•సమస్య రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంది ..టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్
జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్ 23 : రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని, ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీకేజిలతో వ్యాపారం చేస్తుందని టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్ అన్నారు. తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 10 ఏండ్ల టిఆర్‌ఎస్ పాలన నిరుద్యోగ సంక్షోభం అనే అంశంపై ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ…యువతకు ఉద్యోగం అనేది సామాజిక మార్పుకు చోదకశక్తి లాంటిదని, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని అన్నారు. ఉద్యోగ కల్పనను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, నేడు తెలంగాణలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, విద్యార్థులు తల్లిదండ్రుల కూలి, జీతాల మీద బ్రతుకు దెరువు ఉందని, తల్లిదండ్రులు డబ్బులు పంపకపోతే ఉద్యోగాలు రాక వారి బాధలు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
తెలంగాణ యువత ప్రధాన శక్తిగా ఎదగడములో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కేటిఆర్ విద్యార్థులకు కల్లిబొల్లి మాటలు చేప్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారు.తెలంగాణలో మరోసారి రాజకీయ దోపిడి చేసేందుకు జాబ్ క్యాలెండర్ ల పేరుతో ఉద్యోగ కల్పన చేస్తామని బిఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని అన్నారు. ఈ సారి యువత ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేసి కేసీఆర్ ను గద్దె దించాలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ కల్పనతో పాటు నిరుద్యోగ భృతి ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని తెలిపాడు. 10ఏళ్ల బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు పునరావృతం కావద్దు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధానకార్యదర్శి అరికెళ్ల స్రవంతి, జిల్లా అధ్యక్షులు ముక్కెర రాజు,కొత్తూరు రమేష్, అడ్వకేట్ శ్రీనివాస్ లతో పాటు అభిమానులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




