నాగర్కర్నూల్ , ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : అన్ని రంగాల్లో వెనుకబడిన పాలమూరు జిల్లాను ప్రగతి బాట పట్టించడమే తన ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకులను ఈ ప్రాంతం ఇచ్చిందని, బూర్గుల రామకృష్ణారావు, జైపాల్ రెడ్డి వటి వారు ఇక్కడి నుంచే వొచ్చారని తెలిపారు. నల్లమలలోని కొండారెడ్డి పల్లిలో పుట్టిన తనకు బూర్గుల రామకృష్ణారావు తర్వాత సీఎంగా అవకాశం వొచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ బిజినేపల్లి బహిరంగ సభలో సీఎం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు, పోటీ దారులు లేరని, జిల్లా వారంతా నా కుటుంబ సభ్యులేనని ఈ ప్రాంత అభివృద్ధే తన లక్ష్యమని అన్నారు. తెలంగాణ వొచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్ కు తీరని అన్యాయం జరిగిందని, కరీంనగర్ లో ఓడిపోతానని పారిపోయి పాలమూరుకు వొస్తే కేసీఆర్ ను ఇక్కడి ప్రజలు భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించారని తెలిపారు.
తెలంగాణను కాంగ్రెస్ ఇస్తే తానే సాధించానని కేసీఆర్ చెప్పుకున్నాడని విమర్శించారు. కృష్ణా నదికి వరదలు వొచ్చి అలంపూర్ కు మునిగిపోతే కేసీఆర్ తన ఇళ్లు అమ్మి పరిహారం ఇస్తానని చెప్పారని, కానీ అధికారంలోకి వొచ్చాక పట్టించుకోలేదని ఆరోపించారు. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్టు కట్టిస్తానన్న కేసీఆర్ ఆ విషయాన్ని మర్చిపోయారన్నారు. కొంతమంది జిల్లా నాయకులు దొంగలకు సద్దులు మోస్తున్నారని, తాను తిడుతున్నానని అరుణమ్మ చెబుతోందని, ఆమెకు తకు పోటీ, ఏందీ, పంచాయతీ, గట్టు తగదా ఏదీ లేదని అన్నారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరుకు అవకాశమిస్తే జెండాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం పనిచేయకుండా కాళ్లలో కట్టె పెట్టి పడేయాలనే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గద్వాలలో బీజేపీ అభ్యర్థికి ఏడు వేల వోట్లు వొచ్చి డిపాజిట్ కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గౌరవించామని, ప్రజా జీవితంలోకి వొచ్చినప్పుడు ఆనందపడ్డామని తెలిపారు.
గతంలో గడీలను కూలుస్తానని గతంలో ప్రవీణ్ కుమార్ అన్నారని, కానీ ఆరు నెలల్లో ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పంచన చేరాడని విమర్శించారు. కాంగ్రెస్ లోకి వొచ్చి కేసీఆర్ పైన పోరాటం చేసే అవకాశం ఉన్నా ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ ను భుజాన పెట్టుకొని తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. మాదిగల వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే అసెంబ్లీ నుంచి కేసీఆర్ మమ్మల్ని ఈడ్చి పడేశారని, ఎస్పీ వర్గీకరణకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యతిరేకమా..? అనుకూలమా..? చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎంపీ రాములుకు సన్ స్ట్రోక్.. బీజేపీ కి వెళ్లి టిక్కెట్ తెచ్చుకున్నాడు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎద్దు, బండి లేకుండా ఇద్దరు కలిసి జాతరకు పోతామని బయలుదేరారు.. నాలుగున్నర యేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. కలిసి కట్టుగా జిల్లాను బాగుచేసుకోవాలి. మాదిగలకు పదేళ్ల పాటు కేసీఆర్ ద్రోహం చేశాడు..అలాంటి వ్యక్తి పక్కన ఆర్ఎస్ ప్రవీణ్ ఎలా కూర్చుంటాడు అని ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదవిలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను డీజీపీని చేసేదని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ చేస్తే ఆయన తీసుకోలేదని, దొరల గడీ ల వద్ద కాపాలాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలబడ్డాడని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు వేసే వోటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కాదు కేసీఆర్ కు వెళ్తుందన్నారు. మీ వోటును కేసీఆర్ బీజేపీకి అమ్ముకుంటాడని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తనను తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి ని చేశారని, నాలుగు నెలల్లో ఐదు గ్యారంటీలు అమలు చేస్తుంటే ఆపడానికి యత్నాలు చేస్తున్నారని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలని 22 వేల ఐదు వందల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని సమైక్య పాలనలో పాలమూరు ప్రాజెక్టులు ముందుకు సాగలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి కి రెండు టీఎంసీలతో పూర్తి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. తుమ్మిల ప్రాజెక్ట్ ను పూర్తి చేసి అలంపూర్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని, ఎన్ని వేల కోట్లైనా ప్రాజెక్ట్ లు పూర్తి చేసి పాలమూరు ప్రజల గుండెల్లో నిలిచిపోతానని రేవంత్ రెడ్డి అన్నారు.
జిల్లాను ఆగం చేయోద్దు..: సీ ఎమ్ రేవంత్ రెడ్డి
ప్రజలు ఆలోచించి వోటు వేయాలని, వచ్చి అవకాశాన్ని జారవిడుచుకొని జిల్లాను ఆగం చేయొద్దని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ లో మల్లురవి ని గెలిపించాలన్నారు. వాల్మీకీ బోయల ఆవేదన తనకు తెలుసని, వారిని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆగస్ట్ 15 లోపు జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్న రెండు లక్షల రైతు రుణ మాఫీ చేసి తీరుతామని, సవాల్ విసిరిన హరీష్ రావు, ఆయన మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా..? సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యానని వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు. రైతుల రుణం తీర్చుకోకపోతే తన జీవితమే దండగ అని,వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని కేసీఆర్ చెప్పాడు. రాబోయే పంటకు 500 బోనస్ ఇచ్చి ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొంటుందని, ఐదు గ్యారెంటీలు, రుణమాఫీ పైన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని, మల్లు రవిని నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిపిస్తారన్న విశ్వాసం తనకు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.