దేశానికే ఆదర్శం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్
ప్రయివేటుకు దీటుగా సర్కారు వైద్యం
నార్మల్ డెలివరీలను ప్రోత్సహిద్దాం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర: పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేసిన ఒకే ఒక్క నాయకుడు సిఎం కేసీఆర్ అని, దేశానికే ఆదర్శంగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పేదింటి తల్లికి ధైర్యం వొచ్చిందని మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 216 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని సామెత ఉండేదని ఈ రెండు చాలా కష్టమని, కానీ, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ సర్కారుతో పేదింటికి భరోసా వొచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రయివేటు కంటే ధీటుగా సర్కార్ హాస్పిటల్లో సదుపాయాలు ఉన్నాయని, అన్నీ రకాల పరీక్షలు, వైద్యులు ఉన్నాయని, పేదల కోసం మెరుగ్గా వైద్యం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతీ గర్భిణీకి నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నాలు చేద్దామని, దీనిపై ఆలోచన చేయండని పిలుపునిచ్చారు. ఆపరేషన్ వల్ల గర్భిణీ మహిళకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అలాగే మొదటి గంట తల్లిపాలు ఎంతో ముఖ్యమని, ముర్రుపాలు చాలా ప్రయోజనమని వాటి ఆవశ్యకతను వివరించారు.
పేద ప్రజలు ప్రయివేటుకు పోవద్దని సూచనలు చేస్తూ.. ప్రభుత్వ హాస్పిటల్లో అనుభవం ఉన్న వైద్యులు ఎక్కువ ఉన్నారని సర్కారు దవాఖానలో వైద్యం పొందాలని మంత్రి కోరారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని 111 కుటుంబాలకు 30 లక్షల 31 వేల రూపాయలు కలిగిన సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. వీరిలో పట్టణంలోని 40 మందికి 11లక్షల 37 వేల రూపాయలు, సిద్ధిపేట రూరల్ మండలంలోని 10 మందికి 30లక్షల 4 వేల రూపాయలు, సిద్ధిపేట అర్బన్ మండలంలోని ఏడుగురికి 18లక్షల 5550 వేల రూపాయలు, చిన్నకోడూర్ మండలంలోని 26 మందికి 65లక్షల 5 వేల 500రూపాయలు, నంగునూరు మండలంలోని 15 మందికి 40 లక్షల రూపాయలు, నారాయణరావుపేట మండలంలోని 13 మందికి 3 లక్షల 49 వేల రూపాయల చొప్పున మొత్తం 30లక్షల 31 వేల 500 రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. పోచబోయిన పదవీకాలం మరో ఏడాది పొడిగింపు…
ఉత్తర్వు పత్రాన్ని అందజేసిన మంత్రి హరీష్రావు ఉమ్మడి మెదక్ జిల్లా గొఱ్ఱెల పెంపకందారుల సహకార యూనియన్ ఛైర్మన్గా సిద్ధిపేట నియోజకవర్గంలోని కస్తూరిపల్లికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పోచబోయిన శ్రీహరియాదవ్ పోస్టులో మరో సంవత్సరం కొనసాగేలా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు కాపీని శుక్రవారం సిద్ధిపేటలోని మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శ్రీహరియాదవ్కు అందజేశారు. గొఱ్ఱెల కాపరులకు చేస్తున్న సేవలను అభినందిస్తూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ…గొఱ్ఱెల కాపరుల సహకారంతో, మంత్రి హరీష్రావు ఆశీస్సులతో అంకితభావం చిత్తశుద్ధితో పనిచేస్తానని, మంత్రి పేరు, గౌరవం కాపాడే విధంగా పనిచేస్తూ, క్రమశిక్షణతో కూడిన పని విధానం ద్వారా, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాననీ, తనపై నమ్మకంతో బాధ్యతలప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.



