేయాలన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నుంచి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర డిజిపిలు ఈ విషయంలో జోక్యం చేసుకొని, కబ్జాకు గురైన తన భూమిని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *