కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపి
కెసి వేణుగోపాల్, సిఎం రేవంత్, మల్లు భట్టి తదితరుల సమక్షంలో చేరిన వెంకటేష్
న్యూదిల్లీ, ఫిబ్రవరి 6 : పార్లమెంట్ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా నేతలు బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు దిల్లీలో రేవంత్ రెడ్డితో కలిసి కారులో కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు. అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, హస్తం పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. అందరి సమక్షంలో ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొంత మంది వెంకటేష్ అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ తరుణంలో వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వెంకటేష్ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు.
ఆయనతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డితోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన తర్వాత పార్టీ నాయకత్వానికి వెంకటేష్‌కు కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా సమాచారం. ఈ తరుణంలో వొచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ స్థానంలో మరొకరిని బరిలోకి దింపే ఆలోచన అధిష్టానం చేస్తున్న తరుణంలో వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరారు.



