Take a fresh look at your lifestyle.

‌మోదీ పేదల దేవుడన్నా…!!

‘‘మోదీ పేదలపాలిటి దేవుడన్నా…’’, పేదలు ఇబ్బంది పడొద్దని బియ్యం ఇస్తున్నడన్నా…’’,  ‘‘అలాంటోన్ని ఎందుకు తిట్టాలన్నా..’’…. అన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  ‌మాటలను గుర్తుచేస్తున్నాయి దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు.  ప్రధాని మోదీ నిజంగానే పేదలను ఆదుకునే దేవుడే అయితే పేదలపై ధరల భారాన్ని ఎందుకు మోపుతున్నాడని వారు ప్రశ్నిస్తున్నారు. మోదీ అధికారంలోకి వొచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు మొదలు దాదాపు అన్ని వస్తువుల ధరలు ఒకటికి మూడు రెట్లు పెరుగుతూనే పోతున్నాయి. నిరుపేద, మధ్యతరగతి వారిపైన  మోయలేని భారాన్ని ఎందుకు మోపుతున్నారో చెప్పాలంటున్నాయి ఆ పక్షాలు.  మోదీ అధికారంలోకి వొచ్చినప్పుడు సామాన్యుడి ఆదాయం రెండింతలు పెరిగేట్లు చూస్తామన్నాడు. కాని, ధరలను మాత్రమే రెండు నుంచి మూడింతలు పెంచి పేద ప్రజలపై మరింత భారాన్ని మోపాడు.

ఒక వైపు ధరలు పెంచుతూ, మరో వైపు రాయితీలకు మంగళం పాడడమన్నది ఆయనకే చెల్లింది. తాజాగా మరోసారి వంట గ్యాస్‌ ‌ధరను పెంచడం ద్వారా తమ ప్రభుత్వం కేవలం కార్పొరేట్‌ ‌లకే  కొమ్ముకాస్తుందేగాని, సామాన్య ప్రజలగురించి పట్టించుకోదన్న విషయాన్ని ఆయన మరోసారి రుజువుచేశాడని ఆ పార్టీలు తీవ్రంగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. ఇది ఏదో ఒక్క ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించింది  కాదు. యావత్‌ ‌దేశ ప్రజలపై భాజప సర్కార్‌ ‌మోపుతున్న పెను భారం. 2011లో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద కేజ్రీవాల్‌ ‌గ్యాస్‌ ‌సిలెండర్‌ ‌ధరను యాభై రూపాయలు పెంచితే, తమది ఆమ్‌ ఆద్మీ పార్టీ అని చెప్పడం సిగ్గుచేటని ఆనాటి ప్రతిపక్ష నేత స్మృతీ ఇరానీ పెట్టిన పోస్టును ఇవ్వాళ నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఎనిమిదేళ్ళలో ఇప్పటికి పదమూడు సార్లు వంటగ్యాస్‌ ‌ధరలను పెంచిన విషయాన్ని కూడా వారు గుర్తుచేస్తున్నారు.

మోదీ అధికారంలోకి వొచ్చే నాటికి గ్యాస్‌ ‌సిలెండర్‌ ‌ధర 410 రూపాయలుగా ఉంటే, ఇప్పుడు 1155 రూపాయలకు చేరుకుంది. అంటే ఈ ఎనిమిది ఏండ్లలో ఎనిమిది వందల రూపాయల వరకు గ్యాస్‌ ‌ధర పెంచడంద్వారా మోదీ పేదల దేవుడు ఎలా అయినాడో చెప్పాలంటున్నారు. విచిత్రమేమంటే మోదీ అధికారంలోకి రాకముందు 2014లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ క్రూడాయిల్‌ ‌ధర బ్యారెల్‌కు 114 డాలర్లు ఉన్నప్పుడు ఆ నాటి సర్కార్‌  ‌వంటగ్యాస్‌ను 410 రూపాయలకు అందించినప్పుడే నాటి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఆనాడు పెట్రోల్‌ ‌లీటర్‌ 70 ‌రూపాయలు కాగా, డిజిల్‌ ‌ధర 50 రూపాయలుగా ఉండింది.  కాని నేడు బ్యారల్‌ ‌క్రూడాయిల్‌ ‌ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 90 డాలర్లు మాత్రమే. అయినా నేటి బిజెపి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా 50 రూపాయలను పెంచి, 14.2 కెజీల సిలండర్‌ ‌ధరను 1155 రూపాయలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నులను బట్టి ఒక్కో రాష్ట్రంలో సిలండర్‌ ‌ధరల్లో స్వల్ప మార్పులుండడం వేరే విషయం.

అదే కమర్షిల్‌ ‌సిలిండర్‌పైన ఏకంగా 350 రూపాయలను పెంచడం మరింత దారుణం.. అంటే పెద్ద పెద్ద హోటళ్ళు, రెస్టారెంట్ల పరిస్థితి ఎలా ఉన్నా, నిత్యం రెక్కాడితేగాని డొక్కాడని మిర్చి బజ్జీల విక్రయదారులు, బజార్లో చిన్న చిన్న దుకాణదారులు  టి, కాఫీ విక్రయదారుల నడ్డి విరిచేస్తున్నది ఈ పెరిగిన ధర. ఉద్యోగంలేక పోయినా మిర్చీలు అమ్ముకుని బతుకవొచ్చని గతంలో మోదీ చేసిన సూచనకు కూడా ఇప్పుడు పెరిగిన సిలండర్‌ ‌ధర గొడ్డలిపెట్టే. పరోక్షంగా వాటి వినియోగదారుల పైన కూడా ఈ ధర భారం పడకపోదు. మోదీ చెబుతున్న సబ్‌ ‌కా సాత్‌.. ‌సబ్‌ ‌కా వికాస్‌ అనే నినాదాన్నిప్పుడు  సబ్‌ ‌కా వినాశ్‌ అనాల్సి ఉంటుందంటున్నాయి ప్రతిపక్షాలు. పెరిగిన గ్యాస్‌, ‌పెట్రోల్‌, ‌డిజిల్‌ ‌ధరలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బిజెపి యేతర రాజకీయ పార్టీలన్నీ పార్లమెంట్‌లో, బయట పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూనేఉన్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా  ఆందోళన  కార్యక్రమాలను కొనసాగుతూనేన్నాయి. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  ఇచ్చిన పిలుపు మేరకు బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

నియోజకవర్గ కేంద్రాల్లో, మండల స్థాయిలో మంత్రులు, ఎంఎల్‌ఏలు, వివిధ హోదాల్లోని పార్టీ నాయకులంతా సిలెండర్లను నెత్తిన పెట్టుకుని, కట్టెల మోపు మోస్తూ, కట్టెల పొయ్యి మీద వంటా వార్పు చేస్తూ తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆదానివల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవటం ఒకటికాగా, తాను అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకునే క్రమంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇది ఒక భాగమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నాయన్నప్పుడు ధరలను స్థిరంగా ఉంచుతూ, ఎన్నికలు పూర్తికాగానే వెంటనే ధరలను పెంచే ఆనవాయితీ బిజెపి ప్రభుత్వానికున్నదని బిఆర్‌ఎస్‌ ‌దుయ్యబడుతోంది. తాజాగా ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రమే మోదీ గ్యాస్‌ ‌ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు రైతాంగం ఎలా ఉద్యమించిందో, ఈ ఎనిమిదేళ్ళ కాలంలో ఎనిమిది వందల రూపాయలకు పెంచిన గ్యాస్‌ ‌ధరలను వెనక్కు తీసుకునేవరకు ఆందోళనను  కొనసాగిస్తూనే ఉంటామంటున్నాయి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు.

Leave a Reply