ప్రైవేట్‌ ‌కళాశాలల్లో టార్చర్‌ ఈనాటిదా?

‘‘‌ప్రైవేటు కళాశాలలను పెంచి పోషిస్తున్నది  ప్రైవేటు యాజమాన్యాల కంటే తల్లిదండ్రులే ఎక్కువ అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించడం చాలా అవసరం. స్టడీ అవర్స్ ‌బాగా ఉంటాయని, పట్టించుకుంటారని ,బయటకు వెళ్లే అవకాశం లేదని,  మెరుగైన ఫలితాలు ఉంటాయని, ర్యాంకులకు  చాలా తోడ్పడుతాయని  రకరకాల అభిప్రాయాలతో  చేస్తూ ప్రైవేటు కళాశాలలను  శ్లాఘిస్తూ వాటి  స్థాయిని  ఆకాశానికి చేర్చేది మనమే అని  మన నేరాన్ని ముందుగా అంగీకరిస్తే  కానీ ఇలాంటి  దురాగతాలు, ఆత్మహత్యలు  వేధింపులకు పరిష్కారం దొరకదు.’’

ర్యాంకుల కోసమే తల్లిదండ్రులు ఆశపడితే ఎలా?
ప్రైవేటు కళా శాలలు విద్యాసంస్థల్లో  వేధింపులు ఈనాటివి కావు. విద్య ఎప్పుడైతే ప్రైవేట్‌ ‌రంగంలోకి వెళ్లిపోయిందో  ఆనాటి నుండి  విద్య నిర్వచనం, రూపురేఖలు, స్వభావం మారి పోయిన విషయం  అందరికీ తెలిసిందే. విద్యా పరిరక్షణ కోసం అనేక సంస్థలు ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని ఉపాధ్యాయ ప్రజా సంఘాలు అనాదిగా డిమాండ్‌ ‌చేసినప్పటికీ  గత ప్రభు త్వాలతో పాటు ప్రస్తుత  తెలంగాణ ప్రభుత్వం కూడా  విద్యా సంస్కరణల పైన ఇసుమంత కూడా జోక్యం చేసుకోని కారణంగా  సాత్విక్‌ ‌లాంటి ఎందరో విద్యార్థులు  చేయని నేరానికి,  తల్లిదండ్రుల ఒత్తిడికి ,ప్రైవేటు సంస్థల వేధింపులకు  బలవుతున్నారు..  సహజమైన వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలు,  కళాశాలల్లో  అభ్యసించిన విద్య వ్యక్తి సర్వతోముఖ వికాసానికి ఎంతగానో తోడ్పడేది. ఎప్పుడైతే విద్య వ్యాపారీకరించబడి  ర్యాంకులు మార్కులు  ఉద్యోగాల కోసం  విద్యాసంస్థల ప్రచారాన్ని  జోరుగా నమ్మినటువంటి సమాజం తల్లిదండ్రులు  మెల్ల మెల్లగా ఆ  ఆశాస్త్రీయ  ఒత్తిడి విద్యా రంగానికి  మూల్యం చెల్లించుకోవడం ఆరంభమైనది.
ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదు
స్వాతంత్య్రం  అనంతరం విద్యారంగంపై నియామక మైనటువంటి సెకండరీ కమిషన్‌  ‌కొఠారి కమిషన్‌ ‌లతోపాటు  అనేక విచారణ సంస్థలు  సమగ్రమైన  నివేదిక ఇచ్చి  ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగించాలని,  కామన్‌ ‌స్కూలు విద్యా విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని,  అసమానతలు అంతరాలు వివక్షత, కులమత బేధాలలకు  తావు  లేనటువంటి  సమానత్వ భావన సాధించడానికి కామన్‌ ‌స్కూల్‌ ‌పరిష్కారమని  ముఖ్యంగా కొఠారి చేసిన సూచన  బుట్ట దాఖలైన విషయం మనకు తెలుసు.  1990 తర్వాత దేశంలో  సరళీకరణ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ  పెచ్చుమీరిన    తర్వాత విద్యారంగం  ప్రైవేట్‌ ‌చేతుల్లోకి వెళ్లిపోవడంతో  బాధ్యత విస్మరించినటువంటి  ప్రభుత్వాలు  విద్యారంగం పైన అంతగా పట్టించుకోక ప్రైవేట్‌ ‌సంస్థలను పెంచి పోషించడంతో ఈ దుస్థితి ఏర్పడింది అనే విషయాన్ని సమాజం గుర్తించకపోతే  ఈ వేధింపులకు , అకాల మరణాలకు,  మానవ వనరుల విధ్వంసానికి పరిష్కారాలను కనుగొనలేము .
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా  ప్రభుత్వ రంగంలోనే కేజీ టు పీజీ  అమలు చేస్తామని ఇచ్చిన హామీ  ప్రభుత్వం నెరవేర్చలేదు పైగా కామన్‌ ‌స్కూల్‌ ‌విధానం వైపు  ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.  అంతేకాదు సుమారు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో సగం సగం మంది విద్యార్థులు ఇవాళ విద్యను అభ్యసిస్తున్నారంటే  ప్రభుత్వ రంగం ఎంత బలహీన పడిందో అర్థం చేసుకోవచ్చు.  అంతేకాకుండా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌పరిపాలనకు భిన్నంగా  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత  ఒక్క అడుగు ప్రభుత్వం ముందుకు వేసి ప్రైవేటు రంగంలో 5 విశ్వవిద్యాలయాలను ప్రారంభించి  అట్టడుగు పేద వర్గాల అవకాశాలను  కాల రాసిన విషయం తెలుసు . ఇటీవల మరొక 5 విశ్వవిద్యాలయాలను కూడా ప్రైవేట్‌ ‌రంగంలో  ప్రారంభించడానికి  అనుమతి కోరుతూ గవర్నర్‌ ‌దగ్గర  పెండింగ్లో ఉన్న విషయం కూడా తెలిసినదే.
 ఇలాంటి అంశాల పైన బుద్ధి జీవులు, మేధావులు, విద్యావేత్తలు,  తల్లిదండ్రులు, సమాజం ప్రశ్నించకుండా  ప్రభుత్వం ఎటువైపు వెళితే అదే విధానాన్ని సమర్థిస్తూ  పోతే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి.  కొద్దిమంది సంఘసంస్కర్తలు, విద్యావంతులు , విద్యా రంగంలో మార్పును కోరే సంస్థలు కృషి చేసినంతమాత్రాన ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవడం సాధ్యం కావడం లేదు . ఇక పాఠశాల విద్య  ప్రైవేట్‌ ‌రంగం చేతుల్లోకి వెళ్లిపోయిన కారణంగా  ఫీజుల  భారాన్ని మోయలేక అనేకమంది విద్యకు దూరం కావడం, అప్పుల పాలు కావడం జరుగుతున్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు కూడా గుర్తించలేదు.  ఇలాంటి గడ్డు పరిస్థితులను ఇలాగే వదిలిపెడితే  సాత్విక్‌ ‌లాంటి  ఘటనలు పునరావృతమైనా ఆశ్చర్యపోనక్కరలేదు.
టార్చర్‌ ‌ను తట్టుకోలేని సాత్విక్‌ – ఆత్మహత్యలోని  ఆంతర్యం
హైదరాబాద్‌ ‌పరిసరాలలోని  నార్సింగి   శ్రీ చైతన్య కాలేజ్‌  ‌లో ఇంటర్మీడియట్‌ ‌ఫస్టియర్‌ అభ్యసిస్తున్న సాత్విక్‌      ‌కళాశాల  ప్రిన్సిపాల్‌ ,  అడ్మిన్‌ ‌ప్రిన్సిపాల్‌,  ‌క్యాంపస్‌ ఇన్చార్జిల  వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు  తన లేఖలో  పేర్కొంటూ తనతో పాటు తన మిత్రులకు కూడా నరకం చూపిస్తున్నారని వారి పైన సీరియస్‌ ‌యాక్షన్‌ ‌తీసుకోవాలని   ఆత్మహత్య లేఖలో పేర్కొనడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ  ఈ పరిస్థితులకు దారి తీసిన కారణాలను నెమరు వేసుకోవడం చాలా అవసరం  .’’కాలేజీలో పెట్టే మెంటల్‌ ‌టార్చర్‌, ‌వాళ్ళు చూపే నరకాన్ని, వివక్షతను భరించలేకనే  నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. సారీ క్షమించండి నా కోసం బాధపడితే నా ఆత్మ శాంతించదు’’ అని  రాసిన లెటర్‌ ‌నలిగిపోయి ఉండడాన్ని బట్టి చాలాకాలం క్రితమే రాసి ఉండొచ్చు అని  పరిశీలకులు భావిస్తున్నారు.  ఇంకా తన మాటల్లోనే  ‘‘సరిగా చదవడం లేదంటూ తిడుతున్నారు మార్కులు రాకుంటే గేటు బయట వాచ్‌ ‌మెన్‌ ‌గా కూడా పనికిరావని  అవమానిస్తున్నారు.
కాలేజీలో పెట్టే మెంటల్‌ ‌టార్చర్‌ ‌ను నరకాన్ని భరించలేక వెళ్ళిపోతున్నాను’’ అంటూ  కాలేజీ అధ్యాపకులు,   హాస్టల్‌   ‌నిర్వాహకుల  వేధింపులకు మనస్థాపానికి గురైనటువంటి    సాత్విక్‌ ఆలోచనలు  ఇవాళ ప్రైవేట్‌ ‌విద్యా రంగంలో చదువుకుంటున్న  ఎందరినో   ప్రభావితం చేస్తాయి.  కొద్దో, గొప్పో  తేడాతో ప్రైవేట్‌ ‌రంగంలో  విద్య ర్యాంకులు, మార్కులు,  పోటీ తత్వంతో వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు సమాజం ఒకసారి అర్థం చేసుకుంటే  ప్రైవేటు విద్యారంగం పైన  బుద్ధి జీవులు మేధావులు విద్యావంతులతో  సమగ్రమైన విచారణ చేపడితే కానీ  వేధింపుల  అంతరార్థం తెలవదు.
పదవ తరగతి వరకు కూడా ప్రైవేటు పాఠశాలలపై తల్లిదండ్రులు విద్యార్థులు మోజు చూపుతున్న ఈ పరిస్థితులలో  10వ తరగతి పాస్‌ అయిన తర్వాత ఇంటర్మీడియట్‌ ‌కోసం హైదరాబాద్‌ ‌పరుగులు తీసి  శ్రీ చైతన్య ,నారాయణ వంటి కళాశాలల్లోకి ప్రాధాన్యత ఇవ్వడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ  తమ పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ ఒత్తిడి చేస్తున్న విషయాన్ని కూడా మనం అంగీకరించాలి.  ప్రైవేటు విద్యాసంస్థల్లో వేధింపులు, తప్పుడు విధానాలు ,హింస ఉంటే కచ్చితంగా వ్యతిరేకించాలి వారి పైన తగిన చర్యలు తీసుకోవాలి. ఆ కళాశాలలను  రద్దు చేయాల్సిందే. దానిపై  ఎవరికి వేరే అభిప్రాయం ఉండనక్కరలేదు.  కానీ ప్రైవేటు కళాశాలలను పెంచి పోషిస్తున్నది  ప్రైవేటు యాజమాన్యాల కంటే తల్లిదండ్రులే ఎక్కువ అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించడం చాలా అవసరం. స్టడీ అవర్స్ ‌బాగా ఉంటాయని, పట్టించుకుంటారని ,బయటకు వెళ్లే అవకాశం లేదని,  మెరుగైన ఫలితాలు ఉంటాయని, ర్యాంకులకు  చాలా తోడ్పడతాయని  రకరకాల అభిప్రాయాలతో  ప్రైవేటు కళాశాలలను  శ్లాఘిస్తూ    వాటి  స్థాయిని  ఆకాశానికి చేర్చేది మనమే అని  మన నేరాన్ని ముందుగా అంగీకరిస్తే  కానీ  ఇలాంటి  దురాగతాలు, ఆత్మహత్యలు  వేధింపులకు పరిష్కారం దొరకదు.
ఇటీవల శివరాత్రి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చినప్పుడు వేధింపులను తట్టుకోలేనని తల్లిదండ్రులతో చెప్పినట్లు తల్లి, తండ్రి  సర్ది  చెప్పి పంపినట్టు పత్రిక కథనం ద్వారా తెలుస్తున్నది.  చివరిసారిగా  తల్లిదండ్రులకి ఫోన్‌ ‌చేసి  కళాశాలలో వేధింపులు భరించలేకపోతున్నానని నాన్న చివరి చూపు అమ్మతో ఆఖరి మాటల కోసం తప్పించి    జ్వరం వచ్చిందని రమ్మని కోరగా   చివరిసారిగా మాట్లాడిన సాత్విక్‌   ‌తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాడని తల్లి కానీ తండ్రి కానీ ఊహించలేదు.  ఫిబ్రవరి 28, 2023 మంగళవారం రోజున రాత్రి పది గంటల ప్రాంతంలో  స్టడీ అవర్స్ ‌ముగిసిన తర్వాత  తరగతి గదిలోనికి వెళ్లి  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాత్విక్‌ ‌గురించి యాజమాన్యం  పట్టించుకోలేదని తోటి విద్యార్థులు ఒత్తిడి చేస్తే కానీ తాళం తీసి    చూసేసరికి కొన ఊపిరితో ఉన్నట్లు  తోటి విద్యార్థులు  చేసిన ఆరోపణ కళాశాల యాజమాన్యం  కఠిన వైఖరికి నిదర్శనం కాదా ?చనిపోయే  రోజు అరగంట ముందు తండ్రి మందులు తీసుకువచ్చి వెళ్లిపోయిన తర్వాతే  ఈ సంఘటన జరగడాన్ని  జీర్ణించుకోలేని తల్లిదండ్రులు  కళాశాల వేధింపుల పైన విచారణ జరిపించాలని ,గుర్తింపును రద్దు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ ‌చేయడం  నేటి ప్రైవేటు విద్యా వ్యవస్థ ద్వారా సమాజానికి జరుగుతున్నటువంటి ద్రోహానికి  మచ్చుతునకగా భావించవచ్చు.
సాత్విక్‌  ఆత్మహత్య  సమాజానికి ఇచ్చే సందేశం
సహజమైన పరిస్థితులకు భిన్నంగా యాంత్రిక జీవితానికి ఆలవాలమైన టువంటి ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్బంధం అణచివేత తో కూడిన విద్య  వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడం కాదు కదా  ఆందోళనకు గురి చేస్తున్నది అనే విషయాన్ని ఇప్పటికైనా మేధావులు, మానసికవేత్తలు, సమాజము గుర్తించవలసిన అవసరం చాలా ఉన్నది.  విద్యకు నిర్వచనాన్ని  ఆధునిక కాలానికి అనుగుణంగా  ప్రకటించుకోవడం ద్వారా  వ్యక్తిత్వ వికాసం, మానసిక చైతన్యం, సామాజిక చింతన,  ఉపాధి కల్పన,  భవిష్యత్తుకు భరోసా వంటి అంశాలను  విద్య ద్వారా సాధించడానికి అనుగుణంగా విద్యా వ్యవస్థ ఉండాలని  కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది.
అదే సందర్భంలో  సామాజిక బాధ్యతగా ప్రభుత్వము విద్యా అవకాశాలను కల్పించవలసినది పోయి తన బాధ్యత నుండి తప్పుకుంటూ ప్రైవేటు భుజస్కంధాల మీద పెట్టే వింత ధోరణికి  అడ్డుకట్ట వేయవలసిన అవసరం కూడా పునరాలోచన చేయాలి.  ప్రాథమికం నుండి ఉన్నత స్థాయి వరకు విద్యారంగాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలి  .తెలంగాణ రాష్ట్ర వికృత ధోరణికి ప్రతీక అయినటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాలను వెంటనే  నిలిపివేసి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను మరింత బలోపేతం చేయాలి.  ఇంటర్మీడియట్‌ ‌కళాశాల విద్య  విద్యార్థి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దశ కనుక  సహజ పరిస్థితులలో,  సామాజిక చింతన కలిగినటువంటి  ప్రత్యేక నిపుణుల సహకారంతో,  ప్రభుత్వ రంగంలోనే విద్యా బోధన కొనసాగే నూతన వ్యవస్థకు  అంకురార్పణ జరగాలి .
అప్పుడు మాత్రమే సాత్విక్‌ ‌లాంటి  బావి భారత పౌరులు  సమాజానికి దూరం కాకుండా  బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి కుటుంబాలను సమాజాన్ని దేశాన్ని  పట్టించుకునే రీతిగా  తయారవుతారు.  విద్యార్థులు ,సమాజం, తల్లిదండ్రులు, అంతకుమించి ప్రభుత్వం కూడా  ప్రైవేటు విద్యారంగము  వేధింపుల పైన  ఉక్కు పాదం మోపడంతో పాటు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని  స్వేచ్ఛ రీతిలో  విద్యను అందించడానికి పూనుకుంటేనే  ఇలాంటి ఆటంకాలకు అడ్డుకట్ట వేయొచ్చు.  అప్పుడు మాత్రమే సాత్విక్‌ ‌లాంటి అనేకమంది  ప్రైవేటు వేధింపులకు బలైన విద్యార్థుల ఆత్మకు శాంతి కలిగించిన వారవుతాం ..
image.png
యంఏ.ఖాదర్‌ ‌పాష..
తెలంగాణ జన సమితి పార్టీ
వనపర్తి జిల్లా అధ్యక్షులు, 8341361716…,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *