అపర చాణక్యుడు భరతమాత ముద్దుబిడ్డ
పీవీ కి “ భారతరత్న”
ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు భారతదేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది.ఈ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ఆయన అనేక సాహసో పేత విధానాలను అనుసరించి ఆర్థిక లోటును తగ్గించగలిగారు. ప్రభుత్వరంగ సంస్థలలో ప్రైవేటీ కరణకు వీలుగా మౌలిక వనరులకు పెట్టుబడులు సమకూర్చగలిగారు. ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను ఆర్థికమంత్రిగా నియమించి ఆర్థిక సంస్కరణల అమలులో సహకారం తీసుకున్నారు. కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను వివిధ సమయాల్లో నిర్వహించారు. 1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవి సాధించారు.
పూర్వ ప్రధానులైన వీపీ సింగ్, చంద్రశేఖర్ పాలనలో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు.. బంగారం విదేశీ బ్యాంకుల్లో కుదువకు పెట్టి తెచ్చిన డబ్బుతో దేశం నడుస్తోంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన స్థితిలో ప్రధాని పదవి చేపట్టి, ఒకవైపు రాజకీయ చదరంగాన్ని ఆడుతూ, మైనారిటీ బలంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూ పీవీ అపర చాణక్యుడిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచారు. పీవీ బహుభాషావేత్త, రచయిత. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి. ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నారు పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే..
పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. కాశ్మీరు తివ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరాన్ లతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని. 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే అణుబాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయీనే ప్రకటించారు.
రాజకీయాల్లో క్షణం తీరికలేకున్నా, పీవీ తన వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషి గా ఇది తెలుగులోకి అనువాదమయింది. వివిధ భాషల్లోకి అనువాదమయింది. ప్రముఖ రచయిత్రి “జయ ప్రభ” కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో రాసారు. ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశ్యం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసారు.
—- నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్ – 98481 28215





