న్యూదిల్లీ,ఫిబ్రవరి27 : ఏపీ మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు లో నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం విచారించింది. ఈ కేసుకు సంబంధించి సెషన్స్ కోర్టులో విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నామని… అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ముగించింది. కాగా.. గతేడాది చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన నారాయణకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయగా… దాన్ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు నారాయణకు బెయిల్ రద్దు చేస్తూ రిమాండ్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై నారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం నారాయణ బెయిల్‌పై బయట ఉన్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముందగా నారాయణ కుమార్తె ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు.. ఒక్కరోజు వ్యవధిలో మాజీ మంత్రి ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కుటుంబీకుల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పరిశీలించారు. అలాగే పలు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు సమాచారం.
అలాగే ముందుగా నారాయణ కుమార్తె నివాసంలోనూ ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలోని ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. సీఐడీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు నారాయణపై సీఐడీ అధికారులు పలు కేసులు పెట్టారు. నారాయణపై పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీతో పాటు, అమరావతి రాజధాని భూముల కు సంబంధించి కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో భాగంగా సీఐడీ అధికారులు పలుమార్లు నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా నారాయణ ఇళ్లలో సోదాలు ముగిసిన అనంతరం ఆయన కుమార్తెలను ఏపీ సీఐడీ అధికారులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.




