బ‌న‌క‌చ‌ర్ల ద్వారా 200 టీఎంసీల త‌ర‌లింపున‌కు కుట్ర‌

– చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం
-తెలంగాణ ప్రాజెక్టుల‌ను అడ్డుకుంటున్న ఏపీ ప్ర‌భుత్వం
-కాళేశ్వ‌రం అనుమ‌తుల‌ను ర‌ద్దుచేయాల‌ని ఏపీ లేఖ‌లు రాసింది
– ఏ అనుమ‌తులు లేకుండా ప్రాజెక్టు ప‌నుల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఏపీ
– బీఆర్ ఎస్ గోల పెడితేకాని ఉత్త‌మ్ మేల్కోలేదు
– విరుచుకుప‌డిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14: కృష్ణా జలాల్లో జలదోపిడి జరిగినట్లు, గోదావరి జలాలను బనక చర్ల ద్వారా ఏపీ దోపిడి చేస్తున్న‌ద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆరోపించారు. “బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడి- కాంగ్రెస్ మౌనం” అంశంపై శ‌నివారం ఆయ‌న‌ తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) ద్వారా వివ‌రించారు.  రోజుకు రెండు టీఎంసీల సామర్థ్యంలో మొత్తం 200 టీఎంసీలు త‌ర‌లింపున‌కు కుట్ర జ‌రుగుతోంద‌న్నారు.  రూ.80,112 కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ వేగంగా చ‌ర్య‌లు చేప‌డుతోంది.  ఇందులో భాగంగా 150 టీఎంసీల నీటి నిట్వ సామర్‌థ్యంతో బొల్లపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయం ప్రతిపాదన మ‌రియు కృష్ణా, పెన్న బేసిన్‌ ప్రాంతాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం నీటి సరఫరా చేయ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యం. అయితే గోదావ‌రి వ‌ర‌ద జ‌లాల‌నే వాడుకుంటున్నామ‌ని చంద్ర‌బాబు దబాయిస్తున్నార‌న్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో తానెన్న‌డూ  అడ్డుచెప్పలేదని ఆయ‌న చెబుతున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాలు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేద‌ని కూడా ఏపీ సీఎం చెబుతున్నారు. కానీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తెలంగాణ ప్రాజెక్టుల‌ను అడ్డుకుంటోంద‌ని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దుచేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్రానికి ఏపీ లేఖ రాసింద‌న్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కాళేశ్వరం కడుతున్నారంటూ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని చంద్రబాబు కుటిలయత్నాలు చేస్తున్నార‌న్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటిని అందించే భక్త రామదాసు ప్రాజెక్టును అడ్డుకునేందుకుందు 2017లో కేఈఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన సంగ‌తి గుర్తు చేశారు. కేవ‌లం గోదావ‌రిపైనే కాదు  కృష్ణా బేసిన్‌లో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు నాటి ఏపీ ప్రభుత్వం  అనేక లేఖలు రాసింద‌న్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, సుంకిశాల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ, కేఆర్‌ఎంపీ, సీడబ్ల్యుసికి అనేక లేఖలు ఏపీ స‌ర్కారు రాసింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను అడ్డుకోవాలని 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి చంద్రబాబు లేఖ రాశార‌న్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగు, తాగునీరు అందించే తుమ్మిళ్ల లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టును అడ్డుకోవాలని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు నాటి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింద‌న్నారు.

గోదావరి/కృష్ణా బోర్డుల అనుమతి లేదు. అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చ లేదు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండానే నేరుగా ప్రాజెక్టు పనులు పిలువడానికి ఏపీ సర్కారు సిద్ధమవుతున్నద‌న్నారు. నియంత్రించాల్సిన కేంద్రం నిధులు సమకూరుస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నద‌న్నారు.  ఐఎస్‌డబ్లూ్య ఆర్‌డీ యాక్ట్‌ 1956, సెక్షన్‌ 3 ప్రకారం గోదావరి ట్రిబ్యునల్‌ను వేయమని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఇది వరకే అర్జి పెట్టుకున్నది. గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో జలదోపిడీకి చంద్రబాబు కుట్ర (రిపరియేషన్‌ రైట్‌)కు దిగింద‌న్నారు. బనకచర్ల ప్రాజెక్టు పనులను ముందుగానే ప్రారంభించి, నిధులు ఖర్చు చేసి, 200 టీఎంసీల నీటిని కేటాయించాలని గోదావరి ట్రిబ్యునల్‌ ముందు వాదించే ప్లాన్ అమ‌లు చేస్తున్న‌ద‌న్నారు. గోదావరి బేసిన్‌లో ఉమ్మడి ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీల నీటి వాటాను ఇప్పటికీ  ఏపీ వ్యతిరేకిస్తున్నసంగ‌తి గుర్తు చేశారు.

కృష్ణా అవార్డ్‌లో ఉన్నట్టు గోదావరి అవార్డ్‌లో నిరక జిలాలు, వరద జలాలు అనే కాన్సెప్ట్‌ లేదు. గోదావరి అవార్డులో వాడిన పదం, ఆల్‌ వాటర్స్‌ అవి ఏవైనా కావచ్చు. కాబట్టి పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించే నీటికి బదులుగా కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా పొందే హక్కు ఉన్నద‌న్నారు. గోదావరి అవార్డు ప్రకారం.. 80 టీఎంసీలకు మించి గోదావరి జలాలను కృష్ణాబేసిన్‌కు తరలించినట్టయితే, అందుకు గాను 45ః21ః14 నిష్పత్తిలో కృష్ణా జలాల్లో వాటాను ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్టాలకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనం 112.5 టీఎంసీల వాటా ఇవ్వాలి. పోలవరం ద్వారా తరలించే గోదావరి నీటికి బదులు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో గోదావరి అవార్డు ప్రకారం  రావాల్సిన వాటా 45+112.5=157.5 టీఎంసీలని వివ‌రించారు. అస‌లు డిమాండ్ చేయాల్సిన దీన్ని విస్మ‌రించి రాష్ట్ర ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి మౌనం వ‌హించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు.

200 టీఎంసీల నీళ్లను దోచుకోవడమేకాక భవిష్యత్తులో దానిని 400 టీఎంసీలకు పెంచుకుంటామని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఏపీ స‌ర్కారు స్పష్టంచేసింద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం రెండూ కలిసి తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతలుడిగి చూస్తున్నద‌ని ఆరోపించారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులను చేపట్టే ముందు ఆ నది బేసిన్‌లో ఉండే రాష్ట్రాల అనుమతి కోసం కన్సల్టెన్సీ మీటింగ్‌ను కేంద్ర జలవనరులశాఖ నిర్వహించారు. జూన్‌ 12న హైదరాబాద్‌లో జలసౌధలో జరగాల్సిన గోదావరి-కావేరి కన్సల్టెన్సీ మీటింగ్‌ను రద్దుచేసి అదే రోజు గోదావరి-బనకచర్ల-కావేరి లింక్‌ ప్రాజెక్టు టాస్క్‌ఫోర్స్‌ మీటింగ్‌ ఢిల్లీలో నిర్వహించారు. గోదావరి-కావేరి కన్సల్టెన్సీ మీటింగ్‌ను రద్దుచేసి, హడావుడిగా టాస్క్‌పోర్స్‌ మీటింగ్‌ నిర్వహించి గోదావరి బనకచర్ల లింక్‌ కోసమేనా? అని ప్ర‌శ్నించారు.   గతంలో బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం వ్యతిరేకిస్తే గోదావరి-కావేరి లింక్‌ను సమ్మక్కసాగర్‌ వద్ద నిర్మాణాన్ని నిలిపివేసిన కేంద్ర.. గోదావరి-బనకచర్ల లింక్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా సూత్రప్రాయంగా అంగీకరించడమంటే తెలంగాణకు తీరని అన్యాయం చేయడమే న‌న్నారు. సమ్మక్క సాగర్‌ నుంచి గోదావరి-కావేరీ అనుసంధానం చేపడితే తెలంగాణ భూభాగానికి 75 టీఎంసీ వాటా దక్కుతుంది. కానీ ఈ ఈ కుట్ర వల్ల తెలంగాణ 75 టీఎంసీల నీటిని నష్టపోతుంద‌న్నారు.

బనకచ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతున్నదని బీఆర్‌ఎస్‌ పార్టీ నిలదీసిన తరువాత కానీ మంత్రి ఉత్తమ్‌ మేల్కొనలేదు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 22 తేదీ పేరుతో  కేంద్రానికి లేఖరాసి, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం నివేదికలు సమర్పించిందా? అని లేఖలో అడిగారు. నాలుగు నెలల తరువాత మే 28న స్వయంగా జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నివేదికలను ఇవ్వలేదన్నారు. కానీ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్‌ సౌత్‌ డైరెక్టర్‌ రాసిన లేఖలో ఏపీ ప్రభుత్వం మే 23వ తేదీన ప్రీఫిజబులిటీ రిపోర్టును సమర్పించిందని స్పష్టం చేశారు. కేంద్రం ఇంతగా అబద్దాలాడినా, పక్క రాష్ట్రం దోపిడీ చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం మాట కూడా మాట్లాడదు. ఏపీ కుట్రలను నిలువరించదని మండిపడ్డారు.

కృష్ణా జలాల దోపిడీకి ఏపీ పాల్పడుతున్నా కాంగ్రెస్‌ స్పందించడం లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ‘‘ తాత్కాలిక ఒప్పందం 66ః34 ప్రకారం 2024-25 నీటిసంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వాటా వినియోగంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంద‌న్నారు. ఏపీ 72.2శాతం (715.03టీఎంసీలు) వాడుకోగా, తెలంగాణ వాడుకున్నది కేవలం 27.8శాతం. ఇది తెలంగాణ ఏర్పాటు తరువాత అత్యల్ప వినియోగమ‌ని గుర్తుచేశారు. ఇందుకు పూర్తిగా కాంగ్రెస్‌ నిర్లక్ష్యం కారణమ‌ని ఆరోపించారు. ఆరున్నర లక్షల ఎకరాల్లో సాగుకు సరిపోయే 65టీఎంసీలను తెలంగాణ కోల్పోయింది. 2014 నుంచి 2023వరకు తాత్కాలిక వాటా ప్రకారం 34శాతం వాటాను దాదాపుగా బీఆర్‌ఎస్‌ వినియోగించిందని గుర్తుచేశారు.  66:34 తాత్కాలిక వాటాకు మేము ఒప్పుకున్నామని నిందలు మోపే కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పుడు అదే తాత్కాలిక వాటాను కొనసాగించి కనీసం దాన్ని కూడా వినియోగించుకోలేక చేతగానితనం చూపుతున్నార‌ని ఆరోపించారు.

ఇప్పటికే పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటరీ కెపాసిటీని 90వేల క్యూసెక్కులకు పెంచుకున్న ఏపీ దాని కింద నిర్మించిన శ్రీశైలం రైట్‌మెయిన్‌ కెనాల్‌ (ఎస్‌ఆర్‌ఎంసీ) ద్వారా పూర్తిస్థాయిలో నీటిని తరలించే కుట్ర వేగవంతం చేసింది. ఇప్పటివరకు లైనింగ్‌ లేని ఈ కెనాల్‌ ద్వారా కేవలం 44వేల క్యూసెక్కులే తరలించే వీలుండగా, సీసీ లైనింగ్‌ పనులు పూర్తి చేయడం ద్వారా రోజూ 90వేల క్యూసెక్కులు (8టీఎంసీలు) తరలించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ఏపీ పనులను నిలువరించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం చోద్యం చూస్తున్నద‌న్నారు. ఎస్‌ఆర్‌ఎంసీ లైనింగ్‌ పనులను నాటి కేసీఆర్‌ ప్రభుత్వం నిలువరిస్తే నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ఆ పనులకు సహకరిస్తున్నదని’’  నిప్పులు చెరిగారు.

ఏపీ జలదోపిడీకి కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్నివిధాలుగా సహకరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాజెక్టులకు మూట సాయం కాదుకదా. కనీసం మాట సాయం కూడా లేదని, కానీ నిధులు, నదులు అన్నీ ఆంధ్రాకే అన్నచందంగా వ్యవహరిస్తున్నదని నిప్పులు చెరిగారు. బనకచర్లను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్‌ లేఖ రాసినా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇప్పటికీ స్పందించలేదని వివరించారు. అంతేకాదు తెలంగాణ కన్నా పదింతలు నిధులు ఏపీకి ఇచ్చామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ‘‘ పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే నియంత్రించాల్సిన కేంద్రం నిధులిస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50శాతం నిధులు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మించి 50శాతం రుణ సమీకరణకు అనుమతిస్తామని ఏపీకి హామీ ఇచ్చింది. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి ఉండీ ఏం లాభం? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పీఎఫ్‌సీ నుంచి తెలంగాణ ప్రభుత్వం రుణం తీసుకుంటే ఎఫ్‌ఆర్‌బీఎం కింద రికవరీ పెట్టారు. కానీ బనకచర్ల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా 50శాతం నిధులిస్తూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రుణ సమీకరణకు ఏపీకి సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది. ఏపీపై వరాల జల్లులు కురిపిస్తూ, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదని’’  మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు.

రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన రేవంత్‌రెడ్డినే చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ‘‘ బాబు, రేవంత్‌, బీజేపీ మధ్యలో లోపాయికారీ ఒప్పందం మరోసారి బయటపడింది. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమా? చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్న ప్రభుత్వమా? గోదావరి, కృష్ణాల్లో ఏపీ ప్రభుత్వ జలదోపిడీ గురించి బీఆర్‌ఎస్‌ పార్టీ హెచ్చరించినా అడ్డుకునే ప్రయత్నం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నీతి అయోగ్‌ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ఇతర మంత్రులకు తెలంగాణ సాగు, తాగునీటికి అవసరాలు కనిపించడం లేదా? కాంగ్రెస్‌ ప్రభుత్వం చంద్రబాబు దూకుడును ఎందుకు అడ్డుకోలేకపోతున్నది? ఎందుకు చోద్యం చూస్తున్నది? ’’ అని హరీశ్‌రావు నిలదీశారు.

రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రధానితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలి.ఏపీ జలదోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.ఏపీ అక్రమ నీళ్ల తరలింపుపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయాల‌ని బీఆర్ ఎస్ డిమాండ్ చేస్తున్న‌ద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *