-ప్రధానిని కలవాలంటే కోవిడ్ టెస్ట్ తప్పనిసరి
-అన్ని రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న కరోనా
-ప్రజలు అప్రమత్తంగా వుండాలి: ఆరోగ్యశాఖ
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. పదుల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం కూడా అప్రమత్తమైంది. ఇకపై ప్రధాని మోదీని కలిసే మంత్రులు, ప్రభుత్వ శాఖ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పీఎంవో సూచించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్ లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య 6,815 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగా 324 మందికి ఈ వ్యాధి సోకింది. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మరో 783 మంది కోలుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో 68 మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ కూడా వ్యాప్తి చెందుతున్నట్లు కనుగొనబడింది.
దేశ వ్యాప్తంగా 163 మంది సోకిన వారిలో కొత్త ఓమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఎఫ్ జి ఉనికిని కనుగొన్నట్లు ఇండియన్ జెనోమిక్స్ కన్సార్టియం ప్రకటించింది. గతంలో జెఎన్1 , ఎల్‌ఎఫ్7 మరియు ఎక్స్ఎఫ్ జి వంటి ఓమిక్రాన్ వేరియంట్‌లు భారతదేశంలో వ్యాపిస్తున్నాయని ఐసిఎంఆర్ నిర్ధారించింది. కేరళలో 96 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం సోకిన వారి సంఖ్య 2,053కు చేరుకుంది. పీఎంవో సూచన మేరకు బుధవారం సాయంత్రం ప్రధాని మోడీని కలవనున్న దిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా దిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల పార్టీ నాయకులకు రాత్రి 7:30 గంటలకు విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు సమాచారం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం. గత 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదవడంతో పాటు ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,121లకు చేరింది. దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 74కు పెరిగింది. కేరళలో అత్యధికంగా 2,223 యాక్టివ్ కేసులు ఉండగా.. గుజరాత్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.




