నీలం మధుకు తెలంగాణ బిసి సంఘాల మద్దతు

ఎన్నికల ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించిన బీసీ నేతలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 :  తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బిసిలను రాజకీయ పార్టీలు మోసం చేశాయని, బిసిలను మోసం చేసిన కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలకు బుద్ధి చెప్పి రాజకీయ పార్టీలకు అతీతంగా బిసి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలని బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్‌ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ అభ్యర్థుల గెలుపు కోసం బీసీ సంఘాల ఎన్నికల ప్రచార పోస్టర్‌ బిసి నాయకులతో కలసి నీలం వెంకటేష్‌ ముదిరాజ్‌ ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ నిరంతరం బిసిల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తూ బిసిల అభివృద్ధి సంక్షేమం కోసం పరితపించే పటాన్‌ చెరువు ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ ను రాజకీయ పార్టీలకు అతీతంగా గెలిపించాలన్నారు. నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా పటాన్‌ చెరువు లో అగ్రకుల రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పి నీలం మధును గెలిపించాలన్నారు. అలాగే, తెలంగాణలో ఉన్న బిసి సంఘాలన్నీ నీలం మధు ముదిరాజ్‌ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పగిదాల సుధాకర్‌, బిసి మహిళ రాష్ట్ర కన్వీనర్‌ నాయకురాలు దీపిక, ప్రజా సమితి అధ్యక్షుడు రాజేందర్‌, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శివ కృష్ణ, నల్గొండ జిల్లా అధ్యక్షులు నీలం సైదయ్య, స్వామి, ఐటవోని మల్లిఖార్జున, బిసి రాష్ట్ర నాయకులు బలరాం, ఓయు జెఎసి మధు, మహేష్‌, స్వామి, నాగరాజు, కౌశిక్‌, నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *