“భారతదేశానికి ఎంతటి చరిత్ర ఉన్నా, మేథావులున్నా భారతదేశం లో సరైన గుర్తింపు లభించడం లేదనే సాకుతో ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లి పోవడం, (బ్రెయిన్ డ్రయిన్) వలన భారతదేశం అనేకరంగాల్లో చాలాకాలం వరకు అభివృద్ధి కి నోచుకోలేదు.స్వదేశీ పరిజ్ఞానం విదేశీయుల స్వప్నసౌధాలకు ఆలంబనగా మారింది”
ఎలాంటి ఆర్ధిక ఎదుగుదల లేకుండా ఈసురోమని బతుకీడ్చడం వాంఛనీయం కాదు.ఆకాశాన్నంటే భవనాలు అభివృద్ధికి ప్రామాణికం కాదు. బిలియనీర్ల సంఖ్య పెరగడం అభివృద్దికి సూచిక కాదు. అందరికీ సమానమైన అవకాశాలు రావాలి. చదువుకున్న యువతకు విలువ పెరగాలి. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కారాదు. నాణ్యమైన విద్య,విద్యకు తగ్గ ఉపాధి,మెరుగైన మౌలిక సౌకర్యాలు,కల్తీలేని ఆహారపదార్ధాలు, పరిశుభ్రమైన తాగునీరు, వసతి సదుపాయం, అందరికీ ఆరోగ్య సదుపాయం వంటి కనీస అవసరాలు కల్పించాలి. ఇవే ప్రజల ఉన్నత జీవన ప్రమాణాల స్థాయికి సూచికలు. ఇదే నిజమైన అభివృద్ధి. ఇలాంటి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చేయాలి.
గత కాలపు వైభవాన్ని నెమరువేసుకుంటూ, వర్తమానంలోని కష్టాలను కన్నీళ్ల కు అంకితం చేసి, బతుకీడ్చడం విజ్ఞత అనిపించుకోదు. గత వైభవాన్ని స్ఫూర్తిగా తీసుకుని వర్తమానాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన ఆశావహ దృక్ఫథం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, అన్ని రంగాల్లోను విప్లవాత్మక మార్పులు తెచ్చి, అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రపంచమంతా కుగ్రామం గా మారిన నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మనం కూడా పరుగులు తీయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.మన దేశంలో యువశక్తికి కొదవలేదు.మనదేశం మేథాసంపత్తికి పెట్టింది పేరు. ప్రపంచానికి విజ్ఞానమంటే తెలియని రోజుల్లోనే మన భారతీయ మేథావులు అప్పటికి అందుబాటులో ఉన్న పరిమితమైన అవకాశాలను వినియోగించుకుని, ఎన్నో వినూత్న మైన ఆవిష్కరణలకు అంకురార్పణ చేసారు. ఇప్పటి ఆధునిక ప్రపంచం వల్లె వేస్తున్న అనేకమైన విషయాలపట్ల అప్పట్లోనే అలనాటి మన మేథావులతో పాటు,సామాన్య ప్రజానీకానికి కూడా స్పష్టమైన అవగాహన ఉంది.
దురదృష్టవశాత్తూ భారతీయ మేథాసంపత్తి ని ఇతర దేశాలు కొల్లగొట్టాయి.భారతదేశం నాగరికతకే ఓనమాలు నేర్పిన దేశం.ఎలాంటి వైద్య సదుపాయాలు లేని రోజుల్లో కూడా ఏ వ్యాధికి ఏ ఔషధం వాడితే ప్రయోజనమో మన పూర్వీకులు ఆచరించి,ఫలితాన్ని సాధించారు. ఈ రోజుల్లో అయితే మనం ప్రతీ చిన్న విషయానికీ వైద్యుల వద్దకు పరుగెడుతున్నాము.మన పూర్వీకుల్లోదాగిఉన్న అపారమైన మేథాశక్తి,అనుభవం ముందు నేటి సాంకేతిక పరిజ్ఞానం కూడా తీసికట్టేమో అనిపిస్తుంది.గణిత,ఖగోళ,అర్ధ శాస్త్ర,వైద్యశాస్త్ర రంగాల్లో ప్రాచీన కాలంలోనే భారతదేశం విశిష్ఠ స్థానం సంపాదించింది. చరకుడు,సుశృతుడు, ధన్వంతరి,ఆర్యభట,వరాహమిహురుడు, భాస్కరుడు…ఇలా ఒకరేమిటి అనేక మంది భారతీయ మేథావులు వివిధ రంగాల్లో విశేషకృషి సల్ఫి ప్రాచీనకాలంలోనే భారతదేశం అంటే ఒక విజ్ఞాన భాండాగారం గా తీర్చిదిద్దారు. ముద్రణా యంత్రాలు లేని రోజుల్లో కూడా మన ప్రాచీన మేథావుల మేథాసంపత్తి సాధారణ ప్రజలకు కూడా చేరువలోకి వచ్చింది. ఇప్పటికీ చాలా మంది అలనాటి మేథావుల ఆలోచనలను ప్రయోగాత్మకంగా పాటించడం ఆశ్చర్యం కలిగించకమానదు.
భారత దేశం అనాదిగా విదేశీయుల దౌర్జన్యాలతోను,దండయాత్రలతోను ఆపారమైన ధనరాశులను, భూభాగాలను, చారిత్రక వారసత్వసంపదను కోల్పోవడం తో పాటు అమూల్య మైన విజ్ఞాన సంపదను కూడా కోల్పోయింది. భారతదేశం నుండి కొల్లగొట్టబడిన మేథాసంపత్తిని వివిధ రూపాల్లో మార్చుకుని మేథో సంపత్తి హక్కులు( ఇంటిలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్) పేరిట పేటెంట్ హక్కులను హస్తగతం చేసుకుని తామే ప్రపంచానికి మార్గనిర్ధేశకులమన్నట్టు అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆర్ధిక సామ్రాజ్యాలను నిర్మించుకున్నాయి. భారతదేశానికి ఎంతటి చరిత్ర ఉన్నా, మేథావులున్నా భారతదేశం లో సరైన గుర్తింపు లభించడం లేదనే సాకుతో ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లి పోవడం, (బ్రెయిన్ డ్రయిన్) వలన భారతదేశం అనేకరంగాల్లో చాలాకాలం వరకు అభివృద్ధి కి నోచుకోలేదు.స్వదేశీ పరిజ్ఞానం విదేశీయుల స్వప్నసౌధాలకు ఆలంబనగా మారింది.అయితే రానురాను భారతదేశంలోని మేథావుల దృక్పథం లో గణనీయమైన మార్పువచ్చింది. ‘‘ఏదేశమేగినా,ఎందుకాలిడినా…’’అన్నట్టుగా దేశీయ మూలాలను మరవరాదన్న సత్యం మన మేథావులకు,యువతకు తెలిసి వచ్చింది. అందువలనే వారంతా ఎక్కడ ఉన్నప్పటికీ భారతదేశం అన్ని రంగాల్లో బలపడడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. విదేశాలకంటే స్వదేశమే మిన్న అన్న భావన భారతీయ యువతలో కలిగింది.
సాంకేతిక రంగంలో భారతదేశం కొత్తపుంతలు తొక్కింది.ఉపగ్రహాల ప్రయోగాల నుండి,చంద్రయాన్ పయనం వరకు, వైద్య శాస్త్ర పరిశోధనల నుండి అణ్వస్త్ర ప్రయోగాల వరకు భారతదేశం స్వయం స్వావలంభన దిశగా పయనిస్తున్నది. పెరిగిన జనాభాకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టసాధ్యం గా మారిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం మరింతగా పాటు బడాలి. ప్రభుత్వ పథకాల మీద ప్రజలు ఆధారపడి రోజులు పోవాలి. ప్రజలందరికీ బ్రతుకు దెరువు కు మార్గం చూపాలి. చుక్కల నంటిన ధరలు ప్రజలకు నిత్య నరకాన్ని చూపిస్తున్నాయి. ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి. ధరలు పెరగడం వలన కల్తీ కూడా పెరుగుతున్నది. కల్తీ వలన ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్స్ పాలవడం, వైద్య ఖర్చులను భరించలేక ఉన్నదంతా అమ్ముకోవడమో, అదీ సాధ్యం కాక పోతే ఆత్మహత్యలకు పాల్పడడమో జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితులు పోవాలి. అట్టడుగు స్థాయి నుంచి అవినీతిని అరికట్టాలి. అవినీతి అంతమైతే ప్రజా జీవనం మెరుగు పడుతుంది. ఎన్నికల్లో విచ్చల విడిగా డబ్బు పంచడం వలన తిరిగి ఆ భారం కూడా వివిధ రూపాల్లో ప్రజలే మోయవలసి వస్తున్నది. ఎన్నికల ఖర్చు తగ్గితే అవినీతి తగ్గుతుంది. అవినీతి తగ్గితే ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగు పడతాయి.





