‘భిన్నత్వంలో ఏకత్వం’

సంబరాల పండుగ, ముగ్గుల పండుగ, పొంగల్‌ పండుగ..

సంక్రాంతి.. భారతీయ పండుగ. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రీతి. ఈ సంక్రాంతి పండుగను తెలుగువారు, తమిళులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్‌ అని, మహారాష్ట్ర, గుజరాత్‌ లలో మకర్‌ సంక్రాంతి అని, పంజాబ్‌, హర్యానాలలో లోరీ అని మూడు రోజుల పాటు జరుపుకుంటారు.   తెలుగింటి సంబరాల పండుగ, స్త్రీల బొమ్మల పండుగ, రైతుల పండుగ, కొత్త జంటల పండుగ,  ధనుర్మాసం ఒక ఆధ్యాత్మిక పండుగ… సంక్రాంతి సంబరాలు.. అంబరాన్నంటేలా జరుపుకే ఈ పండుగ ‘భిన్నత్వంలో ఏకత్వం’. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే ‘మారడం’ అని అర్థం. సూర్యుడు  మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి.

అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 14న సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఆంధ్రప్రదేశ్‌ లో సంక్రాంతిని కోస్తా జిల్ల ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకోవడం చాలాకాలంగా వస్తున్న ఆనవాయితి.  ఈ పండుగ మూడు రోజుల్లో మొదటి రోజును భోగి, రెండవ రోజును సంక్రాంతి, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. ఇంకా మరికొంతమంది కనుమ తర్వాత నాలగవ రోజును ముక్కనుమని అని చేసుకొంటారు. ముక్కనుమ రోజు బంధువులు, స్నేహితులతో కలిసి వారి బహుమతులను అందించడం ఆనవాయితి. వారికి మాత్రమే కాదు, వ్యవసాయ దారులకు, పనివారికి కూడా మంచి బహుమతులను అందిస్తారు.

ధనుర్మాస మొత్తం పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరాల్సిందే… సంక్రాంతి నెల ప్రతీ రోజూ తమ ఇళ్ళ ముంగిళ్ళలో రంగవల్లులు, ప్రత్యేకంగా ఆవు పేడతో తయారు చేసే గొబ్బెమ్మలతో రకరకాల పువ్వులతో అలంకరిస్తారు. మరో ప్రక్క బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు, వివిధ రకాలజానపద వినోద కళాకారులు నెలమొత్తం వీధుల్లో అలరిస్తుంటారు. ఇక భోగి రోజు  మంట విధిగా వేయవలసిందే. ఆ రోజు సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్ళు ఆనవాయితీ. మరో ప్రత్యేకత ఉంది అదేంటంటే పల్లెలో కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు. పశువులను పువ్వులతో, ఆకర్షణీయంగా అలంకరిస్తారు. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వ సామాన్య విషయాలు. తెలుగు సంస్కృతి వివిధ రూపాల్లో ప్రత్యక్షమయ్యే గొప్ప శుభవేళ ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరస విన్యాసాలతో జరుపుకొనే సజీవ చైతన్యమే ఈ సంక్రాంతి.

అన్నదాతలైన రైతులు కష్టపడి చేసిన వ్యవసాయ ఫలితం ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్ళకుచేరి నట్టింట కొలువుదీరే పండుగ సంక్రాంతి. ఆనందాన్ని మనసునిండా నింపుకొని, అనురాగబంధాల మధ్య ఎంతో శ్రద్ధగా ఈ పండుగ జరుపుకొంటారు. స్త్రీలు వేకువజామున లేచి ఆవుపేడతో వాకిలి కళ్ళాపి జల్లి ముగ్గులు కళాత్మకంగా రంగులద్ది కొత్త సొబగులు తెస్తారు. ముగ్గుల మధ్య ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి పసుపు రంగు పూలతో అలంకరిస్తారు. గుమ్మడి పూలు, తంగేడు పూలతొ అలంకరించిన గొబ్బెమ్మలు ముంగిళ్ళను కొత్త అందాలతో నింపుతాయి.

హరిదాసు రాక, జంగమయ్య దీవెనలు, బుడబుక్కలవాని ఢమరుకనాదం, గంగిరెద్దుల వాని ఆట ఈ పండుగ సందడిలో ఒక భాగం. హరిదాసు అలంకరణ ఒక ప్రత్యేకత. నుదుటన తిరుచూర్ణం, చేతిలో చిడుతలు, తలమీద గుమ్మడికాయ ఆకారంలో వున్న పాత్ర, తంబుర నాదంతో ‘హరిలో రంగ హరీ’ అంటూ చేసే సందడి కొత్త కళను తెస్తుంది. అంబపలుకు, జగదంబపలుకు అంటూ బుడబుక్కల వాని పలుకులు వేకువజాముని జాగృతిని చేస్తాయి. జంగమయ్య దీవెనలతో వీధులన్నీ మార్మోగుతాయి. రంగు రంగుల గాలిపటాలను తయారు చేసి ఎగురవేసి పిల్లలు చేసే సందడి ఈ పండుగ ప్రత్యేకం. స్త్రీలు పేరంటం జరిపి చిన్న చిన్న బొమ్మలు, కుంకుమ భరిణలను కానుకలుగా ఇస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ మూడు రోజులు బొమ్మల కొలువు కూడా పెడతారు.

తమిళనాడు మదురై, తంజావురు, తిరుచునాపల్లి మీదుగా కనడ స్వామి దేవాలయము వరకూ రథ యాత్ర  నిర్వహిస్తారు. ఈ పండుగరోజు ఉత్తరాయణ పుణ్యకాలం  ఆరంభమవుతుంది. ఈ సంక్రాంతి రోజున పొంగలి అనే తీపి అన్నఒ చేసి దేవుని పూజించి తింటారు. శ్రీ మహావిష్ణువును పాండురంగడుగా కీర్తిస్తూ శ్రీలక్ష్మిదేవిని గోదాదేవిగా పేర్కొంటూ  వైష్ణవాలయాల్లో వివాహం జరుపుతారు. ఈ సంక్రాంతి రోజులలో గంగ, సరస్వతి, యమున సర్వ పుణ్య నదులు ఒక్క చోట కలుస్తాయని ప్రతీతి. దీనినే ‘కుంభ మేళగా నిర్వహిస్తారు. మహాభారతంలో భీష్ముడు పదిరోజులు అంబుల పొదినే శయ్యగా చేసుకొని పవళించి సంక్రాంతి దినమున ఉత్తరాయణ పుణ్యకాలంలో  తనువు చాలించాడు.
-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *